Ananya Nagalla: ప్రస్తుతం ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ గురించే పంచాయతీ నడుస్తోంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యే ముందే ఎలాగైనా ఈ బెట్టింగ్ యాప్స్‌ను అరికట్టాలని పోలీసులు, అధికారులు ఫిక్స్ అయ్యారు. అందుకే ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్‌పై యాక్షన్ తీసుకుంటే ప్రజలు కూడా వింటారేమో అన్న నమ్మకంతో వారిపై కేసులు నమోదు చేసుకొని చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు పోలీసులు. అందులో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల కూడా ఉంది. తను కూడా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిందని బయటపడడంతో దీనిపై క్లారిటీ ఇవ్వడానికి ఒక టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూకు వచ్చింది. అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నకు బిత్తరపోయింది.
కామన్ సెన్స్ ఉండాలి
అసలు బెట్టింగ్ యాప్స్‌ను ఎందుకు ప్రమోట్ చేస్తున్నావంటూ ముందుగా అనన్య నాగళ్ల (Ananya Nagalla)కు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం తప్పు అని మాకు రీసెంట్‌గా అర్థమయ్యింది. బాలీవుడ్‌లో పెద్ద పెద్ద సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా వీటిని ప్రమోట్ చేశారు కదా. వాళ్లు అన్నీ చూసుకునే చేసుకుంటారు కదా అని అనుకున్నాను. కరెక్ట్‌గా చెప్పాలంటే వాళ్లు తప్పు చేసినంత మాత్రానా మనం కూడా తప్పు చేయకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో బేసిక్ కామన్ సెన్స్‌తోనే వ్యవహరించాలి’’ అని చెప్పుకొచ్చింది అనన్య. అప్పుడే తను లా చదివిన విషయాన్ని గుర్తుచేశారు యాంకర్. అవును తాను లా చదివానని కానీ అనుకోకుండా తప్పు జరిగిపోయిందని ఒప్పుకుంది.
డబ్బులు తిరిగిచ్చేశాను
‘‘ఆ సమయంలో ఆలోచించకుండా, అవగాహన లేకుండా చేసేశాను. ఒక వీడియో స్టోరీ పెట్టినందుకు రూ.1,20,000 ఇచ్చారు. అప్పుడు ఇదొక గేమింగ్ యాప్, దీనికోసం ఒక యాడ్ చేస్తున్నానని మాత్రమే అనుకున్నాను. కానీ ఇది బెట్టింగ్ యాప్ అని, దీని వెనుక ఇన్ని ఇబ్బందులు ఉంటాయని అంత ఆలోచన రాలేదు. ఆ తర్వాత వాళ్లు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇచ్చేశాను. వాళ్లు కూడా దీని గురించి మాట్లాడారు. దీని గురించి అవగాహన వచ్చిన తర్వాత ప్రమోషన్ చేయడం ఆపేశాను. ఇంకెప్పుడూ ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి నేను వెళ్లలేదు’’ అని క్లారిటీ ఇచ్చేసింది అనన్య నాగళ్ల. ఇదంతా విన్న తర్వాత ఒక్కసారిగా తెలియక ఇలాంటి పని చేసినందుకు తనపై సీరియస్ అయ్యారు యాంకర్. దీంతో అనన్య ఏం మాట్లాడాలో తెలియక ఒక్కసారిగా బిత్తరపోయింది.
Also Read: అరెస్ట్ భయం.. కోర్టు మెట్లెక్కిన శ్యామల.. నేడే విచారణ..
స్టార్లు సైతం
ఇప్పటికే బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ రమ్మీ యాప్స్ లాంటి వాటిని ప్రమోట్ చేసినందుకు ప్రకాశ్ రాజ్ లాంటి స్టార్లు సైతం చిక్కుల్లో పడ్డారు. విజయ్ దేవరకొండ, రానా కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. దీంతో ఒక్కొక్కరిగా అసలు ఇది ఎందుకు ప్రమోట్ చేశారు, ఎలా ప్రమోట్ చేశారు అనే విషయాలపై క్లారిటీ ఇస్తూ స్టేట్‌మెంట్స్ విడుదల చేశారు. ప్రస్తుతం పోలీసులు వారిపై కేసులు నమోదు చేయడం తప్పా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. పోలీసులు ఫోకస్ అంతా ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్లపైనే ఉంది. ఒక్కొక్కరిగా అందరినీ విచారణకు పిలుస్తూ వారి నుండి వివరాలు సేకరిస్తున్నారు.