Kodali Nani’s Red Book : ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వారు వీరు అనడమే కాదు.. టీడీపీ కీలక నేత నారా లోకేష్ అనేక సందర్భాల్లో బహిరంగంగానే రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. సాధారణ జనం అంచనాల మేరకు ఈ బుక్ లోని మొదటి పేజీలోనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు ఉంటుందని భావించారు. వైసీపీ అధికారంలో ఉండగా.. ఆయన అలాంటి పాపులారిటీ సంపాదించారు మరి. నానికి, అతని అనుచరులకు కూడా ఆ లిస్టులో తమ నాయకుడి పేరు ఉంటుందని స్పష్టంగా తెలుసు.. కానీ, అనూహ్యంగా ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలకు ప్రభుత్వం ముందుకు కదలలేదు. చాలా మందికి ఇప్పటికీ ఇది ఆశ్యర్యమే.
ఇటీవల మచిలీపట్నంలో ఓ కేసు ఫైలు అటక మీది నుంచి కిందకి దించారని తెలుస్తోంది. దానికి పట్టిన దుమ్ము దులిపేసి… నెమ్మదిగా పట్టాలపైకి ఎక్కించేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఈ కేసు ఫైలులో ఏముందో, ఎన్నాళ్లు ఆ ఫైలును అడ్డం పెట్టుకుని రాజకీయ ఎత్తులు వేయొచ్చో తెలియదు కానీ.. వెంటనే నాని అప్రమత్తమయ్యారు. ఆ ఫైలు తీసింది తన కోసమే అని అలర్డ్ అయిపోయారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వంలో తాను జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ముందే తెలుసు… అయినా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. సదరు ఫైలును చూపించి తనను అరెస్టు చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ.. హైకోర్టుకు పరుగెత్తారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి వాటా వారు తీసుకోవాల్సి వస్తుందన్న సంగతి వైసీపీలోని చాలా మంది నాయకులకు ముందే అవగాహన ఉంది. కాకపోతే.. ఎవరి వరుస ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు అంతే. అధికారంలో ఉన్నప్పుడు వారి ప్రవర్తన, వారు వ్యవహరించిన తీరు.. మాట్లాడిన మాటాలు.. అన్నీ వారి పేర్లు రెడ్ బుక్ లోకి ఎక్కేందుకు ప్రధాన కారణమన్న సంగతీ తెలుసు. అందుకే.. అందరూ అప్రమత్తంగానే ఉంటున్నారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొడాలికి.. పోలీసుల నుంచే నేరుగా ప్రమాదం ముంచుకు వచ్చింది. కొడాలి నాని పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా, వారిని అవమానపరిచేలా వ్యాఖ్యానించానంటూ మచిలీపట్నం పోలీసులు గతేడాది జూన్ లో కేసు నమోదు చేశారు. తాజాగా.. ఆ కేసులో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో.. రెడ్ బుక్ లోని రెండో పేజీ ఓపెన్ అయ్యింది అని నిర్దారణకు వచ్చిన కొడాలి.. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, కేసులోని ఆరోపణలు నిజం కాదంటూ కోర్టుకు విన్నవించారు.
కొడాలిపై గట్టిగానే టార్గెట్ పెట్టిన పోలీసులు.. కఠిన సెక్షన్లతోనే మూసేసేందుకు ట్రై చేస్తున్నారు. అందుకే.. తనపై నమోదు చేసిన సెక్షన్లు ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవని.. అందువల్ల తనకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. అంతే కానీ.. అరెస్ట్ చేయడం వంటి తీవ్ర చర్యలు తీసుకోకుండా నిరోధించాలని అభ్యర్థించారు. అసలు కేసులోనే నిజాయితీ లేదని.. తన వాదనను పరిగణలోకి తీసుకుని కేసును కొట్టేయాలని కోరారు.
Also Read : YSRCP vs TDP : చూస్కుందాం.. నీ పెతాపమో.. నా పెతాపమో!!
అడిగినవన్నీ జరగడానికి, అయిపోటానికి అధికారులో తమరు లేరు నాని అంటూ టీడీపీ శ్రేణులు, నాయకులు సెటైర్లు పేలుస్తున్నారు. అంతే కాదు.. సోషల్ మీడియాలో, అసెంబ్లీలో నారా భువనేశ్వరీపై అసభ్యకర వ్యాఖ్యలపై చర్యలుంటాయని అంతా భావించారు. కానీ.. పోలీసుల అత్మస్థైర్యం పేరుతో కేసు వెలుగులోకి రావడంతో.. నానిపై రెడ్ బుక్ లో మరిన్ని కేసులు ఎదురు చూస్తున్నాయని అంటున్నారు.