IRCTC Char Dham Yatra Package: దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే భక్తుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నది IRCTC. అందులో భాగంగానే ఐకానిక్ చార్ ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టింది. భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు ద్వారా ఈ యాత్రను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ ప్రత్యేక రైలు బద్రీనాథ్, పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకాధీష్ లాంటి ప్రముఖ క్షేత్రాలను కవర్ చేస్తుంది.
చార్ ధామ్ యాత్ర టూర్ ప్యాకేజీ
చార్ ధామ్ యాత్ర మే 27న ఢిల్లీ సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం కానుంది. 17 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రను ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) లీడ్ చేస్తోంది. వెళ్లాలి అనుకునే భక్తులు IRCTC వెబ్ సైట్ నుంచి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
యాత్రల భక్తులు దర్శించుకునే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు
⦿ బద్రీనాథ్: పవిత్ర బద్రీనాథ్ ఆలయం, మన విలేజ్, జోషిమఠ్ ను సందర్శించవచ్చు.
⦿ రిషికేశ్, పూరి జగన్నాథ్, కోణార్క్ సూర్య దేవాలయం, చంద్రభాగ బీచ్ కు వెళ్లవచ్చు.
⦿ రామేశ్వరం, ధనుష్ కోటి, ప్రసిద్ధ రామనాథస్వామి ఆలయానికి వెళ్లవచ్చు.
⦿ ద్వారకాధీశ ఆలయం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, బైట్ ద్వారకకు వెళ్లవచ్చు.
⦿వారణాసి, పూణే, నాసిక్‌లోని జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకోవచ్చు.
భారత్ గౌరవ్ AC టూరిస్ట్ రైలు ప్రత్యేకత
భారత్ గౌరవ్ డీలక్స్ AC టూరిస్ట్ రైలు అద్భుతమైన సౌకర్యాలను కలిగి ఉంటుంది. డైనింగ్ రెస్టారెంట్లు, షవర్ క్యూబికల్స్ ఉంటాయి. ఈ రైలులో ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ క్లాస్ ఉంటాయి. ప్రతి కోచ్ సీసీటీవీ నిఘాలో ఉంటుంది. కోచ్ కు ఇద్దరు చొప్పున గార్డులు ఉంటారు. ఈ ప్యాకేజీలో 3-స్టార్ హోటల్ వసతి, శాఖాహార భోజనాలు, ఆలయాల సందర్శనకు వెళ్లినప్పుడు ఏసీ వాహనాల్లో తీసుకెళ్తారు. ప్యాకేజీకి సంబంధించి ఛార్జీ వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు IRCTC వెళ్లడించింది.
చార్ ధామ్ యాత్ర ప్యాకేజీ వివరాలు
చార్ ధామ్ టూర్ ప్యాకేజీలో భాగంగా ఆఫ్-బోర్డ్ ప్రయాణం, హోటల్ బసలు, గైడ్‌లు, భోజనం, భీమా, సౌకర్యవంతమైన ప్రయాణం ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 196 టూర్లను నిర్వహించింది. 1,26,981 మంది ప్రయాణీకులు భారత్ గౌరవ్ రైళ్ల ద్వారా పర్యటించారు. ఇక ఉత్తరాఖండ్ లోని మంచుకొండల్లో కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తాజాగా తెరుచుకున్నాయి. తెల్లవారుజామున ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమహా విష్ణువును దర్శించుకునేందుకు దేశ నలుమూలతో పాటు నేపాల్ నుంచి సైతం భక్తులు తరలివచ్చారు.