Indian Railway Tickets Booking: రోజూ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది రైల్వే ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ధరలో ఆహ్లాదకర ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది రైలు ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. రైల్లో ప్రయాణించాలంటే టికెట్ తప్పనిసరిగా కావాల్సిందే. చాలా మంది ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. కొంత మంది ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే, మరికొంత మంది రైల్వే స్టేషన్ కౌంటర్ లో టికెట్లు తీసుకుంటారు. అయితే, కౌంటర్ లో టికెట్ తీసుకునే వారితో పోల్చితే ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకునే వారికి ఎక్కువ కాస్ట్ అవుతుంది. దానికి కారణం ఏంటో తాజాగా రైల్వేశాఖ వివరణ ఇచ్చింది.
ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ఎందుకు కాస్ట్ అంటే?
IRCTC ద్వారా ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకునే ప్రయాణీకులు కన్వినియన్స్ ఫీజు, లావాదేవీలకు సంబంధించిన ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కారణంగానే రైల్వే కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకునే వారితో పోల్చితే ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వాళ్లు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని వెల్లడించింది. IRCTC టికెట్ ధరలలో వ్యత్యాసాల గురించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ లేవనెత్తిన ప్రశ్నలకు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం చెప్పారు. “ఆన్ లైన్ టికెటింగ్ సౌకర్యాన్ని అందించడంలో IRCTC కీలకపాత్ర పోషిస్తుంది. టికెటింగ్ కు సంబంధించిన మౌలిక సదుపాయాల నిర్వహణ కోసం IRCTC ద్వారా అదనపు ఛార్జీలు వసూలు చేయబడుతాయి. ఆన్ లైన్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకునే వాళ్లు అదనంగా బ్యాంకులకు లావాదేవీ ఛార్జీలను కూడా చెల్లిస్తారు. ఈ కారణంగా ఆన్ లైన్ ద్వారా టికెట్లు పొందే వాళ్లు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది” అని రైల్వే మంత్రి తెలిపారు.
Read Also: 158 ఏండ్ల క్రితం పట్టాలెక్కిన రైలు, ఇప్పటికీ నడుస్తోంది, ఎక్కడో తెలుసా?
టికెట్ల ధర వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించిన రౌత్
అంతకు ముందు IRCTC టికెట్ల బుకింగ్ గురించి సంజయ్ రౌత్ కీలక ప్రశ్నను లేవనెత్తారు. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణీకులు రైల్వే కౌంటర్లలో భౌతికంగా టికెట్లు కొనుగోలు చేసే వారి కంటే ఎక్కువ చెల్లించడానికి గల కారణాలు ఏంటో చెప్పాలన్నారు. ఈ ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. “IRCTC అందించే ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యం భారతీయ రైల్వే ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం, రిజర్వ్ చేయబడిన టికెట్లలో 80 శాతానికి పైగా ఆన్ లైన్ లో బుక్ చేయబడుతున్నాయి. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ విధానం వల్ల ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకోవడానికి రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్లాల్సిన ఇబ్బంది ఉండదు. ప్రయాణీకు సమయం, రవాణా ఖర్చులు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది” అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Read Also: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు, ఎన్ని కిలో మీటర్లు ఉంటుందో తెలుసా?