IRCTC Affordable Goa Trip: దేశంలో కచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రాంతాల్లో గోవా ఒకటి. అందమైన బీచ్‌లు, చారిత్రక కట్టడాలు, నైట్ లైఫ్, అడ్వెంచర్ స్పోర్ట్స్, టేస్టీ ఫుడ్ కోసం ప్రతి ఏడాది లక్షల మంది పర్యాటకులు గోవాను సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. గోవా టూర్ ప్లాన్ చేస్తున్న వాళ్లు ఈ ప్యాకేజీలో భాగంగా ఎంజాయ్ చేసి రావచ్చు.
IRCTC ‘గోవా డిలైట్’ పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో విమాన ప్రయాణం, హోటల్‌లో బస, భోజన సదుపాయం, ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శన అన్నీ కలిపి ఉంటాయి. కేవలం నాలుగు రోజుల్లో గోవాలోని ముఖ్యమైన ప్రదేశాలను చూసేలా ఈ టూర్‌ను రూపొందించింది.
ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 9న హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం విమానంలో బయలుదేరి మధ్యాహ్నానికి గోవా చేరుకుంటారు. నాలుగో రోజు మధ్యాహ్నం గోవా నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభమై సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు.
ఈ టూర్ మొత్తం మూడు రాత్రులు, నాలుగు రోజుల పాటు ఉంటుంది. ప్యాకేజీ ధరలు కూడా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిర్ణయించారు. ఒక వ్యక్తి ఒంటరిగా ప్రయాణిస్తే రూ.24,640 చెల్లించాలి. ఇద్దరు కలిసి వెళ్లే వారికి ఒక్కొక్కరికి రూ.19,200 ఖర్చవుతుంది. ముగ్గురు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరికి రూ.18,680గా నిర్ణయించారు. పిల్లల కోసం కూడా ప్రత్యేక ఛార్జీలు ఉన్నాయి. రెండు నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలకు రూ.15,520, రెండు నుంచి నాలుగు సంవత్సరాల చిన్నారులకు రూ.9,130గా ప్యాకేజీ ధర నిర్ణయించారు.
మొదటి రోజు గోవా చేరుకున్న తర్వాత హోటల్‌లో చెక్-ఇన్ చేస్తారు. సాయంత్రం స్థానిక మార్కెట్లు, పరిసర ప్రాంతాలను సందర్శించడానికి అవకాశం ఉంటుంది. రెండో రోజు సౌత్ గోవా టూర్ నిర్వహిస్తారు. ఇందులో ప్రముఖ మ్యూజియంలు, ప్రసిద్ధ శ్రీ మంగేషి ఆలయం, మిరామర్ బీచ్ లాంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. సాయంత్రం మండోవి నదిలో క్రూయిజ్ ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేశారు. మూడో రోజు నార్త్ గోవాలోని ప్రముఖ ప్రాంతాలను చూపిస్తారు. అగువాడా కోట, కాండోలిమ్ బీచ్, అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చాపోరా కోట లాంటి పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. అలాగే ఆసక్తి ఉన్నవారు వాటర్ స్పోర్ట్స్ లో కూడా పాల్గొనవచ్చు. నాలుగో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.
ఈ ప్యాకేజీలో విమాన టిక్కెట్లు, ఏసీ హోటల్ వసతి, మూడు రోజుల బ్రేక్‌ఫాస్ట్, మూడు రోజుల డిన్నర్, పర్యాటక ప్రాంతాలకు రవాణా సదుపాయం కూడా ఉన్నాయి. గోవా ట్రిప్‌ను తక్కువ ఖర్చుతో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేయాలనుకునే వారికి ఈ ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
Read Also: లడఖ్ ట్రిప్ కోసం రూ.20 వేలు ఇస్తున్న ప్రభుత్వం, ట్రావెలర్స్ కు పండగే!