Indian Railways: సాధారణంగా రైలు ప్రయాణం చేయాలనుకునే వాళ్లు, ముందుగానే టికెట్లు రిజర్వేషన్ చేయించుకుంటారు. కన్ఫర్మ్ టికెట్ పొందిన వాళ్లు మాత్రమే రిజర్వేషన్ కోచ్ లలో ప్రయాణిస్తుంటారు. అత్యవసర ప్రయాణం చేయాల్సిన వాళ్లు జనరల్ టికెట్ తీసుకొని రైలు ఎక్కాల్సి ఉంటుంది. సాధారణంగా ప్యాసింజర్ రైలులో జనరల్ బోగీలు తక్కువగా ఉంటాయి. ఎక్కువలో ఎక్కువగా 5 కోచ్ లు ఉంటాయి. ప్రయాణీకుల సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.
జనరల్ టికెట్ తో రిజర్వేషన్ కోచ్ లో ప్రయాణం
కొంత మంది ప్రయాణీకులు జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ కోచ్ లో ప్రయాణిస్తుంటారు. కొన్నిసార్లు టీటీకి దొరికి ఫైన్ కడుతుంటారు. ఒక్కోసారి ఎక్కువ మొత్తంలో జరిమానా కట్టాల్సి ఉంటుంది. కొంత మంది టీసీని మేనేజ్ చేస్తారు. ఏంతో కొంత చేతిలో పెట్టి అలాగే ప్రయాణిస్తుంటారు. కానీ, కొన్నిసార్లు తనిఖీల్లో దొరికి పెద్ద మొత్తంలో ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అయితే, మన దగ్గర జనరల్ టికెట్ ఉండి రిజర్వేషన్ కోచ్ లో ప్రయాణిస్తూ, స్క్వాడ్ కు దొరికినా, జరిమానా చెల్లించకుండా తప్పించుకునే అవకాశం ఉంది. జనరల్ టికెట్ ధరకు, రిజర్వేషన్ టికెట్ ధరకు మధ్య ఉన్న అదనపు ఛార్జీలను చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ఎలాంటి సందర్భాల్లో ఈ సదుపాయాన్ని పొందే అవకాశం ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
రిజర్వేషన్ కోచ్ లో బెర్త్ లు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే!
సాధారణంగా రైల్లోని రిజర్వేషన్ కోచ్ లు బెర్తులు ఎప్పుడూ నిండుగానే ఉంటాయి. తక్కువ సందర్భాల్లో బెర్తులు ఖాళీగా ఉంటాయి. ఏ కోచ్ లో ఖాళీలు ఉన్నాయనే విషయం సాధారణంగా ప్రయాణీకులకు తెలియదు. టీటీఈలకు మాత్రమే తెలుస్తుంది. అందుకే, జనరల్ టికెట్ తో రిజర్వేషన్ కోచ్ లోకి ఎక్కేటప్పుడు ముందుగానే టీటీఈని సంప్రదించాల్సి ఉంటుంది. ఎక్కడి వరకు ప్రయాణిస్తారనే విషయాన్ని ఆయనకు చెప్పాలి. జనరల్ టికెట్ ఉంది, రిజర్వేషన్ కోచ్ లలో బెర్తులు ఏమైనా ఖాళీగా ఉన్నాయా? అని అడగాలి. అప్పుడు తన దగ్గర ఉన్న చార్ట్ చూసి ఎక్కడ ఖాళీలు ఉన్నాయో? ఎక్కడ కూర్చోవాలో చెప్తాడు. ఒకవేళ ఖాళీ లేకపోతే లేవని చెప్పేస్తారు. కేవలం రిజర్వేషన్ టికెట్ కు జనరల్ టికెట్ కు మధ్య వ్యత్యాసం ఉన్న ఛార్జీని మాత్రమే వసూళు చేస్తారు. ఇందుకుగాను ఓ రిసీప్ట్ ఇచ్చి బెర్త్ నెంబర్ ను కేటాయిస్తారు. ఆ తర్వాత స్క్వాడ్ వచ్చి తనిఖీలు చేసినప్పటికీ ఫైన్ విధించే అవకాశం లేదు.
అదనపు ఛార్జీని ఎలా వసూళు చేస్తారంటే?
సాధారణంగా రిజర్వేషన్ కోచ్ లో టికెట్ ధర రూ. 500 అయితే, జనరల్ టికెట్ ధర రూ. 190 అయితే, రిజర్వేషన్ కోచ్ లో ప్రయాణిస్తున్నంది రూ. 310 చెల్లిస్తే సరిపోతుంది. టీటీఈని అడగకుండా నేరుగా రిజర్వేషన్ కోచ్ లోకి ఎక్కి ప్రయాణిస్తే పెద్ద మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
Read Also: వేసవి సెలవుల వేళ రైల్వే గుడ్ న్యూస్, చర్లపల్లి నుంచి 26 ప్రత్యేక రైళ్లు!