Indian Railways: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారత రైల్వేలో గణనీయమైన మార్పులు వచ్చాయి. రైల్వే ప్లాట్ ఫామ్ ల ఆధునీకరణ నుంచి 100 శాతం రైల్వే విద్యుదీకరణ వరకు అద్భుతమైన ప్రగతి సాధించింది. అత్యాధునిక సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్లు ప్రజలకు మెరుగైన సౌకర్యాలతో వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత పవర్ ఫుల్ హైడ్రోజన్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగి రైల్వే సంస్థల్లో నాలుగో స్థానంలో ఉన్న భారతీయ రైల్వే ఎన్నో రికార్డులను కలిగి ఉంది. రోజూ దేశ వ్యాప్తంగా సుమారు 13 వేల ప్యాసింజర్ రైళ్లు తమ సేవలను అందిస్తున్నాయి. వీటిలో కొన్ని ఎక్కువ దూరం ప్రయాణిస్తే, మరికొన్ని తక్కువ దూరం ప్రయాణిస్తాయి. కొన్ని అత్యంత వేగంగా ప్రయాణిస్తే, మరికొన్ని నెమ్మదిగా ప్రయాణిస్తాయి. ఇక దేశంలోనే ఎటువంటి స్టాప్ లు లేకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైళ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఏక బిగిన 500 కిలో మీటర్ల ప్రయాణం
దేశంలో అత్యధిక దూరం నాన్ స్టాప్ గా వెళ్లే రైలుగా ముంబై సెంట్రల్- హపా దురంతో ఎక్స్ ప్రెస్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు దాదాపు 500 కి.మీ.లు ఎటువంటి స్టాప్‌లు లేకుండా ప్రయాణిస్తుంది. ముంబై నుంచి హపాకు వెళ్లే ఈ రైలు మార్గ మధ్యలో కేవలం మూడు చోట్ల ఆగుతుంది. ఈ రైలు ముంబై నుండి రాత్రి 11 గంటలకు బయల్దేరుతుంది. ఎక్కడా ఆపకుండా ఏకంగా 493 కి.మీ ప్రయాణించి, ఉదయం 4:50 గంటలకు అహ్మదాబాద్ కు చేరుకుంటుంది. ఈ ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు దాదాపు 6 గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత మరో రెండు స్టేషన్లలో ఆగి హపాకు వెళ్తుంది.
అప్పట్లో అత్యంత దూరం ప్రయాణించే నాన్ స్టాప్ రైలు ఏదంటే?
ముంబై సెంట్రల్- హపా దురంతో ఎక్స్ ప్రెస్ రైలు కంటే ముందు.. దేశంలో అత్యంత దూరం నాన్-స్టాప్ రైలుగా త్రివేండ్రం-నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ ప్రెస్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి కేరళ రాజధాని త్రివేండ్రం వరకు ప్రయాణిస్తుంది. దాదాపు 2,845 కి.మీ.ల దూరాన్ని 42 గంటల్లో పూర్తి చేసేది. గతంలో ఈ రైలు రాజస్థాన్ లోని కోట నుంచి గుజరాత్ లోని వడోదర వరకు దాదాపు 528 కి.మీ.లు నాన్ స్టాప్ గా ప్రయాణించేది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ లోని రత్లం దగ్గర ఓ స్టాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో దాని నాన్ స్టాప్ ప్రయాణం 258 కి.మీకి తగ్గించినట్లు అయ్యింది. ముంబై – హపా రైలు తర్వాత పూణే- హౌరా దురంతో ఎక్స్ ప్రెస్ కూడా నాన్ స్టాఫ్ గా ఎక్కువ దూరం ప్రయాణించే రెండో రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు పుణెలో బయల్దేరి నాన్ స్టాఫ్ గా 468 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అటు ముంబై- న్యూఢిల్లీ రైలు సైతం నాన్ స్టాఫ్ గా 465 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
Read Also: జరిమానా లేకుండా రిజర్వేషన్ కోచ్‌లో వెళ్లొచ్చు.. ఇదిగో ఇలా చేస్తే సరి!