Indian Passports: భారతీయ పౌరులు విదేశీ ప్రయాణం చేయడానికి భారత ప్రభుత్వం ఇచ్చే అధికారిక ధృవపత్రం పాస్ పోర్టు. పాస్ పోర్టు అవసరం లేకుండా కొన్ని దేశాలకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రముఖ దేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పాస్ పోర్టు ఉండాల్సిందే. భారత ప్రభుత్వం నాలుగు రకాల పాస్ పోర్టులను జారీ చేస్తుంది. ఈ నాలుగు రకాల పాస్ పోర్టులు నాలుగు రంగుల్లో ఉంటాయి. వీటిలో సాధారణ పౌరులకు అందించే పాస్ పోర్టు నుంచి మొదలుకొని, దౌత్య అధికారుల వరకు రకరకాల పాస్ పోర్టులను అందిస్తారు. చూడ్డానికి అన్ని ఒకే సైజులో ఉన్నా, రంగులు వేరుగా ఉంటాయి. ఇంతకీ ఏ రంగు పాస్ పోర్టు ఎవరికి ఇస్తారు? ఆయా పాస్ పోర్టులతో కలిగే లాభాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
⦿ నేవీ బ్లూ కలర్ పాస్ పోర్టు: దీనిని ‘టైప్ పీ’ పాస్ పోర్టుగా పిలుస్తారు. సామాన్య పౌరులకు ఇస్తారు. ఈ పాస్ పోర్టు సాయంతో భారతీయ పౌరులు ఏ దేశంలోకి అయినా వెళ్లవచ్చు. ఇది నేవీ బ్లూ కలర్ లో ఉంటుంది. విదేశాల్లో చదువు, వ్యాపారం, విదేశీ పర్యటనలు చేయడానికి ఈ పాస్ పోర్టు ఉపయోగపడుతుంది.
⦿ వైట్ కలర్ పాస్ పోర్టు: దీనిని ‘టైప్ ఎస్’ పాస్ పోర్టుగా పిలుస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి సివిల్ సర్వీస్ అధికారులకు అందిస్తారు. ప్రభుత్వ పనుల్లో భాగంగా విదేశాలకు వెళ్లే అధికారులకు ఈ పాస్ పోర్టు ఇస్తారు. ఈ పాస్ పోర్టుతో వెళ్లే భారతీయ అధికారులకు ఇమ్మిగ్రేషన్ అధికారులు వెంటనే క్లియరెన్స్ ఇస్తారు. ఈ పాస్ పోర్టు ఉన్న అధికారులు విదేశాల్లో స్థానిక అధికారుల నుంచి సాయం పొందే అవకాశం ఉంటుంది.
⦿ మెరున్ కలర్ పాస్ పోర్టు: దీనిని ‘టైప్ డీ’ పాస్ పోర్టుగా పిలుస్తారు. దీనిని భారతీయ దౌత్య అధికారులకు అందిస్తారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రులు, విదేశీ వ్యవహారాల ముఖ్య అధికారులకు కూడా ఇదే పాస్ పోర్టును అందిస్తారు. ఈ పాస్ పోర్టు ఉన్న వారు విదేశాలకు వెళ్లడానికి వీసా అవసరం లేదు. ఆయా ఎయిర్ పోర్టులలో ఈజీ క్లియరెన్స్ ఉంటుంది.
⦿ ఆరెంజ్ కలర్ పాస్ పోర్టు: ఈ రకం పాస్ పోర్టు 10వ తరగతి చదివిన భారత పౌరులకు అందివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, పెద్దగా చదువుకోని వారిని ఈజీగా గుర్తించడానికి ఉపయోగపడేలా ఇవ్వాలి భావించింది. ఈ పాస్ పోర్టు ఉన్న వాళ్లు ఇమ్మిగ్రేషన్ చెక్ తప్పనిసరి కేటగిరీ కేటగిరీ కిందికి వస్తారు. ఈ పాస్ పోర్టు ఉన్నవాళ్లు విదేశాలకు వెళ్లే సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్దేషించిన నిబంధనలను క్లియర్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ రకం పాస్ పోర్టుల మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. ఇలాంటి పాస్ పోర్టుల కారణంగా వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ పాస్ పోర్టులను వ్యతిరేకిస్తూ కొంత మంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆరెంజ్ పాస్ పోర్టు ప్రతిపాదనలను విరమించుకుంది.
Read Also: పెళ్లి చేసుకుంటారు, కానీ.. రొమాన్స్ చెయ్యరు.. ఆ దేశంలో కొత్త ట్రెండ్ మొదలు!