ఒక అందమైన దేశం. ఆ దేశంలో ప్రజలు ఎవరూ కష్టపడి పనిచేయరు. సంతోషంగా ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతారు. అయినా సరే వారు ధనవంతులు. ఆ దేశానికి ఒక్క విమానాశ్రయం కూడా లేదు. కనీసం కరెన్సీ కూడా లేదు. అక్కడి ప్రజలు ఎలాంటి నేరాలు చేయరు. సంతోషంగా జీవిస్తారు. ఇలాంటి ఒక దేశం నేలపై ఉందనిపిస్తే అది నమ్మశక్యం కాదు.. కానీ అలాంటి దేశం ఈ భూమిపై ఉంది. అదే లీచ్టెన్ స్టెయిన్. ఇది ఒక చిన్న యూరోపియన్ దేశం. స్విట్జర్లాండ్ ఆస్ట్రియా మధ్య ఆల్ఫ్స్ పర్వతాలలో ఇది ఉంది.
భూతల స్వర్గంలాంటి దేశం
భూతల స్వర్గం అనే పదం వినే ఉంటారు. ఆ పదానికి అందమైన ఉదాహరణ లీచ్టెన్ స్టెయిన్. ఇది చాలా చిన్న దేశం. కానీ ఆ దేశంలో పౌరులంతా ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. ఈ దేశానికి వెళ్లేందుకు ఒక విమానాశ్రయం కూడా లేదు. అలాగే కరెన్సీ లేదు. సొంత భాష లేదు. అయినా కూడా ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలలో ఒకటిగా ఉంది. అలాగే సురక్షితమైన దేశాలుగా కూడా పరిగణిస్తారు.
ఈ దేశంలో శాంతి నెలకొని ఉంటుంది. మంచుతో కప్పిన రాజభవనాలు చూపు తిప్పుకోనివ్వవు. ఈ ప్రత్యేకమైన దేశం వైపు ట్రావెలర్ల దృష్టి పడింది. అందుకే సోషల్ మీడియాలో ఈ దేశం ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది.
ఎలా వెళ్లాలి?
ఈ దేశానికి ఒక్క సొంత అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లేదు. ఇక్కడికి వెళ్లాలనుకుంటే ఎవరైనా కూడా ముందు స్విట్జర్లాండ్ లోని జ్యూరీచ్ కు వెళ్లాలి. లేదా ఆస్ట్రియాలోని ఇన్సుబ్రక్ లో దిగాలి. అక్కడ నుంచి కారు లేదా రైలులో లీచ్టెన్ స్టెయిన్ వెళ్ళవచ్చు. ఈ దేశం అందానికి, పరిశుభ్రతకు చిహ్నం లాగా కనిపిస్తుంది.
లీచ్టెన్ స్టెయిన్ దేశానికి సొంత జాతీయ భాష, కరెన్సీ కానీ లేదు. ఇక్కడ ప్రజలందరూ జర్మన్ మాట్లాడతారు. ఇక కరెన్సీగా స్విట్జర్లాండ్ ఫ్రాంక్ ని ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ దేశస్థుల బ్యాంకింగ్, టెక్నాలజీ చాలా బలంగా ఉంటాయి.
ఈ దేశంలో కేవలం 40,000 మంది మాత్రమే నివసిస్తారు. ఇక్కడ పోలీసులు అవసరం కూడా లేదు. అలాగే ఈ దేశానికి ఎలాంటి విదేశీ అప్పు లేదు. తలసరి ఆదాయం పరంగా చూస్తే ప్రపంచంలోనే ఈ దేశం అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ నివసించే ప్రజలందరూ సంపన్నులే. వీరి జీవన ప్రమాణాలు కూడా అధికంగానే ఉంటాయి.
ఏ ఉద్యోగాలు చేస్తారు?
ఇక్కడి ప్రజల ఆయుర్దాయం కూడా ఎక్కువే. పురుషులు 80 సంవత్సరాలు జీవిస్తే, స్త్రీలు 85 సంవత్సరాలు జీవిస్తారు. ఈ దేశంలో పరిశ్రమలు, బ్యాంకింగ్ రంగంలో నిపుణులు ఎక్కువ. లీచ్టెన్ స్టెయిన్ ప్రజలు ఎన్నో దేశాలకు బ్యాంకింగ్ రంగంలో సహాయపడుతున్నారు. అలాగే ఇక్కడ పారిశ్రామికంగా బలమైన పునాదులు ఉన్నాయి. అనేక రకాల యంత్రాలు, పరికరాలు, దంత ఉత్పత్తులను ఇక్కడ తయారుచేస్తారు. అలాగే ఆహార తయారీ, ప్రాసెసింగ్ కంపెనీలు కూడా అధికంగానే ఉన్నాయి. పర్యాటకంగా కూడా ఎంతోమంది అధికంగా సంపాదిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు వంటివి ఇక్కడ విజయవంతంగా నడుస్తాయి. ఒక సాంకేతికపరంగా చూస్తే ఏఐ రంగం ఇక్కడ అభివృద్ధి సాధిస్తోంది. రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి వాటిలో నైపుణ్యం కలిగిన నిపుణులను కలిగి ఉంది. ఇక్కడ ప్రజలకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్కువ. తక్కువ సమయం పాటు పనిచేసే ఎక్కువ సమయం కుటుంబంతో గడిపేందుకు ప్రయత్నిస్తారు.