మెట్రో రైళ్లలో రీల్స్, డ్యాన్సలు అంటూ పలువురు ప్రయాణీకులు రచ్చ చేస్తున్న నేపథ్యంలో మెట్రో అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇకపై ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా మెట్రో పరిసరాలతో పాటు మెట్రో రైళ్లలోనూ రీల్స్, వీడియోలను షూట్ చేయడాన్ని నిషేధించారు. ఈ మేరకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రైళ్లు, స్టేషన్ల లోపల రీల్స్ చేయకూడదంటూ ప్రకటనలు ఏర్పాటు చేసింది. మెట్రో ప్రాంగణంలో రీల్స్, డ్యాన్స్ వీడియోలు, ఇతర సోషల్ మీడియా కంటెంట్ ను చిత్రీకరించవద్దని ప్రయాణీకులను హెచ్చరించింది. సెప్టెంబర్ 14 నుంచి ఈ చర్యలు అమల్లోకి రాగా, ఇకపై అన్ని రైల్వే లైన్లలో కఠినంగా అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ వారం చివరి నాటికి ఈ కొత్తరూల్స్ పూర్తి స్థాయిలో అమలు చేయబడుతుందని అధికారులు తేల్చి చెప్పారు. ఈ మేరకు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో హెచ్చరిక ప్రకటనలను ఏర్పాటు చేశారు. కోచ్‌ల లోపల తినడం, కింద కూర్చోవడం లాంటివి చేయకూడదన్నారు. “రీల్స్, డ్యాన్స్ వీడియోలు, ఇతర సోషల్ మీడియా కంటెంట్ ను మెట్రో రైళ్లు, పరిసరాల్లో కచ్చితంగా నిషేధించబడ్డాయి” అని వెల్లడించారు.
మెట్రో రైల్వేస్ చట్టం, 2002లో రీల్స్ గురించి నేరుగా ప్రస్తావించనప్పటికీ, ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే జరిమానా విధించవచ్చని DMRC అధికారులు స్పష్టం చేశారు. “రీల్స్ లాంటి కార్యకలాపాల వల్ల తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుంది. ఇకపై అలా జరగకూడదనే ఈ చర్య చర్యలు తీసుకుంటున్నాం” అని DMRC కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ దయాల్ వెల్లడించారు. అటు మెట్రో అథారిటీ సోషల్ మీడియాలో మరో ప్రచారాన్ని మొదలు పెట్టింది. ప్రయాణీకులు తమ ఫోన్లలో గట్టిగా మ్యూజిన్ ను ప్లే చేయకూడదని వెల్లడించింది.”ఢిల్లీ మెట్రోలో ప్రయాణాన్ని సౌకర్యవంతమైన అనుభవంగా మార్చడానికి ఈ చర్యలు తీసుకుంటున్నాం” అని దయాల్ తెలిపారు.
గత కొద్ది సంవత్సరాలలో ఢిల్లీ మెట్రో డ్యాన్స్, రీల్స్ సహా బోలెడు వైరల్ కంటెంట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. యెల్లో లైన్ కోచ్ లోపల చిత్రీకరించబడిన వీడియోలో ఒక ప్రయాణీకుడు బ్లష్, లిప్ బామ్, హెయిర్ జెల్ వేసుకుంటున్నట్లు చూపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇతర వీడియోలలో స్టంట్స్, గట్టిగా పాటలు పాడటం, వినడం కనిపించింది. ఇది సాధారణ ప్రయాణీకుల నుంచి తీవ్ర విమర్శలకు కారణం అయ్యింది. గత సంవత్సరం కాలంగా DMRC సాధారణంగా పురుషులు మహిళల కోచ్‌ల లోకి ప్రవేశించకుండా అడ్డుకునే ఫ్లయింగ్ స్క్వాడ్లను రైళ్ల లోపల రీల్స్ చేసే వ్యక్తులను కూడా గమనించాలని సూచించింది. వారి పర్యవేక్షణ ఉన్నప్పటికీ చాలా మంది రీల్స్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కొత్త రూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Read Also: రైళ్లే టార్గెట్ గా పేలుళ్లు, ఎగిరిపడ్డ బోగీలు, పదుల సంఖ్యలో ప్రయాణీకులు..