IRCTC: ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుకింగ్ చేయాలంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కి వెళ్లాల్సిందే. లేకుంటే దానికి సంబంధించిన యాప్ వెళ్లి టికెట్లు బుక్ చేసుకునేవారు. రైల్వే ప్రయాణికులతో ఆ విధంగా ముడిపడింది ఆ సంస్థ. ఇప్పుడు తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడింది ఐఆర్‌సీటీసీ. ఇకపై బస్సు టికెట్లను సైతం ఐఆర్ సీటీసీలో బుక్ చేసుకోవచ్చు. అదెలా అంటారా? అక్కడికి వచ్చేద్దాం.
వ్యాపారం విస్తరణలో IRCTC
IRCTC అంటే Indian Railway Catering and Tourism Corporation. భారత ప్రభుత్వానికి చెందిన ఒక సంస్థ. రైల్వేశాఖకు అనుబంధంగా పని చేస్తుంది. సరిగ్గా 1999లో స్థాపించబడిన ఈ సంస్థ. రైల్వే ప్రయాణికులకు రకరకాల సేవలు అందిస్తుంది. ప్రధానంగా రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేయడానికి వినియోగదారులకు సేవలు అందిస్తుంది. దేశంలో అతిపెద్ద ఈ-కామర్స్ సైట్లలో ఒకటిగా పేరు సంపాదించింది.
రైల్వే స్టేషన్లు, రైళ్లలో భోజనం సరఫరా చేస్తుంది కూడా. ఈ-కేటరింగ్, ఫుడ్ ప్లాజా, ఫాస్ట్ ఫుడ్ యూనిట్‌లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు సైతం ఉన్నాయనుకోండి. అలాగే IRCTC ప్యాకేజీ టూర్లు, భక్తి యాత్రలు, బర్డ్ వాచింగ్, హాలీడే ప్యాకేజీలు వంటి పర్యాటక సేవలను అందిస్తుంది. భారత దర్శన్, రామాయణ యాత్ర వంటి పర్యాటక రైళ్లు భాగం. నాలుగేళ్ల కిందట విమాన టికెట్ల బుకింగ్ సదుపాయాన్ని మొదలుపెట్టింది.
ఇకపై బస్సు టికెట్ల బుకింగ్
ఇప్పుడు ఐఆర్‌సీటీసీ తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడింది. మార్కెట్లో తనకున్న ఇమేజ్‌ని మరింత పెంచుకునే పనిలో పడింది. ఇకపై ఐఆర్‌సీటీసీలో బస్సు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అందుకోసం ప్రత్యేకంగా www.bus.irctc.co.in పేరిట వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. రైల్వే టికెట్ల మాదిరిగానే బస్సు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ వివరాలను నమోదు చేయవచ్చు.
ALSO READ: చర్లపల్లి నుంచి విశాఖకు స్పెషల్ రైళ్లు
ప్రయాణికులు కావాల్సిన సీట్లను ఎంచుకోవచ్చు. వారి ప్రాధాన్యతల ప్రకారం ఎంచుకోవచ్చు. మొబైల్ ద్వారా బస్సు టిక్కెట్లను బుక్ చేసుకునే వీలు కల్పించింది. ఇందులో యూపీ, ఏపీ, ఒడిషా, కేరళ, గుజరాత్ ఇలా ఎన్నో రాష్ట్రాల బస్సు టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం తీసుకొచ్చింది.
ఆఫర్ల మాటేంటి?
ఇక వ్యాపారానికి వద్దాం. స్టాక్ మార్కెట్లో లిస్టయ్యింది ఈ కంపెనీ. ఒక్కో షేర్ రేటు 770 పైమాటే అనుకోండి. అది వేరే విషయం. ఇప్పటికే బస్సు టికెట్లు బుకింగ్ కారిడార్ వ్యవస్థలో రెడ్ బస్, ఇస్ మై ట్రిప్, గోఐబిబో వంటి వెబ్‌సైట్లు, యాప్‌లు ఉన్నాయి. కొత్తగా ఐఆర్‌సీటీసీ కూడా ఎంటరైంది.
ఎవరి వల్ల ఎవరికి పోటీ ఉంటుందో చూడాలి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు మిగతా బుకింగ్ సంస్థలు అప్పుడప్పుడు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఐఆర్‌సీటీసీ ఆ విధంగా ఇస్తుందా? అన్నది అసలు పాయింట్. లేకుంటే ఛార్జీలను తగ్గించి ఇస్తుందా? అన్నదే అసలు పాయింట్. మొత్తానికి ఆన్‌లైన్ బస్సు టికెట్లు బుకింగ్ విషయంలో మిగతా యాప్స్‌కు ఐఆర్‌సీటీసీ గట్టి పోటీ ఇవ్వవచ్చని భావిస్తున్నాయి మార్కెట్ వర్గాలు.