Kedarnath Yatra: కేదార్ నాథ్, సోమనాథ్, కోణార్క్, హంపి, మధుర మీనాక్షి ఆలయాల సందర్శన చేసి.. ఆయా ఆలయాల విశిష్టత. స్థలపురాణం లేదా పురాణ గాథ, ఆ పరిసర ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలు తెలుసుకోవడంతో పాటు ఎలా వెళ్లాలో కూడా పరిశీలిద్దాం. ఇక బడ్జెట్ ఎంత వంటి వివరాలను కూడా ఒక అంచనా వేద్దాం. మొదటగా.. కేదార్ నాథ్ ఆలయం విషయానికి వస్తే.. చార్ ధామ్ యాత్రలో అత్యంత కీలకమైన ఆలయం. ఇక్కడి పరమేశ్వర దర్శనం జీవితంలో ఒక్కసారైనా చేయాలంటారు ఎందుకు? కేదార్ నాథ్ ఆలయ నిర్మాణం ఎందుకంత ప్రత్యేకం? 2013లో వచ్చిన వరదల్లో ఈ ఆలయం చెక్కు చెదరకుండా నిలబడ్డానికి గల కారణాలేంటి? అన్నదిపుడు తెలుసుకుందాం.
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కేదార్ నాథ్
ట్రైన్ జర్నీ అయితే ఈ మొత్తం బాగా తగ్గే అవకాశంకేదార్ నాథ్.. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. చోటా చార్ ధామ్ లో అత్యంత ప్రధానమైన ఆలయం. సముద్ర మట్టానికి 3, 583 మీటర్ల ఎత్తులో వెలసిన ఇక్కడి శివుడ్ని కేదారనాథుడని పిలుస్తారు. కేదార్ అంటే క్షేత్రమనీ.. నాథ్ అంటే ఆ క్షేత్రానికి ప్రభువు అని అర్ధం. అందుకే ఈ క్షేత్రానికి కేదార్ నాథ్ అన్న పేరొచ్చినట్టుగా చెబుతారు.
పాండవులు నిర్మించినట్టుగా చెప్పే ఆలయ చరిత్ర
కాశీ కేదార మహత్యం ప్రకారం.. ఇక్కడ ఆలయ ప్రాశస్త్యం ఏంటని చూస్తే.. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్టు చెబుతుంది స్థల పురాణం. మహాభారత కథనం ప్రకారం.. వ్యాసుడి సలహా మేరకు.. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్టు తెలుస్తోంది. మహాభారత యుద్ధంలో తమ సోదరులైన కౌరవులను హతమార్చడం ద్వారా వచ్చిన పాపాన్ని శమింప చేయడం కోసం.. పాండవులు శివుడ్ని వేడుకోడానికి ఇక్కడికి వస్తారట.
ఎద్దు రూపంలోని శివుడు రాక్షస సంహారం
అయితే ఆ పరమేశ్వరుడు వీరి పాప ప్రక్షాళన చేయడానికి అంగీకరించడట. దీంతో ఎద్దుగా మారిన పరమేశ్వరుడు.. కొండపై సంచరిస్తాడట. ఎట్టకేలకు శివుడి అనుగ్రహం పొందడానికి పాండవులు ఆ వృషభాన్ని వెంబడిస్తారట. శివుడు తన తలను భూమిలో పాతిపెట్టి దాక్కుంటాడట. దీంతో పాండవులు తలో రకంగా ఆ వృషభాన్ని లాగడం వల్ల.. ఎద్దు తల రుద్రనాథ్, ఇతర శరీర భాగాలు నాలుగు వేర్వేరు భాగాల్లో పడినట్టు చెబుతుందిక్కడి క్షేత్ర గాథ.
శివుడి జటాజూటం నుంచి పవిత్ర జలాలు
అందుకే శివుడిక్కడ పంచ కేదారాల్లో వెలిసినట్టు చెబుతుంది స్థలపురాణం. కేదార్ నాథ్ గురించి స్కంద పురాణంలో కూడా కనిపిస్తుంది. శివుడు తన జటాజూటాల నుంచి పవిత్ర జలాన్ని విడుదల చేసిన ప్రదేశంగానూ ఈ క్షేత్రాన్ని భావిస్తారు. దీన్నే కేదారమని తద్వారా వెలసిందే కేదార్ నాథ్ అని కూడా అంటారు.
ఎద్దు రూపంలోని శివుడు రాక్షస సంహారం
కేదార్ అనే పేరు కోదరం అనే పేరు నుంచి ఉద్భవించినట్టుగానూ భావిస్తారు. దేవతలు తమను రాక్షసుల బారీ నుంచి కాపాడమంటూ శివుడ్ని పూజించారనీ.. అపుడు శివుడు ఎద్దు రూపంలో వచ్చి ఆ రాక్షసులను ఓడించారని.. తనకొమ్ములను ఉపయోగించి వారి మృత దేహాలను ఇక్కడి మందాకినీ నదిలో పడేశాడనీ తద్వారా ఈ ప్రాంతానికి కేదార్ నాథ్ అన్న పేరొచ్చినట్టుగానూ చెబుతారు.
ఆదిశంకరుడు అంతర్ధానమైన ప్రాంతంగా కేదార్ నాథ్
ఇక్కడి భైరవ్ నాథుడ్ని.. కేదార్ నాథ్ క్షేత్ర పాలకుడిగా నమ్ముతారు. కేదార్ నాథ్ ప్రారంభ ముగింపు వేడుకల్లో దర్శించాల్సిన ఆలయాల్లో భైరవనాథ్ ఆలయం అత్యంత ప్రధానం. ఎందుకంటే భైరోనాథ్, కేదార్ నాథ్ ఆలయాన్ని సూక్ష్మ రూపంలో ఉండి రక్షిస్తారని విశ్వసిస్తారు. అందుకే భైరోనాథ్ సందర్శనం ముఖ్యమని అంటారు. ఆది శంకరాచార్యుడు అంతర్ధానమైన ప్రదేశాన్ని సూచించే స్మారక శిథిలాలు సైతం కేదార్ నాథ్ లో మనకు దర్శనమిస్తాయి.
త్రిభుజాకారంలో ఉండే కేదార్ నాథ్ లింగం
ఈ ఆలయంలో వెలసిన లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ ఆలయం పాండవ నిర్మితమని సూచించేలా.. పార్వతి, శ్రీకృష్ణ, పంచపాండవులతో కూడిన ద్రౌపది, నంది, వీరభద్ర ఇతర దేవీ దేవతల విగ్రహాలు సైతం ఉంటాయి. కేదార్ నాథ్ ఆలయం ఉత్తర భారత దేశంలో ఉన్నా.. ఇక్కడ కన్నడ వీరశైవ వర్గానికి చెందిన వారు ప్రధాన పూజారులుగా ఉంటారు. వీరిని రావల్ అంటారు. మొత్తం పూజారులు ఐదుగురు ఉంటారు. ఒక్కో సంవత్సరం ఒక్కో పూజారి ప్రధాన అర్చకులవుతారు.
ఎరిక్ షిప్టన్ ప్రకారం కేదార్ నాథ్, బదిరీ నాథ్ కి ఒకే పూజారి
1926లో హిమాలయాలను సందర్శించిన ఎరిక్ షిఫ్టన్ అనే ఆంగ్ల పర్వతారోహకుడు.. కేదార్ నాథ్ బదరీనాథ్ ఆలయాలకు ఒకే పూజారి పూజలు నిర్వహిస్తున్నట్టు రాసుకొచ్చారు. దీన్ని ప్రకారం ఇక్కడ రావల్ గా పిలిచే పూజారులు తమ తమ పూజా నిర్వహణ చేస్తుంటారు.
పాండుకేశ్వర్ వద్ద పాండురాజు మరణం
కేదార్ నాథ్ చుట్టూ పాండవుల చిహ్నాలు మనకు చాలానే కనిపిస్తాయి. పాండురాజు పాండుకేశ్వర్ వద్ద మరణించినట్టు తెలుస్తుంది. ఇక్కడి గిరిజనులు పాండవ్ లీల అనే నృత్య ప్రదర్శనతో ఈ పురాణగాథలను తెలియ చేస్తారు.
బొటన వేలంత ఆకృతిలో ధర్మరాజు శివలింగం
బద్రీనాథ్ కు దగ్గరగా స్వర్గారోహిణి అనే పర్వత శిఖరం నుంచే పాండవులు స్వర్గారోహణ చేశారని చెబుతుందిక్కడి స్థల చరిత్ర. ఈ సమయంలో ధర్మరాజు బొటన వేలు ఇక్కడ పడిందనీ.. దీంతో బొటనవేలంత ఆకృతిలో శివలింగ స్థాపన చేసినట్టుగానూ చెబుతారు.
భీముడితో యుద్ధం కారణంగా శంకరుడికి ఒంటినొప్పులు
ఇక్కడి త్రిభుజాకార లింగానికి నెయ్యితో మర్ధన చేస్తారు. ఇందుకు కారణమేంటంటే భీముడు ఎద్దు రూపంలోని శివుడిపై తన ఆయుధాలతో దాడి చేయడం వల్ల.. శంకరుడి ఒళ్లంతా హూనమైందని.. ఆ నొప్పులను తీర్చేలా భీముడు ఈ లింగానికి నెయ్యితో మర్ధనచేశాడనీ.. ఆ ఆచారం ఇంకా కొనసాగుతోందని అంటారు. నెయ్యి మర్ధనతో పాటు నీరు నేరేడు ఆకులతో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు.
ఈ నొప్పులు తీరేలా నెయ్యితో మర్ధన చేస్తారని నమ్మకం
1200 ఏళ్ల నాటి ఈ పురాతన ఆలయం 400 ఏళ్ల పాటు మంచుతోనే కప్పబడి ఉండేదట. ఆ తర్వాత తిరిగి జీవం పోసుకుందట. మహా విష్ణువు నారాయణ రూపాన్ని ధరించి శివుడు నివసించే బద్రీనాథ్ చేరుకున్నాడనీ.. ఆపై విష్ణువు కోరికపై శివుడు కేదార్ నాథ్ చేరుకున్నాడనీ చెబుతారిక్కడి పూజారులు.
2013 వరదల్లో ఆలయం చెక్కు చెదరక పోవడం ఒక శివలీల
ఇలా భారతీయ ఇతిహాసాల ప్రకారం ఎన్నో విశిష్టితల సమాహారం కేదార్ నాథ్. అందుకే అంటారు కేదార్ నాథ్ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన పరమ పావన క్షేత్రమని. 2013లో వచ్చిన వరదల్లో ఇక్కడి ఆలయం చెక్కు చెదరక పోవడం అంతా ఆ శివలీలగా నమ్ముతారు. అయితే ఈ ఆలయాన్ని పరీక్షిత్ మహారాజు అద్భుతంగా నిర్మించాడనీ.. ఈ ఆలయాన్ని ఇంటర్ లాక్- రాక్ సిస్టమ్ ద్వారా నిర్మించడం వల్ల ఇది ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా చెక్కు చెదరదని అంటారు. శివ భక్తులు మాత్రం ఈ ఆలయంలో కొలువైన ప్రధాన దైవమైన శివుడు ఈ ఆలయ పరిరక్షణ చేస్తాడని అంటారు.
ఏప్రిల్- నవంబర్ మధ్య కాలంలో మాత్రమే తెరిచి ఉంచే ఆలయం
గంగా నది ఉప నది అయిన మందాకిని నదికి దగ్గర్లో హిమాలయ పర్వతశ్రేణిలో గల ఈ ఆలయం ఏప్రిల్- నవంబర్ మధ్య కాలంలో మాత్రమే సాధారణ భక్తుల కోసం తెరిచి ఉంచుతారు. శీతాకాలంలో కేదార్ నాథ్ దేవతా విగ్రహాలను ఉక్రిమత్ అనే ప్రదేశంలో ఉంచి పూజిస్తారు.
గౌరీ కుండ్ గేట్ వే నుంచి 15కి. మీ దూరంలో కేదార్ నాథ్
తెలుగు రాష్ట్రాలవారు ఉత్తరాఖండ్ లోని ఈ ఆలయ సందర్శనం చేరాలంటే తొలుత ఢిల్లీకి చేరుకోవాలి. ఆపై హరిద్వార్ లేదా రిషికేశ్ చేరాలి. ఆపై సోన్ ప్రయాగ్ చేరాలి. అక్కడి నుంచి గౌరీ కుండ్ వెళ్లాలి. గౌరీ కుండ్ నుంచి ట్రెక్కింగ్ మొదలవుతుంది. ఆన్ లైన్లో పేరు నమోదు చేసుకోని వారు రిష్ కుల్ దగ్గర ఆఫ్ లైన్ లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ తీసుకుని.. చోటా చార్ ధామ్ యాత్రలో ప్రధానమైన కేదార్ నాథ్ దర్శనం చేసుకోవాలి. గౌరీ కుండ్ నుంచి బాస్కెట్లు, గుర్రాలు, పల్లకీలుంటాయి. నడవలేని వారు వీరిని కిరాయికి మాట్లాడుకుని కేదార్ నాథ్ ఆలయం చేరుకోవచ్చు. గౌరీ కుండ్ గేట్ వే నుంచి మొత్తం 15 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. మధ్యలో వచ్చే తప్త్ కుండ్ లో వేడి నీళ్ల ప్రవాహం కనిపిస్తుంది. ఇందులో వేడి వేడిగా స్నానంచేసి తర్వాత బయలుదేరుతుంటారు భక్తులు.
బస్సు- ట్రైన్- ఫ్లైట్ ద్వారా ప్రయాణం.. దీన్ని బట్టే బడ్జట్
కేదార్ నాథ్ యాత్ర బడ్జెట్ విషయానికి వస్తే బస్సు- ట్రైన్- ఫ్లైట్ ద్వారా ప్రయాణిస్తుంటారు. వీటిని బట్టీ బడ్జెట్ ఉంటుంది. ఫ్లైట్ అయితే ఢిల్లీ వరకూ వెళ్లి అక్కడి నుంచి హరిద్వార్ కి బస్సు లేదా ట్రైన్ ద్వారా వెళ్ల వచ్చు. ఆపై సోన్ ప్రయాగ్ వరకూ కూడా బస్సు ప్రయాణం చేయవచ్చు. ఆపై గౌరీ కుండ్ నుంచి ట్రెక్కింగ్ చేసేవారికి ఎలాంటి ఖర్చూ ఉండక పోవచ్చు. కానీ బాస్కెట్, గుర్రం, పల్లకి.. ఒక్కో ధర ఉంటుంది. కేదార్ నాథ్ ఆలయం వరకూ ఒక్క బాస్కెట్ కి 8 వేల వరకూ వసూలు చేస్తారు. దీన్నిబట్టీ మిగిలిన ఖర్చులు ఒక అంచనా వేసుకోవచ్చు. ఒక వేళ ఫ్లైట్ ద్వారా అయితే కేదార్ నాథ్ యాత్రకుగానూ ఒక్కొక్కరికీ సుమారు పాతికే వేల వరకూ ఖర్చయ్యే అవకాశం కనిపిస్తోంది. వారి వారి ప్లానింగును బట్టీ మొత్తం ట్రైన్లో వెళ్లి రాగలిగితే.. ఈ మొత్తం బాగా తక్కువయ్యేలా తెలుస్తోంది.
ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర ప్రారంభించేవారి తొలి పుణ్యక్షేత్రం ఏదో తెలుసా? అదే సోమ్ నాథ్ ఆలయం. అంతే కాదు పదే పదే దాడులు జరిగినా..తిరిగి తిరిగి పునర్నిర్మితమైన ఆలయమేదో తెలుసా? ఇదీ సోమనాథ్ ఆలయమే. అంతే కాదు.. చంద్రుడిచే స్థాపించబడిన ఆలయం కూడా సోమనాథుడే. ఇది శైవ భక్తులకే కాదు వైష్ణవులకూ ఎందుకంత ప్రత్యేకం? ఈ ప్రాంతానికీ శ్రీకృష్ణుడికీ ఉన్న సంబంధ బాంధవ్యాలేంటి? ఆ పూర్తి వివరాలు..
సౌరాష్ట్రే సోమనాథంచ- శ్రీశైలే మల్లికార్జునమ్
సౌరాష్ట్రే సోమనాథంచ- శ్రీశైలే మల్లికార్జునమ్.. అంటూ మొదలవుతుంది జ్యోతిర్లింగ స్తోత్రం. దీన్ని బట్టీ చెప్పొచ్చు.. జ్యోతిర్లింగాల్లోనే సోమనాథేశ్వరుడు మొదటి వాడని. అందుకే శివభక్తులు.. జ్యోతిర్లింగ యాత్రలో భాగంగా.. తొలిగా ఈ ఆలయం నుంచే మొదలు పెడతారు. ఈ ఆలయ పురాణ గాథ ఎంతటి పురాతనమైనదో.. చారిత్రకంగానూ అంతే భిన్నమైనది.
పదే పదే దాడులు.. ఆపై పునర్నిర్మితం
పదే పదే దాడులతో నాశనమై.. తిరిగి తిరిగి పునర్నిర్మితమవుతూ వచ్చి నేడీ పరిస్థితిలో ఉందీ సోమనాథ ఆలయం. ఇది పశ్చిమ భారతావనిలోని గుజరాత్ రాష్ట్రంలోని వెరావాల్ లోని ప్రభాస్ పటాన్ లో ఉంది. అందుకే దీన్ని ప్రభాస తీర్ధంగానూ పిలుస్తారు.
25 అడుగుల ఎత్తున బండరాళ్లతో నిర్మించిన మట్టం
అరేబియా సముద్ర తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం సముద్ర అలల తాకిడి తట్టుకునే విధంగా ఏకంగా 25 అడుగుల ఎత్తున ఉన్న బండరాళ్లతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకుంది. ఈ ఆలయ గర్భగుడిలోని శివలింగం నాలుగు అడుగుల ఎత్తుండి.. ఓంకారరూపంలో అమర్చబడి ఉంటుంది.
ఒకటవ శతాబ్దికి చెందిన ఆలయం
చారిత్రకంగా చూస్తే ఈ ఆలయం మొదటి శతాబ్దానికి చెందినది. తర్వాత శిథిలం కాగా తిరిగి నిర్మించారు. ఆపై జరిగిన దాడుల కారణంగా తిరిగి చోళుల కాలంలో పునర్ నిర్మితమైంది. ఆ తర్వాత ఈ ఆలయం.. ఎన్నో సార్లు దాడులకు గురైంది. ఆ కాలంలో ఇక్కడున్న ధనరాసులే ఈ దాడులకు కారణంగా తెలుస్తోంది.
1026లో దండెత్తిన గజనీ మహ్మద్
1026లో గజినీ మహమ్మద్ ఈ ఆలయంపై దండెత్తాడట. ఆలయంలోని లింగాన్ని ముక్కలు చేయాలని చూసి ఆ పని చేయలేక చేతులెత్తేశాడట. గజినీ సేనలను హమీర్ గోపాల్, పరమదేవ్ సేనలు ఎదురొడ్డి నిలిచాయట. ఎట్టకేలకు హమీర్ గజినీ సేనలు పారిపోయేలా చేశాడట. ఆపై ఆలయ పునర్మిర్మాణం జరిగినట్టు చెబుతుంది స్థల చరిత్ర.
1296లో ఖిల్జీ హయాంలోనూ ఆలయంపై దాడి
1296లో ఖిల్జీ హయాంలోనూ ఆలయంపై దాడి జరిగిందట. ఉలుంఖాన్ అనే ఖిల్జీ సేనాని శివలింగాన్ని ముక్కలు చేసి ఖిల్జీకి కానుకగా ఇచ్చాడట. ఆ తర్వాత జునాఘడ్ రాజకుమారుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడట.
1459లో మందిరాన్ని మసీద్ చేసిన మహమ్మద్ బేగ్దా
1459లో మహమ్మద్ బేగ్దా ఇక్కడి లింగాన్ని తీసేసి.. మందిరాన్ని మసీదుగా మార్చిన చరిత్ర కూడా ఉందట. ఔరంగ్ జేబ్ కాలంలో ఇండోర్ మహారాణి ఈ ఆలయాన్నిపునర్నిర్మించారట. అయితే ఈ లింగ ప్రతిష్ట శతృవుల బారీన పడకుండా భూగర్భంలో చేయాల్సి వచ్చిందట.
అభివృద్ధి ప్రణాళిక ప్రతిపాదించిన సర్దార్ వల్లభాయ్
స్వాతంత్రం వచ్చాక అంటే 1951 మే 11న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లింగ ప్రతిష్ట చేసి పునర్నిర్మాణ కార్యక్రమాలు సాగించారు. జునాగఢ్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు వచ్చిన సర్దార్ వల్లభాయి పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు అభివృద్ధికి ప్రణాళిక ప్రతిపాదించారు. పటేల్ మరణానంతరం మంత్రి కే ఎమ్ మున్షి ఆధ్వర్యంలో పునర్నిర్మాణపు కార్యక్రమాలు జరిగాయి.
1970 ఆలయ ప్రారంభోత్సవంలో సత్యసాయి బాబా
ఈ ఆలయ పునర్నిర్మాణానికి మన తెలుగు వారికి కూడా ఒక సంబంధం ఉంది. 1970లో సత్యసాయిబాబా ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాతి కాలం నుంచీ ఈ ఆలయం అన్ని వసతులతో తులతూగుతోంది.. భారతీయ ఆధ్యాత్మిక భాండాగారంగా వెల్లివిరుస్తోంది.
ఈ లింగానికి సోమనాథుడనే పేరు
ఇది స్థల చరిత్రకాగా స్థల పురాణం మరోలా ఉంది. దీని ప్రకారంచూస్తే చంద్రుడు ఈ ఆలయాన్ని బంగారంతో నిర్మించినట్టు చెబుతాయి మన ఇతిహాసాలు. దక్షుడి శాపం కారణంగా.. ఇక్కడ చంద్రుడు ఘోర శివ తపస్సు చేయగా.. ప్రత్యక్షమై శాప విముక్తి గావించాడట. దీంతో ఈ ఆలయంలో వెలసిన శివుడికి సోమనాథుడనే పేరొచ్చింది. మరీ ముఖ్యంగా వృషభరాశివారు ఈ ఆలయాన్ని తప్పనిసరిగా సందర్శించాలని చెబుతారు. అంతే కాదు.. భార్యా భర్తల అనుబంధంలో ఇబ్బందులు తలెత్తిన వారు కూడా ఈ ఆలయ సందర్శనం చేయాలని అంటారు. ఎందుకంటే ఇక్కడ శివుడు చంద్రుడికి చేసిన ఉపదేశం అలాంటిదని అంటారు.
సోమనాథ్ సమీప రైల్వే స్టేషన్ వెరావల్
ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే.. సమీప రైల్వే స్టేషన్ వెరావల్ కి చేరుకోవల్సి ఉంటుంది. ఇక్కడికి అహ్మదాబాద్, ముంబై, డయ్యు, రాజ్‌కోట్, జామ్‌నగర్ వంటి ప్రాంతాల నుంచి రైళ్లు నడుస్తాయి. ఇక 57 కిలోమీటర్ల దూరంలో కేశోడ్ అనే ఎయిర్ పోర్టు కూడా ఉంది. బస్సుల ద్వారా అయితే అహ్మదాబాద్, జునాగఢ్ వంటి నగరాలను కలుపుతూ ఈ ప్రాంతంలో GSRTC బస్సులు తిరుగుతుంటాయి. ప్రైవేట్ బస్సులు కూడా వెరావల్ బస్ స్టాండ్ నుంచి.. నడుస్తుంటాయి.
ఇతర దర్శనీయ స్థలాలు
ఈ దగ్గర్లో ఇతర దర్శనీయ ప్రాంతాలేవని చూస్తే.. సోమనాథ్ బీచ్, పంచ పాండవ గుఫా, లక్ష్మీ నారాయణ్ మందిర్, ప్రభాస్ పటాన్ మ్యూజియం, గిర్ నేషనల్ పార్క్, త్రివేణి సంగమం, భాల్క తీర్ధం ముఖ్యమైనవిగా తెలుస్తున్నాయి. వీటన్నిటిలోనూ భాల్క తీర్ధం అత్యంత ప్రశస్తమైనదిగా చెబుతారు.
సోమ్ నాథ్ కి 4 కి. మీ దూరంలో భాల్క
సోమనాథ్ ఆలయానికి కేవలం 4 కిలోమీర్ల దూరంలో ఉంటుంది భాల్క తీర్ధం. ఇక్కడ ఒక వేటగాడు శ్రీకృష్ణుడి పాదాలను గురి చూసి కొట్టడం వల్ల.. ఆయన అవతారం చాలించాడనీ.. చెబుతాయి శ్రీకృష్ణ లీలా పురాణాలు. కాబట్టి ఈ శైవ క్షేత్రం ఇటు శైవులకే గాక అటు వైష్ణవులకూ అత్యంత ప్రాధాన్యత గలిగినదిగా భావిస్తారు.
ఇతర వివరాల కోసం
ఇతర వివరాల కోసం https://somnath.org కి వెళ్లి సెర్చ్ చేస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయి. బడ్జెట్ విషయానికి వస్తే జ్యోతిర్లింగ యాత్రల పేరిట కొందరు ఆపరేటర్లు టూర్లు నిర్వహిస్తుంటారు. వీరి ద్వారా అయితే సోమనాథ్ తో పాటు అన్ని జ్యోతిర్లింగాల దర్శనం చేయవచ్చు.
-Story By adinarayana, Bigtv Live