ఆధ్యాత్మిక పర్యటనలను కోరుకునే పర్యాటకులకు IRCTC మరో అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘పవిత్ర కాశీ’ టూర్ పేరుతో ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఇది ఉత్తర భారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించేలా ప్లాన్ చేసింది. వారణాసి (ఉత్తర ప్రదేశ్), ప్రయాగ్‌రాజ్ (ఉత్తర ప్రదేశ్), అయోధ్య (ఉత్తర ప్రదేశ్), బోధ్ గయా (బీహార్)లో పర్యటించేలా రూపొందించింది. ఈ ప్యాకేజీ ప్రయాణికులను పురాతన దేవాలయాలు, పాత ఘాట్‌లు, బౌద్ధ ప్రదేశాలకు తీసుకెళుతుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణించాలనుకునే వ్యక్తుల బడ్జెట్, ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్యాకేజీ రూపొందించబడింది. ఈ పర్యటనలో ప్రయాణికుల దర్శన టిక్కెట్లను కూడా IRCTC బుక్ చేయడం విశేషం.
ఈ ప్యాకేజీ కోసం IRCTC పాయింట్ టు పాయింట్ ట్రావెట్ తో పాటు హోటల్ బసలు, సందర్శన కోసం స్థానిక కోచ్‌లు, ప్రధాన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు గైడెడ్ సందర్శనల కోసం విమాన కనెక్టివిటీని ఉపయోగిస్తోంది. ఈ పర్యటన కోయంబత్తూర్ లో ప్రారంభం అవుతుంది. 18 నవంబర్ 2025న పర్యటన షెడ్యూల్ చేయబడింది. 23 నవంబర్ 2025 వరకు (ఐదు రాత్రులు, ఆరు రోజులు) కొనసాగుతుంది.
ఇక ఈ పర్యటనలో భాగంగా భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అయిన వారణాసి (కాశీ) సందర్శన ఉంటుంది. ఐకానిక్ కాశీ విశ్వనాథ ఆలయానికి నిలయమైన ఈ నగరంలో సందర్శకులు గంగా హారతి, పడవ ప్రయాణం, పాత నగర దారుల పర్యటించనున్నారు. ఆ తర్వాత కుంభమేళా జరిగిన త్రివేణి సంగమం అయిన ప్రయాగ్ రాజ్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత అయోధ్యలో అడుగు పెడతారు. కొత్తగా పునరుద్ధరించబడిన రామమందిరంతో అయోధ్య మరొక ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. చివరగా ముఖ్యమైన బౌద్ధ తీర్థయాత్ర స్థలం బోధ్ గయాకు వెళ్తారు. ఇక్కడే గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందాడు.
ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.39,750గా నిర్ణయించారు రైల్వే అధికారులు. నిర్దిష్ట బోర్డింగ్ పాయింట్లు, హోటల్ గది ఎంపిక చేసుకున్న పర్యాటకులకు వర్తించే ప్రాథమిక ధర ఇది. ఉన్నత స్థాయి(మెరుగైన హోటళ్ళు, ప్రైవేట్ క్యాబిన్లు, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు) కావాలనుకునే వారికి ధర పెరుగుతుంది.
IRCTC టూర్ ప్యాకేజీ కోసం బుకింగ్‌లను అధికారిక IRCTC టూరిజం పోర్టల్ ద్వారా చేయవచ్చు. అంతేకాదు, అధికారిక రైల్వే టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ల దగ్గర కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే బుకింగ్ ప్రారంభం అయిన నేపథ్యంలో టూరిస్టులు వెంటనే టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. చివరి క్షణంలో వెళ్లాలి అనుకున్నా, టికెట్లు అందుబాటులో లేక ఇబ్బంది పడకూడదన్నారు. వీలైనం త్వరగా టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆధ్యాత్మిక పర్యటన చేసే అవకాశం ఉందన్నారు.
Read Also: మెట్రో రైల్లో చిన్నారుల డ్యాన్స్, చూస్తే ఫిదా కావాల్సిందే!