గన్నవరం విమానాశ్రయంలో అగ్నిప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 దగ్గర ఎయిర్ ఇండియా నడుపుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన విమానాశ్రయం ఎయిర్‌క్రాఫ్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్(ARFF) బృందం స్పాట్ కు చేరుకుని క్షణాల్లో మంటలు ఆర్పేసింది.
అటు ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో బస్సులో పెద్ద మొత్తంలో మంటలు చెలరేగుతున్నట్లు కనిపించాయి. బస్సు పక్కనే విమానం ఉన్న నేపథ్యంలో దానికి ఏమైనా ప్రమాదం జరుగుతుందోనని ఎయిర్ పోర్టు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, ఫైర్ సేఫ్టీ అధికారులు వెంటనే ఈ మంటలను ఆర్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటను సంబంధించి ఎయిర్ పోర్టు అధికారులు కీలక ప్రకటన చేశారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మెయింటెనెన్స్ చేస్తున్న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ (DIAL) సంస్థ ఈ ఘటనను ఊహించని ఘటనగా అభివర్ణించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. “గ్రౌండ్ హ్యాండ్లర్లలో ఒకరు నడుపుతున్న బస్సు ఈరోజు మధ్యాహ్నం సమయంలో మంటల్లో చిక్కుకుంది. ARFF బృందం వెంటనే రంగంలోకి దిగి రెండు నిమిషాల్లోనే మంటలను ఆర్పింది. సంఘటన జరిగిన సమయంలో బస్సు నిలిపి ఉంది. అందులో ప్రయాణీకులు ఎవరూ లేరు. డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. అతడు కూడా సురక్షితంగా బయటకు వచ్చాడు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. విమానాశ్రయ కార్యకలాపాల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. అన్నీ నార్మల్ గా ఉన్నాయి. ప్రయాణీకులు, సిబ్బంది భద్రత మాకు చాలా ముఖ్యమైనది” అని DIAL సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అటు అగ్నిప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి బస్సును పరిశీలిస్తామని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.
BREAKING: Air India bus catches fire at Delhi Airport Terminal 3 pic.twitter.com/zwBEGDydW7
— Vani Mehrotra (@vani_mehrotra) October 28, 2025
Read Also: గన్నవరం ఎయిర్ పోర్టులో చెలరేగిన మంటలు.. కారణం ఏంటంటే?
ఢిల్లీ విమానాశ్రయంలో మూడు టెర్మినల్స్ ఉన్నాయి. నాలుగు రన్ వేలను కలిగి ఉంది. ఇవి ఏటా 100 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలను అందిస్తున్నాయి. తాజాగా ప్రమాదం జరిగిన టెర్మినల్ 3.. 2010లో ప్రారంభించబడింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద టెర్మినల్స్ లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ టెర్మినల్ ప్రతి సంవత్సరం 40 మిలియన్ల మంది ప్రయాణీకులకు సేవలందించగలదు. ఇక్కడి నుంచి అంతర్జాతీయ, దేశీయ విమానాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. దిగువ శ్రేణి విమానాల రాకపోకల ప్రాంతంగా, ఎగువ శ్రేణి విమానాల బయల్దేరే ప్రాంతంగా పని చేస్తుంది.
Read Also: మొంథా ఎఫెక్ట్.. 150కి పైగా రైళ్లు రద్దు, పలు విమాన సర్వీసులు క్యాన్సిల్!