Longest Railway Station: భారతదేశం రైల్వే రంగంలో మరో అద్భుతమైన ఘనతను సాధించి, ప్రపంచ పటంలో తనదైన ముద్ర వేసింది. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బళ్లిలో ఉన్న శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బళ్లి జంక్షన్ (Shree Siddharoodha Swamiji Hubballi Junction) ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉన్న స్టేషన్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. 1,507 మీటర్ల (దాదాపు 1.5 కిలోమీటర్లు) పొడవుతో ఈ ప్లాట్‌ఫారమ్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇది భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం.
రికార్డు ప్రస్థానం:
గతంలో.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జంక్షన్ 1,366.33 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన ప్లాట్‌ఫారమ్‌గా గుర్తింపు పొందింది. అయితే.. హుబ్బళ్లి ప్లాట్‌ఫారమ్ దీని రికార్డును అధిగమించి 2023 మార్చిలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడి అద్భుతమైన ప్లాట్‌ఫారమ్ నిర్మాణం “హుబ్బళ్లి యార్డ్ రీమోడలింగ్ ప్రాజెక్ట్”లో భాగంగా చేపట్టబడింది. రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, భవిష్యత్ అవసరాలను తీర్చడం వంటి లక్ష్యాలతో సుమారు రూ. 20 కోట్లకు పైగా వ్యయంతో దీనిని నిర్మించారు. 2023 మార్చి 12న భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ ప్లాట్‌ఫారమ్‌ను దేశానికి అంకితం చేశారు.
హుబ్బళ్లి ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకతలు:
ఈ సుదీర్ఘమైన ప్లాట్‌ఫారమ్ కలిగిన రైల్వే స్టేషన్ విశేష ప్రాముఖ్యతను కలిగిఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఒకేసారి రెండు రైళ్లను రెండు వేర్వేరు దిశల నుండి పంపడానికి వీలు కల్పిస్తుంది.ఈ కారణంగా స్టేషన్‌లో రైళ్లు నిలిచిపోయే సమయం చాలా వరకు తగ్గుతుంది. ఇది రైళ్ల రాకపోకలకు మరింత సమర్థవంతమైన నిర్వహణను కూడా అందిస్తుంది. తద్వారా రైల్వే నెట్‌వర్క్‌పై భారం కూడా తగ్గుతుంది. భవిష్యత్తులో పెరుగుతున్న రైలు సర్వీసుల అవసరాలను తీర్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా హుబ్బళ్లి-ధార్వాడ్ ప్రాంతంలో రైలు రవాణా సామర్థ్యాన్ని పెంచడంలో ఇది ఎంతో సహాయపడుతుంది.
హుబ్బళ్లి జంక్షన్ కర్ణాటకలోని ఒక అత్యంత ముఖ్యమైన రైల్వే జంక్షన్. బెంగళూరు, హోస్‌పేట, గోవా, బెళగావి వంటి అనేక ప్రధాన ప్రాంతాలకు వెళ్లే రైలు మార్గాలను ఇది కలుపుతుంది. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ నిర్మాణంతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం లభిస్తుంది. రద్దీగా ఉండే జంక్షన్లలో ప్రధాన టెర్మినల్స్‌పై ఒత్తిడిని తగ్గించడానికి భారతీయ రైల్వేలు చేపట్టిన విస్తృత కార్యక్రమాలలో ఈ ప్లాట్‌ఫారమ్ పొడిగింపు కూడా ఒక భాగం. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థతో ఫిబ్రవరి 2021లోనే ఇది విజయవంతంగా ప్రారంభించబడింది.
Also Read: కోర్టు చెప్పింది.. ఇక హైదరాబాద్ MMTSలకూ క్లోజ్డ్ డోర్స్ ?
భారతదేశ రైల్వేల భవిష్యత్తు:
ఈ అద్భుతమైన రైల్వే ప్లాట్‌ఫారమ్ భారతదేశ రైల్వే మౌలిక సదుపాయాలలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఇది దేశీయ ఇంజనీర్ల నైపుణ్యాన్ని, భారతీయ రైల్వేల ఆధునికీకరణ పట్ల నిబద్ధతను స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రపంచ పటంలో భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన ఈ ప్లాట్‌ఫారమ్, భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్టులకు, రైల్వే నెట్‌వర్క్ విస్తరణకు స్ఫూర్తినిస్తుంది. భారతీయ రైల్వేలు దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల ప్రయాణ సౌకర్యానికి వెన్నెముకగా నిలుస్తూ, నిరంతరం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి అనడానికి ఇది ఒక బలమైన రుజువు.