Indian Railways SwaRail App: భారతీయ రైల్వే కొద్ది రోజుల క్రితం ‘స్వరైల్’ యాప్ ను ఆవిష్కరించింది. రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలు అన్నీ ఒకేచోట లభించేలా దీనిని రూపొందించింది. అత్యంత యూజర్ ఫ్రెండ్లీగా ఆకట్టుకునే ఇంటర్ ఫేజ్ తో అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఒక్కో రైల్వే సేవ కోసం ఒక్కో యాప్ ను వాడాల్సి వచ్చేది. IRCTC రైల్ కనెక్ట్, UTS సహా పలు యాప్ లు అందుబాటులో ఉండేవి. అన్ని యాప్స్ వాడాలంటే వినియోగదారులకు ఇబ్బందిగా ఉండేది. అందుకే.. రైల్వేకు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట లభించేలా ఈ యాప్ ను రూపొందించింది. కొంతకాలం పాటు ఎంపిక చేసిన ఆండ్రాయిడ్, iOS వినియోగదారుల కోసం బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. రీసెంట్ గా కంప్లీట్ వెర్షన్ విడుదల అయ్యింది.
‘స్వరైల్’ యాప్ గురించి 10 ముఖ్యమైన విషయాలు
⦿ ‘స్వరైల్’ యాప్ ను రైల్వేశాఖ పరిధిలోని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(CRIS) అభివృద్ధి చేసింది. ఈ యాప్ రైల్వే ప్రయాణీకులందరికీ సేవలు అందిస్తుంది.
⦿ ‘స్వరైల్’ యాప్ ద్వారా రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. రిజర్వ్ చేయబడిన, రిజర్వ్ చేయని బెర్తులను గుర్తింవచ్చు. టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ‘మై బుకింగ్స్’ ద్వారా మీ గత ప్రయాణ వివరాలను ట్రాక్ చేయవచ్చు.
⦿ ‘స్వరైల్’ యాప్ ఒకే సైన్ ఆన్ వ్యవస్థను కలిగి ఉంది. అదే సమయంలో Rail Connect, IRCTC వివరాలోనూ సైన్ ఇన్ చేయవచ్చు. లేదంటే కొత్త అకౌంట్ ను క్రియేట్ చేసుకోవచ్చు.
⦿ ఈ యాప్ ద్వారా రైలుకు సంబంధించి రియల్ టైమ్ రన్నింగ్ ను ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. రైళ్ల ఆలస్యం, అంచనా రాక సహా ఇతర కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందే అవకాశం ఉంటుంది.
⦿ ఈ యాప్ ద్వారా రైలులో మీ కోచ్ ఎక్కడ ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్లాట్ ఫారమ్‌కు చేరుకున్న తర్వాత బోర్డింగ్ ప్రక్రియను అనుమతిస్తుంది.
⦿ మీరు రైలులో ఉన్నప్పుడు నిర్దిష్ట విక్రేతల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది ‘స్వరైల్’ యాప్.
⦿ ఈ యాప్ లో ప్లాన్ షిప్ మెంట్, ట్రాక్ షిప్‌మెంట్, టెర్మినల్ ఫైండర్ లాంటి సరుకు రవాణా సాధనాలు ఉన్నాయి.
⦿ ఆయా అంశాలకు సంబంధించి భారతీయ రైల్వేకు ఫిర్యాదులు చేయడానికి, ట్రాక్ చేయడానికి ‘రైల్ మదద్’ ఫీచర్ ను కలిగి ఉంది.
⦿ టికెట్ల బుకింగ్ సమయంలో చెల్లింపులు చేయడానికి డిజిటల్ వాలెట్ అయిన R-Wallet ఈ యాప్ లో ఉంటుంది. ఈ యాప్ ద్వారా రద్దు చేయబడిన, మిస్ అయిన ప్రయాణాలకు సంబంధించి రీఫండ్ ను పొందే అవకాశం ఉంటుంది.
⦿ ‘స్వరైల్’ యాప్ ఇంటర్ ఫేస్ పలు భాషల్లో అందుబాటులో ఉంది. ఎవరికి నచ్చిన భాషలో వాళ్లు ఉపయోగించుకోవచ్చు.
భారతీయ రైల్వే తీసుకొచ్చిన ఈ అత్యాధునిక ‘స్వరైల్’ యాప్ రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడంలో ఉపయోగపడుతుంది.
Read Also: రైల్వే స్టేషన్లలో మెట్రో తరహా ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు.. ఇక అలా వెళ్లడం కష్టమే!