ప్రపంచ వ్యాప్తంగా నిత్యం లక్షలాది విమానాల రాకపోకలు కొనసాగిస్తాయి. కోట్లాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. సాధారణంగా విమాన ప్రయాణం అనగానే చాలా మంది గంటల తరబడి ఉంటుందని భావిస్తారు. కానీ, ఓ స్కాటిష్ ప్లైట్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ దూరం ప్రయాణిస్తుంది. కేవలం 90 సెకెన్లలో తన గమ్యస్థానానికి చేరుకుంటుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా, ఇది నిజం. ఈ బుల్లి విమానం యూకేలోని ఆర్కెనీ దీవులలోని వెస్ట్ రే-పాపా వెస్ట్ రే ప్రాంతాలను కలుపుతుంది.
రెండు దీవుల మధ్య దూరం 2.73 కిలో మీటర్లు
వాస్తవానికి ఈ రెండు దీవుల మధ్య ప్రయాణం నిమిషం కంటే తక్కువగానే ఉంటుంది. గతంలో స్టువార్ట్ లింక్ లేటర్ అనే పైలెట్ ఇదే విమానాన్ని కేవలం 53 సెకెన్లలో గమ్యస్థానానికి తీసుకెళ్లి రికార్డు సృష్టించాడు. రెండు ద్వీపాల మధ్య దూరం 1.7 మైళ్లు ఉంటుంది. అంటే, 2.73 కిలో మీటర్లు. స్కాట్లాండ్ క్యాపిట్ సిటీ ఎడిసన్ బర్గ్ ఎయిర్ పోర్టు రన్ వే పొడవు కంటే తక్కువ దూరం కావడం విశేషం.
రాకపోకలు సాగిస్తున్న ప్రత్యేక బుల్లివిమానం
ఇక ఈ తక్కువ దూరాన్ని ప్రయాణీకులను తీసుకెళ్లేందుకు బ్రిటెన్ నార్మన్ బిఎన్2బి 26 ఐల్యాండర్ అనే తేలికపాటి విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ విమానంలో కేవలం 10 సీట్లు ఉంటాయి. ముందు సీట్లో కూర్చున్న వారు పైలట్ విమానాన్ని నడిపే విధానాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఈ విమానంలో పైలెట్ మినహా మరే ఇతర సిబ్బంది ఉండరు. షార్టెస్ట్ ఫ్లైట్ జర్నీ కావడంతో ఇతర సహాయక సిబ్బంది కూడా లేరు.
Read Also: మీ కార్లను ఇక రైలు ఎక్కించవచ్చు.. వాటితో మీరూ ప్రయాణించవచ్చు!
రోజూ 70 మంది ప్రయాణీకుల రాకపోకలు
ఇక ఈ విమానంలో పాపా వెస్ట్ రేలో ఉండే సుమారు 70 మంది ప్రజలు వారి అవసరాల కోసం దీనిలో ప్రయాణిస్తుంటారు. 1967 నుంచి ఈ విమాన ప్రయాణం కొనసాగుతుంది. ఇది స్థానికులు, పర్యాటకుల రాకపోకలను సులభతరం చేస్తుంది. విమాన ప్రయాణం ఇష్టం లేని వాళ్లు పడవల్లోనూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈ మధ్య చాలా మంది ప్రయాణీకులు కేవలం ఈ విమానంలో జర్నీ చేసి, వింతైన అనుభూతిని పొందాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి తరలి వస్తున్నారు. అంతేకాదు, ఈ రెండు దీవుల నడుమ పర్యాటక ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. విమానం ద్వారా కిందికి చూస్తే మరింత అందంగా కనిపిస్తుంది. దీవులు రెండు అద్భుతమైన వ్యూతో ఆకట్టుకుంటున్నాయి. నీలి మేఘాలలలో గంటల తరబడి చేసే ప్రయాణాలతో పోల్చితే జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలను పంచే ఈ విమాన ప్రయాణం ఎంతో అద్భుతం అంటున్నారు చాలా మంది పర్యాటకులు. ఒకవేళ మీరు స్కాట్లాండ్ కు వెళ్లినట్లు అయితే, కచ్చితంగా ఈ ఫ్లైట్ జర్నీని ఆశ్వాదించండి.
Read Also: ప్రపంచంలోనే అతి చిన్న రైలు.. దీని పైకెక్కి మరి ప్రయాణించవచ్చు!