Water Bottle kills Teenager| విధి ఎంతో విచిత్రమైనది. ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరూ చెప్పలేరు. కాసేపు క్రితం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అనుకోకుండా ప్రాణాలు వదిలేస్తాడు. అంతా బాగుందని అడుగేస్తే పెద్ద ప్రమాదం జరిగిపోతుంది. ఇలాంటి అనూహ్య ఘటనలు గురించి తెలిసి అందరూ షాకైపోతారు. అదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోతారు. తాజాగా అలాంటి ఒక ఘటన జరిగింది. ఒక టీనేజ్ బాలుడు పక్కనే నిలబడి ఉండగా.. అతనిపై ఒక వాటర్ బాటిల్ పడింది.. అంతే అతను ఆ బాటిల్ తాకగానే ఆ దెబ్బకు కుప్పకూలాడు. ఆ తరువాత లేవలేదు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లా లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. మార్చి 14 2025 బాదల్ సింగ్ గోడ్ ఠాకర్ అనే 14 ఏళ్ల కుర్రాడిపై అనుకోకుండా ఒక వాటర్ బాటిల్ వచ్చిపడింది. ఆ బాటిల్ అతని ఛాతీ భాగానికి బలంగా తాకింది. అంతే ఆ దెబ్బకు అతను కింద పడిపోయాడు. ఆ తరువాత పక్కనే ఉన్న అతని స్నేహితులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు అతడు మరణించాడని ధృవీకరించారు.
ఈ విషయం అతని తల్లిదండ్రులకు తెలియడంతో వారు నిర్ఘాంతపోయారు. ఏం జరిగిందో? అసలు ఎవరికీ తెలియ లేదు. అందుకే బాదల్ తండ్రి సంతోష్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజ్ కోట్ జిల్లా షాపర్ వెరావల్ ప్రాంతంలో రైల్వే ట్రాక్స్ సమీపంగా బాదల్ తన స్నేహితులతో నిలబడి ఉండగా.. ట్రైన్ నుంచి ఎవరో వాటర్ బాటిల్ విసిరేశారని.. ఆ బాటిల్ బాదల్ ఛాతీ భాగానికి బలంగా తాకిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Also Read: ఐపిఎల్ చూస్తూ ప్రమాదవశాత్తు తుపాకీ పేల్చిన బాలుడు.. పొరుగింటి వ్యక్తి మృతి
దీంతో పోలీసులు ఈ కేసులో విచారణ చేపట్టారు. ఏప్రిల్ 1న బాదల్ తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణలో భాగంగా సిసిటీవి వీడియోలను చాలా రోజులపాటు చెక్ చేశారు. చివరికి ఆ బాటిల్ విసిరిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీశారు. రైల్వే ట్రాక్స్ పరిసరాల్లో లభించిన సిసిటీవి వీడియోల ఆధారంగా ఆ వాటర్ బాటిల్ ఆ ట్రైన్ నడిపే అసిస్టెంట్ లోకో పైలట్ విసిరినట్లు పోలీసులు గుర్తించారు. అందుకే ఆ ట్రైన్ లో డ్యూటీ చేసిన శివ రామ్ గుర్జార్ అనే అసిస్టెంట్ లోకో పైలట్ ని అదుపులోకి తీసుకున్నారు.
విచారణ సమయంలో పోలీసులు గట్టిగా ప్రశ్నించగా.. నిందితుడు శివరామ్ గుర్జార్ తన తప్పును అంగీకరించాడు. ఆ బాటిల్ తానే విసిరేశానని అందులో సగం బాటిల్ వరకూ నీళ్లు ఉన్నాయని తెలిపాడు. పోలీసులు భారత న్యాయ సంహిత చట్టంప ప్రకారం.. శివరామ్ గుర్జార్ పై నిర్లక్ష్యం కారణంగా ఒకరి మరణానికి కారణమైనందుకు కేసు నమోదు చేశారు. మనం చేసే నిర్లక్ష్యం కారణంగా ఎదుటివారి ప్రాణాలకు ప్రమాదం కలగవచ్చని ఈ ఘటన ద్వారా నిరూపితమైంది. అందుకే అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం చాలా అవసరం.