Indian Railways New Super App: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రయాణీకులు సులభంగా రైల్వే సేవలను పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే ఇండియన్ రైల్వేస్ సూపర్ యాప్ ను పరిచయం చేయబోతున్నది. ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగుపరచబోతోంది. ఈ ఏడాది డిసెంబర్ లో ప్రధాని మోడీ ఈ సూపర్ యాప్ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత IRCTC అప్లికేషన్ తో పాటు ఇతర రైల్వే అప్లికేషన్లలో లభిస్తున్న అన్ని సేవలు ఇకపై ఈ సూపర్ యాప్ లో అందుబాటులోకి రానున్నాయి. ఈ సరికొత్త యాప్ ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) రూపొందిస్తోంది. ప్రస్తుతం ఈ యాప్ ఫైనల్ టెస్ట్ జరుపుకుంటోంది.
ప్రస్తుతం పలు యాప్స్ ద్వారా రైల్వే సేవలు.
ప్రస్తుతం పలు రకాల యాప్స్ ద్వారా రైల్వే సేవలు లభిస్తున్నాయి. కొన్ని కొన్ని యాప్స్ లో కొన్ని సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రైల్వే సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది రైల్వే సంస్థ. వినియోగదారులకు రైల్వే సేవలను సులభంగా అందించేలా ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.
ఇండియన్ రైల్వేస్ సూపర్ యాప్ ప్రత్యేకత ఏంటి?
ఇప్పటి వరకు టికెట్ బుకింగ్స్ కోసం చాలా యాప్స్, వెబ్ సైట్స్ ద్వారా చేసుకునేవారు. పలు యాప్స్ ఉపయోగించడం ద్వారా టైమ్ వేస్ట్ అయ్యేది. రైల్వే సంస్థకు చెందిన ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ, అన్ని రైల్వే సేవలను పొందే అవకాశం లేదు. ఈ సూపర్ యాప్ తో అన్ని సమస్యలకు చెక్ పడనున్నాయి. సులభంగా, వేగంగా టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, రైళ్లలో ఆయా క్లాసుల ప్రకారం సీట్ల లభ్యతను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైళ్లలో ఫుడ్ డెలివరీ సేవలను కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చు. నచ్చిన ఫుడ్ ను ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫుడ్ డెలివరీ వివరాలను ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇప్పటి వరకు ఫ్లాట్ ఫారమ్ టికెట్లను స్టేషన్ లోని కౌంటర్లలో కొనుగోలు చేయాల్సి ఉండేది. కానీ, ఇకపై సూపర్ యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చెయ్యొచ్చు. ఈ పాస్‌లు ఎలాంటి సమస్యలు లేకుండా రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రానిక్‌గా వెరిఫై చేయబడతాయి. అంతేకాదు, ఈ అప్లికేషన్ రియల్ టైమ్ రైలు ట్రాకర్‌ను కూడా అందిస్తుంది. ఇది రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి వినియోగదారుకు సహాయపడుతుంది. అంతేకాదు, ప్రయాణీకులు దిగాల్సిన రైల్వే స్టేషన్ దగ్గర టిక్ పెట్టుకుంటే, ఓ స్టేషన్ కు ముందే అలర్ట్ చేస్తుంది. పొరపాటున ముందుకు వెళ్లిపోయే అవకాశం ఉండదు. మొత్తంగా భారతీయ రైల్వేలలో ఈ యాప్ ఓ మైల్ స్టోన్ గా నిలువబోతోంది.
Read Also: రైల్వే టిక్కెట్లు ఇన్ని రకాలా? ఒక్కోదాని మధ్య తేడా ఏంటి? వాటిని ఎలా బుక్ చేసుకోవాలంటే?