Indian Railways: ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అందులో భాగంగానే ఇవాళ్టి (మే 1) నుంచి టికెట్ రిజర్వేషన్లలో కీలక మార్పులు చేసింది. రైల్వే టికెట్ బుకింగ్ దుర్వినియోగాన్ని తగ్గించడంతో పాటు డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు ఈ నిబంధనలను అమలు చేస్తోంది. ఒకవేళ మీరూ రైలు టికెట్ బుక్ చేయాలనుకుంటే కొత్తగా అమల్లోకి వచ్చిన రూల్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
⦿ టికెట్ బుకింగ్ కోసం ఓటీపీ
రైల్వే టికెట్ బుకింగ్ విషయంలో ఎలాంటి మోసాలకు తావు లేకుండా కొత్త పద్దతిని అమలు చేయబోతోంది భారతీయ రైల్వే. IRCTC పోర్టల్, యాప్ ద్వారా టికెట్ బుక్ చేయాలంలే సదరు ప్రయాణీకుడి ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే టికెట్ బుక్ అవుతుంది. పేమెంట్స్ గేట్ వేలోకి ప్రవేశించే ముందు ప్రయాణీకులు మొబైల్ నంబర్‌ను వన్ టైమ్ పాస్‌వర్డ్ తో కన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఇకపై టికెట్ బుక్ చేసుకునే ప్రతి ఒక్క వినియోగదారుడికి ఓటీపీ వస్తుంది. ఈ విధానం ద్వారా రైల్వే టికెట్ బుకింగ్ ల దుర్వినియోగాన్ని అడ్డుకునే అవకాశం ఉంటుంది.
⦿ అడ్వాన్స్ బుకింగ్ గడువు తగ్గింపు
రైల్వే ముందస్తు రిజర్వేషన్ వ్యవధిలోనూ కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు 120 రోజుల ముందు నుంచి అడ్వాన్స్ గా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండగా, ఇకపై ఆ గడువు 90 రోజులకు తగ్గనుంది. మే 1 నుంచి ప్రత్యేక రైళ్లు, పండుగ సర్వీసులు కాకుండా, మిగతా రైళ్లు అన్నింటికీ 90 రోజుల ముందు నుంచి టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. కొత్త విధానం వల్ల రైళ్ల షెడ్యూల్, వినియోగం మెరుగుపడుతుందని రైల్వే సంస్థ వెల్లడించింది.
⦿ క్యాన్సిలేషన్ రీఫండ్ టైమ్ తగ్గింపు
ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ కు సంబంధించి రీఫండ్ టైమ్ ను కూడా కుదిస్తున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. ఈ విధానం కూడా మే 1 నుంచే అందుబాటులోకి వచ్చింది. గతంలో రీఫండ్ ప్రాసెసింగ్ టైమ్ గరిష్టంగా 5-7 వర్కింగ్ డేస్ ఉండేది. అప్ గ్రేడ్ చేసిన టెక్నాలజీ, మెరుగైన బ్యాంక్ సమన్వయంతో,.. ప్రయాణీకులకు టికెట్ రద్దు చేసిన 48 గంటల్లోపు వారికి రీఫండ్ అందించనుంది. ఈ రూల్ ఆన్ లైన్ బుకింగ్ లతో పాటు బ్యాంక్ ఖాతాతో లింక్ ఉన్న కౌంటర్ బుకింగ్‌లకు వర్తిస్తుంది.
ఎందుకీ కొత్త మార్పులు?
తాజాగా తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం.. రైలు ప్రయాణాలలో ఎక్కువ పారదర్శకత, భద్రత, సామర్థ్యాన్ని అందించనుంది. భారతీయ రైల్వే వ్యవస్థ సంస్కరణలకు ముందు, బుకింగ్‌లలో అవాంతరాలు, వాపసులలో జాప్యం గురించి రైల్వే మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు వచ్చేవి. తాజాగా తీసుకున్న నిర్ణయాలతో ప్రయాణీకులకు కేవలం రెండు రోజుల్లోనే రీఫండ్ లభించనుంది. మే 1 నుండి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రయాణీకులు కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
Read Also: 4 రంగుల్లో ఇండియన్ పాస్ పోర్టులు, ఇది ఉంటే వీసా లేకుండానే విదేశాలకు వెళ్లొచ్చు!