Indian Railways: ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా సౌత్ సెంట్రల్ అధికారులు తన పరిధిలో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు తగిన చర్యలు చేపడుతుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్- చెన్నై రైల్వే ప్రయాణీకులకు కీలక అలర్ట్ జారీ చేశారు. రోజూ హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు ఇకపై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆగదన్నారు. కొత్తగా నిర్మించిన చర్లపల్లి నుంచి తన ఆపరేషన్స్ ను కొనసాగించనున్నట్లు తెలిపారు. అటు చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చే ఎక్స్ ప్రెస్ ఇకపై చర్లపల్లి వరకే రానుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద ట్రాఫిక్ తగ్గించడమే లక్ష్యంగా..
సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లకు విపరీతంగా రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే సంస్థ చర్లపల్లిలో కొత్త రైల్వే టెర్మినల్ ను నిర్మించింది. 9 ప్లాట్ ఫారమ్ లను ఏర్పాటు చేశారు. అత్యాధునిక వసతులను కల్పించారు. సుమారు రూ. 430 కోట్ల వరల్డ్ క్లాస్ సదుపాయాలతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొద్ది నెలల క్రితమే ప్రధాని మోడీ ఈ రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభించారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ఇప్పటికే పలు రెగ్యులర్, స్పెషల్ రైళ్లు రాకపోకలను కొనసాగిస్తున్నాయి. అత్యాధునిక వసతులు ప్రయాణీకులను ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.
సికింద్రాబాద్ – గోరక్ పూర్ పేరు మార్పు
తాజాగా సికింద్రాబాద్- గోరఖ్ పూర్ మధ్య నడుస్తున్న రైలును చర్లపల్లి నుంచి నడిపిస్తున్నారు. ఇప్పటికే ఈ రైలు పేరును కూడా మార్చారు. గోరఖ్ పూర్- చర్లపల్లి ఎక్స్ ప్రెస్ గా నేమ్ ఛేంజ్ చేశారు. ఇకపై ఈ రైలు సికింద్రాబాద్ నుంచి కాకుండా చర్లపల్లి నుంచి రాకపోకలు కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ లో ఇకపై ఈ రైలు ఆగదని అధికారులు వెల్లడించారు. రాకపోకలు అన్నీ చర్లపల్లి నుంచే ఉంటాయన్నారు.
చెన్నై- హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ నేమ్ ఛేంజ్
ఇక హైదరాబాద్ నుంచి చెన్నై సెంట్రల్, చెన్నై నుంచి హైదరాబాద్ మధ్య నడిచే చెన్నై ఎక్స్ ప్రెస్ ఇకపై చర్లపల్లి నుంచి రాకపోకలను కొనసాగించనుంది. దీనికి తాజాగా చర్లపల్లి- చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ గా పేరు మార్చారు. మున్ముందుకు మరిన్ని రైళ్లను ఇక్కడి నుంచే నడిపించే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: ఇకపై టికెట్ ఉంటేనే రైల్వే స్టేషన్ లోకి ఎంట్రీ, రైల్వేశాఖ కీలక నిర్ణయం!
సికింద్రాబాద్ మీద తగ్గుతున్న ప్రెజర్
ఇప్పటికే పలు రైళ్లు సికింద్రాబాద్ నుంచి కాకుండా చర్లపల్లి నుంచి రాకపోకలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రయాణీకులు రిలాక్స్ గా ఫీలవుతున్నారు. గతంతో పోల్చితే ఎలాంటి హడావిడి లేకుండా రాకపోకలను కొనసాగిస్తున్నారు. గతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి వెళ్లినప్పటికీ, ఫ్లాట్ ఫారమ్ లు ఖాళీగా లేక రైళ్లు బయటే నిలిపేవాళ్లు. ఇప్పుడు ఆయా రైళ్లకు అవసరమైన ట్రాక్ లు అందుబాటులో ఉంటున్నాయి.
Read Also: దేశంలో అత్యధిక ప్లాట్ ఫారమ్ లు ఉన్న రైల్వే స్టేషన్ ఇదే, రోజూ ఇక్కడి నుంచి ఎన్ని రైళ్లు నడుస్తాయంటే?