Viral Video : అంతర్జాతీయ యోగా డే. దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఔత్సాహికులు అంతా యోగాసనాలు వేశారు. యోగాంధ్రతో ఏపీ సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. ప్రధాని మోదీ సైతం యోగాతో ఆకట్టుకున్నారు. చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌ల నుంచి సామాన్యుల వరకు.. విశాఖ తీరంలో అద్భుతం ఆవిష్కృతమైంది. యుద్ధ నౌకపైనా యోగా చేసి.. సముద్రంలో యోగాంధ్ర ఫ్లాగ్ రెపరెపలాడించారు. యోగా డే కు వైజాగ్ కేంద్రంగా నిలిచినా.. మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ యోగా దినోత్సవం ఘనంగా సాగింది. మధురైలో తమిళనాడు గవర్నర్ రవి చేసిన ఫీట్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. 70 ఏళ్ల వయస్సులోనూ ఆయన ఏకంగా 50 కి పైగా పుష్‌అప్స్ తీసి ఔరా అనిపించారు. అలాంటిదే మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కుక్క యోగా డే లో పార్టిసిపేట్ చేసి.. యోగా చేయడం ఆసక్తికరంగా మారింది.
వీధి కుక్కే కానీ..
అదో వీధి కుక్క. దానిని NDRF సిబ్బంది ఓ రెస్క్యూ ఆపరేషన్‌లో కాపాడారు. అప్పటి నుంచి వాళ్లే పెంచుతున్నారు. విపత్తు సమయంలో సహాయక చర్యల్లో ఉపయోగపడేలా ట్రైనింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆ డాగ్.. ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లో మెంబర్ అయింది. లేటెస్ట్‌గా ఆ కుక్క తన టీమ్ మేట్స్‌తో కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగా కూడా చేసింది. అవును. నిజమే. ఆ కుక్క యోగా చేసింది.
యోగా చేసిన కుక్క
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ NDRF సిబ్బందితో కలిసి యోగా చేస్తున్న శునకం వీడియో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. 13వ బెటాలియన్ క్యాంపస్‌లో జరిగిన ప్రత్యేక సెషన్‌లో 55 మందితో కలిసి ఆ కుక్క యోగా చేసింది. అచ్చం మనిషిలానే వివిధ భంగిమలు ప్రదర్శించింది. బోర్లా పడుకుని తలను ముందుకు చాచడం.. కూర్చొని చేతులు పైకి ఎత్తడం.. తదితన యోగాసనాలు ఎంచక్కా చేసింది. ఆ వీడియో భలే బాగుంది. అయితే, ఆ ఈవెంట్‌లో కుక్క వెనుకాల కూర్చున్న ఓ వ్యక్తి యోగాలో చిన్న పొరపాటు చేశాడు. వజ్రాసనంలో కూర్చోవాల్సింది మామూలుగా కూర్చున్నాడు. అదే, కుక్క మాత్రం పర్‌ఫెక్ట్‌గా వజ్రాసనం వేసింది.
స్మార్ట్ డాగ్..
మరో ఆసనంలో.. బోర్లా పడుకుని తలను ముందుకు చాచడం. ఆ కుక్క బొర్లా పడుకుంది కానీ తలను ముందుకు అనలేదు. కాసేపటికే తాను తప్పు చేశానని గుర్తించినట్టుంది ఆ డాగ్. వెంటనే తలను ముందుకు చాచి.. మిస్టేక్ కవర్ చేసింది. తెలివైన కుక్కలా ఉంది. ఆ డాగ్‌కు బాగానే ట్రైనింగ్ ఇచ్చారు NDRF స్టాఫ్. అమెరికన్ ల్యాబ్రాడర్, జర్నన్ షెఫర్డ్ లాంటి జాతి కుక్కలకు ట్రైనింగ్ ఇవ్వడం ఈజీనే కానీ.. ఓ వీధి కుక్కకు ఇంతలా యోగా చేసేలా శిక్షణ ఇచ్చిన సిబ్బందిని, యోగా చేసిన కుక్కను అభినందించాల్సిందే.
కుక్కను చూసైనా..
కుక్క యోగా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుక్కకు యోగా మంచిదేగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీధి కుక్కకు ఉన్నంత అంకితభావం, స్థిరత్వం మనుషులకు కూడా ఉండాలని.. అందరూ యోగా నేర్చుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.