Heavy Rains In AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ తదుపరి 12 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది.
దక్షిణకోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాల నేపథ్యంలో ఏపీఎస్డీఎంఏ అధికారులతో హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని హోంమంత్రి సూచించారు. సహయక చర్యలకు NDRF, SDRF, పోలిస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24/7 అలర్ట్ గా ఉండాలని సూచించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక మెసేజ్ లు పంపాలని తెలిపారు. సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు. ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు.
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం.. బుధవారం మధ్యాహ్ననికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో నిన్న పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు రికార్డు అయ్యాయి. మంగళవారం(21 అక్టోబర్) ఉదయం 8:30 గంటల నుండి బుధవారం(22 అక్టోబర్) ఉదయం 8:30 గంటల వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 18.3 మి.మీటర్లుగా నమోదైంది. తిరుపతి జిల్లా సగటు వర్షపాతం 92.3 మి.మీ. నెల్లూరు జిల్లా సగటు వర్షపాతం 60.8 మి.మీ, చిత్తూరు జిల్లా 39.5 మి.మీ, అన్నమయ్య జిల్లా 37.7 మి.మీ, కడప జిల్లా 22.9 మి.మీ, ప్రకాశం జిల్లా 24.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.
Also Read: AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రానున్న 5 రోజులు అతి భారీ వర్షాలు