DA Hike: హోలీ పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం త్వరలో డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు గురించి ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈసారి ప్రభుత్వ ఉద్యోగులకు 2 నుంచి 3 శాతం డీఏ పెంపుదల ఉంటుందని తెలుస్తోంది. ఈ పెంపు నిర్ణయం తర్వాత దాదాపు 1.2 కోట్ల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందనున్నారు.
ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు కరువు భత్యాన్ని మార్చుతుంది. జనవరి తరువాత జూలైలో మార్పు చేస్తారు. జనవరి సవరణను సాధారణంగా హోలీ సమయంలో ప్రకటిస్తారు. ఇక జూలై మార్పు గురించి అక్టోబర్ లేదా నవంబర్ నెలలో దీపావళి పండుగ సమయంలో అనౌన్స్ చేస్తారు.
డిసెంబర్ 2024 డేటా ప్రకారం ఈసారి DA 2 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో DA, DR 55 శాతానికి చేరుకుంటాయి. అయితే తుది నిర్ణయం మాత్రం ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. మార్చి 7, 2024న కేబినెట్ డీఏను మునుపటి రేటు 46 శాతం నుంచి మూల వేతనంలో 50 శాతానికి పెంచింది ఈ ప్రకటన హోలీకి కొన్ని రోజుల ముందు మార్చి 25, 2024న వచ్చింది. దీని తరువాత అక్టోబర్ 16, 2024న 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DAలో 3 శాతం, పెన్షనర్లకు DRలో 7 శాతం పెంపుదలను కేబినెట్ ఆమోదించింది. ఈ పెరుగుదలతో DA, DR రెండూ 53 శాతానికి చేరుకున్నాయి.
8వ వేతన సంఘం 2026లో అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో DAని తిరిగి చెల్లించి మూల వేతనంలో విలీనం చేస్తారా అని కూడా అనేక మంది ఆలోచిస్తున్నారు. 8వ వేతన సంఘం సిఫార్సులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తుది రూపం దాల్చుతాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మార్పుకు ముందు, 7వ వేతన సంఘం ప్రకారం మరో మూడు డీఏ పెంపుదల ప్రకటించే అవకాశం ఉంది.
ఈసారి హోలీ మార్చి 14న వస్తుంది. మార్చి 14 లోపు డీఏ పెంపుదల ప్రకటించడం ద్వారా మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ బహుమతి ఇవ్వాలని భావిస్తోంది. ఇది మాత్రమే కాదు, డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు, డియర్‌నెస్ రిలీఫ్ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. దీని అర్థం పెన్షనర్ల పెన్షన్ కూడా పెరగనుంది. దీంతో ఈసారి జనవరి 2025 నుంచి అమలు చేయబోయే డీఏ పెంపు ప్రకటన మరికొన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.
Read Also: Womens Day 2025: ఉమెన్స్ డే స్పెషల్.. మహిళల భద్రత కోసం టాప్ 5 యాప్స్