Indian Railways: భారతీయ రైల్వే మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తరచుగా రైల్వే స్టేషన్లలో తొక్కిసలాటలు జరగడంతో పాటు టికెట్ లేకుండా ప్రయాణం చేసే వారిని అడ్డుకునేందుకు కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తోంది. మెట్రో తరహాలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ముందుగా ఈ విధానాన్ని ముంబైలో అమలు చేయబోతోంది. సబర్బన్ రైల్వే నెట్ వర్క్ లో మొదటగా వీటిని పరిచయం చేబోతోంది. వెస్ట్రన్ రైల్వే లైన్ లోని కీలక స్టేషన్లలో మెట్రో స్టైల్ నియంత్రిత ఎంట్రీ సిస్టమ్ ను ప్రారంభిస్తోంది.
తొలి దశలో 12 స్టేషన్లలో ప్రారంభం
భారతీయ రైల్వే తొలి దశలో భాగంగా మొత్తం12 రైల్వే స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయబోతోంది. ముంబైలోని బాంద్రా టెర్మినస్, బోరివాలి, అంధేరి రైల్వే స్టేషన్లలో ఈ విధానం అందుబాటులోకి రానుంది. అటు గుజరాత్ లోని తొమ్మిది స్టేషన్లలో కొత్త తరహా ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త విధానం ద్వారా ప్రయాణీకులు మెట్రో వ్యవస్థ మాదిరిగా ఏర్పాటు చేసిన గేట్ల ద్వారా ఎంట్రీ ఇవ్వడంతో పాటు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. టికెట్ ధృవీకరణ, సెక్యూరిటీ స్క్రీనింగ్, పీక్ అవర్స్ లో రద్దీ కంట్రోల్ చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఇండియన్ రైల్వే భావిస్తోంది. ఈజీగా ప్రయాణీకులు రాకపోకలు కొనసాగించడంతో పాటు మెరుగైన భద్రత ఏర్పడనుంది. అదే సమయంలో టికెట్ లేని ప్రయాణం పూర్తిగా కంట్రోల్ అవుతుంది.
🚨 Indian Railways is set to introduce metro-style controlled entry/exit systems at key railway stations. pic.twitter.com/zvPyYe5sG4
— Indian Tech & Infra (@IndianTechGuide) May 23, 2025
ఎలివేటెడ్ డెక్‌లు, మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్
రైల్వే స్టేషన్లలో మెట్రో తరహా ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేసే దిశగా ఇండియన్ రైల్వే కీలక చర్యలు చేపట్టింది. ఈ మార్పుకు మద్దతుగా భారత రైల్వే ఆయా స్టేషన్లలో ఎలివేటెడ్ డెక్ లను నిర్మిస్తోంది. ఈ డెక్‌లు టికెట్ కౌంటర్లు, స్క్రీనింగ్ ప్రాంతాలను కలిగి ఉంటాయి. ఇవి రద్దీని కంట్రోల్ చేయడంతో పాటు ప్లాట్ ఫారమ్ మీద గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా సాయపడుతాయి. ఇప్పటికే ముంబైలో ఏసీ సబర్బన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం పట్ల ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు మెట్రో తరహా ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తీసుకురావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్మార్టర్ కమ్యూటింగ్ దిశగా కీలక అడుగులు
ప్రస్తుతం ముంబైలో మూడు రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తీసుకురాబోతున్న ఈ కొత్త విధానం సక్సెస్ అయితే, ముంబై సబర్బన్ నెట్ వర్క్ అంతటా దీనిని విస్తరించనున్నారు. ఈ విధానం ద్వారా టికెట్ లేని ప్రయాణాన్ని నియంత్రించడంతో పాటు స్టేషన్లలో జరిగే దొంగతనాలను కూడా సమర్థవంతంగా అడ్డుకునే అవకాశం ఉందంటున్నారు రైల్వే అధికారులు. రేపటి సురక్షిత, వేగవంతమైన రవాణా వ్యవస్థలో ఇదో కీలక ముందుడుగు కాబోతోందంటున్నారు. మహా కుంభమేళా సందర్భంగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఈ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ వచ్చింది. ఇప్పుడు ఆ డిమాండ్ నిజం కాబోతోంది.
Read Also: హైదరాబాద్ మెట్రో లోకో పైలెట్స్ సాలరీ ఇంతేనా? మీరు అస్సలు ఊహించి ఉండరు!