India’s Oldest Running Passenger Train: దేశ వ్యాప్తంగా నిత్యంలో 13 వేల ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. వందే భారత్ ఎక్స్ ప్రెస్ మొదలుకొని అమృత్ భారత్, రాజధాని, శతాబ్ది, గరీబ్ రథ్, తేజస్ సహా మరెన్నో రైళ్లు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. సగటున రోజుకు దేశ వ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. అయితే, దేశ వ్యాప్తంగా ఎన్నో కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఇప్పటికీ పలు పురాతన రైళ్లు నడుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న అత్యంత పురాతనమైన రైలు ఏదో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
భారతీయ రైల్వేకు సుమారు 170 ఏండ్లకు పైగా చరిత్ర ఉన్నది. దేశంలో తొలి ప్యాసింజర్ రైలు ఏప్రిల్ 16, 1853న పట్టాలెక్కింది. బోరీ బందర్(ముంబై) నుంచి థానే వరకు నడిచింది. ఆ తర్వాత నెమ్మదిగా రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందింది. అయితే, దేశంలో ప్రస్తుతం నడుస్తున్న అత్యంత పురాతనమైన రైలు ఏది? అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? లేదంటే ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
దేశంలో పురాతనమైన రైలు హౌరా-కల్కా మెయిల్ కు
దేశంలో అత్యంత పురాతనమైన రన్నింగ్ ప్యాసింజర్ రైలు హౌరా-కల్కా మెయిల్. ఈ రైలు పట్టాలెక్కి ఏకంగా 158 ఏండ్లు అయ్యింది. ఇది పశ్చిమ బెంగాల్ లోని హౌరాను హర్యానాలోని కల్కా మధ్య రాకపోకలను కొనసాగిస్తుంది. ఈ రైలు జనవరి 1, 1866న తొలి ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అప్పట్లో దీన్ని హౌరా- పెషావర్ ఎక్స్ ప్రెస్ అని పిలిచేవారు. ఈ రైలు మొదట హౌరా- ఢిల్లీ మధ్య నడిచింది. 1891లో ఢిల్లీ నుండి కల్కా వరకు విస్తరించింది. బ్రిటిష్ కాలంలో హౌరా-కల్కా మెయిల్ ను ఆంగ్లేయ అధికారులు.. అప్పటి భారత రాజధాని కోల్ కతా నుంచి వేసవి రాజధాని సిమ్లా వరకు ప్రయాణించడానికి ఉపయోగించారు.
మూడు సార్లు పేరు మార్చుకున్న హౌరా-కల్కా మెయిల్
హౌరా-కల్కా మెయిల్ పేరు మూడుసార్లు మార్చబడింది. మొదట దీనిని ఈస్ట్ ఇండియా రైల్వే మెయిల్ అని పిలిచేవారు. తర్వాత దీన్ని కల్కా మెయిల్ గా మార్చారు. 1941లో బ్రిటిష్ పాలకుల నుంచి తప్పించుకోవడానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధన్ బాద్ జిల్లాలోని గోమోహ్ లో ఈ రైలు ఎక్కారని నమ్ముతారు. ఈ నేపథ్యంలో 2021లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం హౌరా-కల్కా మెయిల్ పేరును ‘నేతాజీ ఎక్స్ ప్రెస్’గా మార్చింది.
ఎన్నో చారిత్రక ఘటనలకు ప్రత్యక్ష సాక్షి
ఈ రైలు భారత దేశంలోని ఎన్నో చారిత్రక సంఘటనలను చూసింది. వలస పాలన నుంచి స్వాతంత్ర్యం, ఆధునిక భారతం వరకు అన్ని పరిణామాలను గమనించింది. కాలంతో పాటు వెనక్కి ప్రయాణించి.. చారిత్రాత్మక జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనుకునే వాళ్లు హౌరా- కల్కా మెయిల్ లో ఓసారి ప్రయాణించాల్సిందే. గుండె నిండా మరపురాని ప్రయాణ అనుభవాన్ని పొందాల్సిందే.
Read Also: మీ ట్రైన్ టికెట్ పోయిందా? కంగారు పడకండి.. సింఫుల్ గా డూప్లికేట్ టికెట్ పొందండిలా!