One Rupee Train Ticket: ఇండియన్ రైల్వేలో జరిగిన వింతలు, విశేషాలు తెలుసుకుంటే ఔరా అనేస్తారు. ప్రపంచ స్థాయి గుర్తింపు అనతికాలంలో సాధించిన ఇండియన్ రైల్వే చరిత్ర ఘనం. బొగ్గు రైలు నుండి మొదలై నేడు వందే భారత్ వరకు మన రైల్వే సాధించిన ఘనత మనకు గర్వకారణం. అయితే ఒక్క రూపాయికే రైల్వే టికెట్ అందుబాటులోకి తెచ్చిన ఘనత కూడా మన రైల్వేదే. అంతేకాదు పైసల్లో కూడా టికెట్ కొని ప్రయాణం చేసిన ఘనత మనది. మీరు ఆశ్చర్యపోవద్దు ఇది నిజం.. పైసల నుండి రూపాయి వరకు రైల్వే టికెట్ అందబాటులో ఉన్న రోజుల్లోకి ఒకసారి వెళదాం. తప్పక ఈ కథనం పూర్తిగా చదవండి.. ఇండియన్ రైల్వే ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.
ఆశ్చర్యపోవద్దు.. ఇది నిజం
ఒక్క రూపాయికే రైలు టికెట్ అనే విషయం నేడు విన్నపుడు ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ ఇది నిజమే. భారతీయ రైల్వే చరిత్రలో కొన్ని దశాబ్దాల క్రితం, చిన్న దూర ప్రయాణాలకు కేవలం రూ.1కే టికెట్లు ఇచ్చేవారు. అది ఒక సామాన్యుడికి అందుబాటులో ఉన్న, ప్యాకెట్ ఫ్రెండ్లీ ప్రయాణ మార్గం. అప్పటి రైల్వే వ్యవస్థ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతిరూపంగా నిలిచిందని చెప్పవచ్చు.
పైసాకే టికెట్..
1853లో భారతదేశంలో మొదటి ప్రయాణికుల రైలు ముంబై బోరి బందర్ నుంచి థానే వరకు నడిచింది. అప్పట్లో ఈ ప్రయాణం దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఆ సమయంలో రైల్వే టికెట్ ధరలు కూడా మనకు ఆశ్చర్యం కలిగించేలా ఉండేవి. మొదటి తరగతి టికెట్ ధర 30 పైసలు కాగా, రెండవ తరగతి టికెట్ 16 పైసలు, మూడవ తరగతి 9 పైసలు, మరియు నాల్గవ తరగతి టికెట్ కేవలం 5 పైసలు మాత్రమే. ఇది ఇప్పటి కరెన్సీతో పోలిస్తే కేవలం నాణా విలువంతే. ఈ ధరలు కొన్ని దశాబ్దాల పాటు కొనసాగాయి. ముఖ్యంగా చిన్న పట్టణాల మధ్య, చిన్న దూర ప్రయాణాల కోసం ఒక్క రూపాయికే రైలు టికెట్లు అందుబాటులో ఉండేది. ఈ విధంగా చౌకగా అందిన రైలు ప్రయాణం, సాధారణ ప్రజల జీవితాల్లో భాగమై, వారికి ప్రయాణంలో ఆర్థిక భారం లేకుండా ఊరటనిచ్చింది. ఇప్పుడైతే ఈ టికెట్లు మనకు గుర్తుగా మాత్రమే మిగిలిపోయినా, ఆ కాలపు సొగసైన గుర్తులు మాత్రం ఎప్పటికీ మనముందు నిలిచిపోతాయి.
కాచిగూడలో కూడ..
1950ల నుండి 1990ల మధ్య కాలంలో, దేశంలోని పలు ప్రాంతాల్లో చిన్న పట్టణాల మధ్య రైలు ప్రయాణానికి ఒక్క రూపాయి, అంతకంటే తక్కువ ధరల టికెట్లు అందుబాటులో ఉండేవి. కాచిగూడ – యాకుత్‌పురా, జడ్చర్ల – శంషాబాద్, కొత్తపేట -దబ్బీర్‌పురా వంటి చిన్న దూరాల ప్రయాణాలకు ఈ ధర వర్తించేది. ఈ ప్రయాణాలు సాధారణంగా 10 నుండి 20 కిలోమీటర్ల మధ్య ఉండేవి. అటువంటి ప్రయాణాలకు బస్సుల కన్నా కూడా తక్కువ ఖర్చుతో రైలు ప్రయాణం సాగేది. అప్పుడు టికెట్ కొనుగోలు ప్రక్రియ కూడా చాలా సింపుల్. స్టేషన్ కౌంటర్లో సాధారణ అనే టికెట్ విండో వద్ద రూపాయి ఇచ్చి, టికెట్ తీసుకొని, డైరెక్ట్‌గా ప్లాట్‌ఫామ్ పైకి వెళ్లిపోవచ్చు. టికెట్ పైన ముద్రించే ధర చూసి చాలామంది చిరునవ్వు తెప్పించుకునేవారు.
Also Read: Indian Railways Wonders: ఈ రైల్వే స్టేషన్ లేకుంటే.. ఏపీలో ఎక్కడి రైళ్లు అక్కడే..
ఈ రకమైన రైలు ప్రయాణానికి ప్రధాన కారణాలు
అప్పట్లో ఇంత తక్కువ రైల్వే టికెట్స్ ఉండేందుకు ప్రధాన కారణం తెలుసుకుంటే. ఆ సమయంలో డీజిల్ ధరలు తక్కువగా ఉండటం, నిర్వహణ ఖర్చులు తగ్గిపోవడం, పాలకుల దృష్టి సామాన్యులపై ఉండటమని చెప్పవచ్చు. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ద్రవ్యోల్బణం పెరగడం, ఇంధన ధరలు విపరీతంగా పెరగడం, రైలు నిర్వహణ ఖర్చులు అధికమవడం వంటివి టికెట్ ధరలపై ప్రభావం చూపించాయి. 2000ల ప్రారంభం నుండి రూపాయి టికెట్ మన ఇండియన్ రైల్వే చరిత్ర నుండి దాదాపుగా కనుమరుగైంది. స్థానం బట్టి మినిమమ్ టికెట్ ధర రూ.5కి, ఆపై రూ.10కి పెరిగింది. ప్రస్తుతం మినిమమ్ టికెట్ ధర రూ.10 నుంచి మొదలవుతుంది.
ఇండియన్ రైల్వే సేవలు అదరహో..
ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతీయ రైల్వే ఎంతో కాలం పాటు సామాన్యుల ప్రయాణానికి సులభమైన మార్గంగా నిలిచింది. రూపాయి టికెట్ ఒక్కటి, నాటి జనరేషన్ కు అందుబాటులో ఉన్న ప్రయాణ సౌకర్యాన్ని సూచించే చిహ్నం. ఇది కేవలం తక్కువ టికెట్ మాత్రమే కాదు. అది ఒక ఆలోచన. సామాన్యుడిని గౌరవించాల్సిన తత్వం. నేడు ఒక్క రూపాయి టికెట్ లేదు కానీ, దాని వెనుక ఫిలాసఫీ మాత్రం, అందరికీ సమాన ప్రయాణ హక్కు మాత్రం చిరకాలం నిలిచిపోతుంది. ఈ నేపథ్యాన్ని బట్టి చూస్తే, ఒక్క రూపాయికే రైలు టికెట్.. ఇండియన్ రైల్వే ఐడియా అదుర్స్ అనే మాట నిజంగా తగినదే!