Indian Railways: దేశ వ్యాప్తంగా నిత్యం సుమారు 20 వేల రైళ్లు నడుస్తున్నాయి. తరచుగా కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తుంటాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించక, సిగ్నలింగ్ సమస్యల కారణంగా, రైల్వే లైన్ల మెయింటెనెన్స్ పనుల వల్ల కొన్ని రైళ్లు ఆలస్యం అవుతుంటాయి. ఆయా సందర్భాన్ని బట్టి రైళ్లు కొన్ని నిమిషాలు, లేదంటే కొన్ని గంటల పాటు లేట్ అవుతుంటాయి. కానీ, ఓ రైలు తన గమ్యస్థానానికి చేరుకోవడానికి 3 సంవత్సరాల 8 నెలల 7 రోజులు పట్టింది. భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఆలస్యంగా నడిచిన రైలుగా గుర్తింపు తెచ్చుకుంది.
ఏపీ నుంచి యూపీకి చేరేందుకు మూడేళ్లు
నిజానికి ఈ రైలు కథ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ స్టోరీలా అనిపిస్తుంది. ఒక గూడ్స్ రైలు కేవలం 1,400 కిలో మీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2014 నవంబర్ 10న విశాఖపట్నం నుంచి ఉత్తర ప్రదేశ్ బస్తీకి ఓ గూడ్స్ రైలు 1,316 డీఏపీ బస్తాల వ్యాగన్ తో బయల్దేరింది. ఈ రైలు తన గమ్యస్థానానికి 2018 జూలై 25న చేరుకుంది. ఈ గూడ్స్ వ్యాగన్ ను చూసి రైల్వే అధికారులు, సిబ్బంది షాక్ కు గురయ్యారు. కేవలం 42 గంటల్లో రావాల్సిన రైలు మూడేళ్ల తర్వాత రావడంతో పరేషాన్ అయ్యారు.
డీఏపీ బస్తాలతో బయల్దేరిన గూడ్స్
బస్తీకి చెందిన ఎరువుల వ్యాపారి రామచంద్ర గుప్తా విశాఖపట్నంలోని ఇండియన్ పొటాష్ లిమిటెడ్ కంపెనీ నుంచి సుమారు రూ. 14 లక్షల విలువ చేసే డీఏపీ బస్తాలను కొనుగోలు చేశాడు. ఆ బస్తాలను వైజాగ్ నుంచి బస్తీకి తెచ్చేందుకు రైల్వే అధికారులతో మాట్లాడి ఓ వ్యాగన్ ను బుక్ చేసుకున్నాడు. ఈ ఎరువు బస్తాలు అనుకున్న సమయానికే వైజాగ్ పొటాష్ కంపెనీ నుంచి బయల్దేరింది. కానీ, అనుకున్న సమయానికి బస్తీకి చేరుకోలేదు. రామచంద్ర గుప్తా ఆందోళనకు గురయ్యారు. వ్యాగన్ ఎందుకు రాలేదో చెప్పాలని రైల్వే అధికారులను అడిగినా ఫలితం లేకపోయింది. ఆయన రోజూ రైల్వే స్టేషన్ కు రావడం, వచ్చిందా? అని అడిగి వెళ్లడం కామన్ అయ్యింది. ఈ రైలు మార్గ మధ్యంలో తప్పిపోయిందని అధికారులు భావించారు. రైల్వే అధికారులు కూడా ఈ రైలు గురించి మర్చిపోయారు. చివరకు ఈ రైలు జులై 2018న బస్తీ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అప్పటికే వ్యాగన్ లోని ఎరువు బస్తాలు పనికిరాకుండా పోయాయి. రామచంద్ర గుప్తా వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. అయితే, ఈ రైలు ఎందుకు ఆలస్యం అయ్యిందనే విషయంపై రైల్వే అధికారులు క్లారిటీ ఇవ్వలేదు.
రైలు ఆలస్యంపై PIB ఆసక్తికర వ్యాఖ్యలు
మూడేళ్లు ఆలస్యంగా గమ్య స్థానానికి చేరుకున్న రైలు గురించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఏ గూడ్స్ రైలు కూడా తన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి అంత సమయం తీసుకోలేదని వెల్లడించింది. “ఒక గూడ్స్ రైలు తన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి మూడు సంవత్సరాలు పట్టిందని అనేక వార్తల వచ్చాయి. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. దేశంలో ఏ గూడ్స్ రైలు కూడా తన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఇంత సమయం తీసుకోలేదు” అని PIB సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
Read Also: గంటకు 400 కిలో మీటర్ల వేగం.. చైనా ఫాస్టెస్ట్ ట్రైన్ ప్రత్యేకతలు చూస్తే మతిపోవాల్సిందే!