Indian Railways: గత కొంత కాలంగా దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట ఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో, వాటిని నివారించేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్లాట్ ఫారమ్‌లలో రద్దీని నివారించడానికి.. బెంగళూరు సహా 60 రద్దీగా ఉండే స్టేషన్లలో టికెట్ ఉంటేనే లోపలికి అనుమతించాలని నిర్ణయించింది. తాజాగా రైల్వే ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, దేశంలోని ప్రధాన స్టేషన్లలో రద్దీ నియంత్రణ చర్యలను అమలు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం కీలక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
టికెట్ ఉంటేనే రైల్వే స్టేషన్ లోకి ఎంట్రీ
దేశంలోని 60 ప్రధాన రైల్వే స్టేషన్ల వెలుపల శాశ్వత వెయిటింగ్ ఏరియాను నిర్మించాలని నిర్ణయించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అక్కడి నుంచి టికెట్ ఉన్న వాళ్లనే ప్లాట్ ఫారమ్ మీదికి అనుమతించనున్నట్లు తెలిపారు. “దేశంలోని 60 ప్రధాన స్టేషన్లలో ఇకపై ప్రయాణీకులు యాక్సెస్ నియంత్రించబడుతుంది. ధృవీకరించబడిన టికెట్లు ఉన్న ప్రయాణీకులకు ప్లాట్ ఫారమ్ లకు నేరుగా యాక్సెస్ ఇవ్వబడుతుంది. టికెట్ లేనివారు, వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నవారు బయటి వెయిటింగ్ ఏరియాలో వేచి ఉంటారు. స్టేషన్లలోని అన్ని అనధికార ఎంట్రీ పాయింట్లను క్లోజ్ చేస్తారు” అని రైల్వేమంత్రి ప్రకటించారు.
పలు స్టేషన్లలో పైలెట్ ప్రాజెక్టు శ్రీకారం
న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, వారణాసి, అయోధ్య, పాట్నా స్టేషన్లలో యాక్సెస్ కంట్రోల్ పైలట్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని భారతీయ రైల్వే సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయంతో పెద్ద మొత్తంలో వచ్చే ప్రయాణీకులు వెయిటింగ్ ప్రాంతంలోనే ఆగనున్నారు. రైళ్లు వచ్చినప్పుడు మాత్రమే ప్రయాణీకులు ఆయా ప్లాట్ ఫారమ్ లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. దీని వలన స్టేషన్లలో రద్దీ తగ్గుతుందని రైల్వే సంస్థ తెలిపింది.
Read Also: దేశంలో అత్యధిక ప్లాట్ ఫారమ్ లు ఉన్న రైల్వే స్టేషన్ ఇదే, రోజూ ఇక్కడి నుంచి ఎన్ని రైళ్లు నడుస్తాయంటే?
తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో కీలక చర్యలు
రీసెంట్ గా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి ఘటనలకు తావు లేకుండా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2024 పండుగ సీజన్‌లో, సూరత్, ఉధ్నా, పాట్నా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లలో తొక్కిసలాటలు జరిగాయి. మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్ లోని తొమ్మిది స్టేషన్లలో కూడా ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇకపై ఎలాంటి తొక్కిసలాటలకు తావు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు రైల్వేసంస్థ తెలిపింది. అంతేకాదు, దేశంలోని 60 ప్రధాన రైల్వే స్టేషన్లలో పర్యవేక్షణ కోసం పెద్ద సంఖ్యలో కెమెరాలు ఏర్పాటు చేయబడతాయని వెల్లడించింది. పెద్ద స్టేషన్లలో వార్ రూమ్ లను ఏర్పాట చేస్తారు. రద్దీ పరిస్థితులలో అన్ని విభాగాల అధికారులు వార్ రూమ్ లో పని చేస్తారు. స్టేషన్ సామర్థ్యం, అందుబాటులో ఉన్న రైళ్ల ప్రకారం టికెట్ల అమ్మకాలను నియంత్రించనున్నట్లు రైల్వే సంస్థ తెలిపింది. ఇందుకు సంబంధించిన అధికారాన్ని స్టేషన్ డైరెక్టర్ కు అందిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తంగా ఇకపై రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట ఘటనలకు తావు లేకుండా రైల్వేశాఖ తగిన చర్యలు చేపడుతోంది.
Read Also: ఏపీ నుంచి యూపీకి మూడేళ్ల జర్నీ.. అత్యంత ఆలస్యమైన రైలుపై PIB ఆసక్తిర వ్యాఖ్యలు!