Japan Railway: ప్రపంచంలో అత్యంత కచ్చితత్వంతో పని చేసే రైల్వే వ్యవస్థ ఏదైనా ఉందంటే.. అది జపాన్ రైల్వే వ్యవస్థ మాత్రమే. ఆ దేశంలో రైళ్లు ఒక్క నిమిషం కూడా ఆలస్యం కావు. ఒకవేళ అయితే, సదరు రైలు లోకో పైలెట్ పై తగిన చర్యలు తీసుకుంటారు. సాలరీ కట్ చేయడం నుంచి మొదలుకొని సస్పెన్షన్ లాంటి తీవ్ర చర్యలు కూడా ఉంటాయి. జపాన్ లో రైలు ఆలస్యానికి సంబంధించి 2012లో ఓ ఘటన జరిగింది. వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీ (JR West) లోకో పైలెట్ ఒక ఖాళీ రైలును ఒక నిమిషం ఆలస్యంగా డిపోకు చేర్చాడు. ఈ నేపథ్యంలో ఆయన సాలరీ కట్ చేస్తూ రైల్వే సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆయన న్యాయపోరాటం చేశాడు. చివరకు న్యాయస్థానం అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అతడికి నష్టపరిహారం అందించాలని ఆదేశించింది. కానీ, అప్పటికే సదరు లోకో పైలెట్ చనిపోయాడు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
వెస్ట్ జపాన్ రైల్వే సంస్థలో హిరోఫుమి వాడా లోకో పైలెట్ గా పని చేశారు. ఒకాయామా స్టేషన్ లో ఖాళీ రైలును డిపోకు తరలించాల్సి ఉండగా, పొరపాటున వేరే ప్లాట్ ఫారమ్‌కు వెళ్లాడు. సరైన ప్లాట్ ఫారమ్‌కు చేరుకునే సమయానికి, రెండు నిమిషాల ఆలస్యం జరిగింది. ఫలితంగా రైలు డిపోకు ఒక నిమిషం ఆలస్యంగా చేరింది. JR West కంపెనీ రైలును ఒక నిమిషం ఆలస్యంగా నడిపించినందుకు గాను, ఆయన సాలరీ నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసింది.
రైల్వే సంస్థపై లోకో పైలెట్ న్యాయ పోరాటం
రైల్వే సంస్థ తన సాలరీని కట్ చేయడాన్ని లోకో పైలెట్ తీవ్రంగా పరిగణించాడు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఒకాయామా కోర్టులో కేసు వేశాడు. ఈ ఆలస్యం ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలిగించలేదని వాదించాడు. ఇది మానవ తప్పిదం అని, తన వేతనం తగ్గింపు అన్యాయమన్నాడు. 2022లో కోర్టు లోకో పైలెట్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. JR Westను అతడి సాలరీ నుంచి కట్ చేసిన డబ్బులతో పాటు మరికొంత పరిహారాన్ని అందించాలని ఆదేశించింది. కానీ, ఈ తీర్పు వాడా మరణించిన కొద్ది వారాల తర్వాత వచ్చింది.
జపాన్ కచ్చితత్వానికి నిదర్శనం
ఈ సంఘటన జపాన్ రైల్వే వ్యవస్థ కఠినమైన సమయ పాలనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కానీ, ఉద్యోగుల మీద తీవ్ర మైన ఒత్తిడి కలిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. జపాన్‌లో రైళ్లు సగటున ఒక నిమిషం కంటే తక్కువ ఆలస్యంతో నడుస్తాయి. షింకాన్ సెన్ బుల్లెట్ రైళ్లు సగటున 20 సెకండ్ల ఆలస్యంతో నడుస్తాయి. ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యం జరిగితే, ప్రయాణీకులకు ఆలస్య ధృవీకరణ పత్రాలు జారీ చేయబడతాయి. వీటిని వారు తమ కంపెనీలకు, పాఠశాలలకు ఆలస్యానికి రీజన్ గా చూపించవచ్చు.
Read Also: ప్రపంచంలోనే షార్టెస్ట్ ఫ్లైట్ జర్నీ, ఎంతసేపో తెలిస్తే షాకవ్వాల్సిందే!