High Court On Local Trains: ముంబై లోకల్ ట్రైన్‌లలో తరచుగా జరిగే ఘటనలపై ముంబై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లోకల్ ట్రైన్‌లలో రద్దీ కారణంగా రైళ్లలోంచి జారిపడటం వల్ల జరుగుతున్న మరణాలను, గాయాలను నివారించేందుకు ఆటోమెటిక్ డోర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సూచనను కేవలం న్యాయపరమైన జోక్యంగానే కాకుండా.. ప్రజల భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను గుర్తుచేసేదిగా చూడాల్సిన అవసరం ఉంది.
ముంబై లోకల్ ట్రైన్స్:
ముంబై లోకల్ రైళ్లు కేవలం రవాణా సాధనాలు మాత్రమే కాదు.. ఆ నగర జీవనాడి. ప్రతిరోజూ లక్షలాది మంది తమ ఉపాధి, ఇతర అవసరాల కోసం ట్రైన్ లలో ప్రయాణం చేస్తుంటారు. ఇదిలా ఉంటే ముంబై ట్రైన్ లలో రద్దీ, పరిమితులకు మించి ప్రయాణికులు ఎక్కడం వంటి కారణాల వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. రైలు డోర్ల వద్ద నిలబడి ప్రయాణించడం, కదులుతున్న రైలు ఎక్కడానికి లేదా దిగడానికి ప్రయత్నించడం వంటివి ప్రాణాపాయానికి దారితీస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఆయా కుటుంబాలను శోకసంద్రంలో ముంచడమే కాకుండా.. నగరంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ప్రమాదాలకు అడ్డుకట్ట:
హైకోర్టు చేసిన ఆటోమెటిక్ డోర్ల సూచన ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. ఈ వ్యవస్థలు అమలులోకి వస్తే, రైలు కదలకముందే డోర్లు అటోమెటిక్‌గా మూసుకుపోతాయి. తద్వారా.. రైలు కదులుతున్నప్పుడు ఎవరూ లోపలికి వెళ్లడం లేదా బయటకు రావడం సాధ్యం కాదు. ఇది నిస్సందేహంగా ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా.. డోర్ల దగ్గర ప్రమాదకరంగా నిలబడటాన్ని నివారిస్తుంది.
ఆచరణయోగ్యమేనా ?
హైకోర్టు సూచనను అమలు చేయడం అంత సులువు కాదు. ఉన్న అన్ని ట్రైన్ లకు ఆటోమెటిక్ డోర్లను అమర్చడంలో.. అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాలు కల్పించడం, నిధులను కేటాయించడం వంటి అనేక సవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వంతో పాటు రైల్వే శాఖ ఈ విషయంపై తీవ్రంగా కృషి చేయాలి. కేవలం ఆటోమెటిక్ డోర్లే కాకుండా.. రైళ్ల సంఖ్యను పెంచడం, ప్రయాణికుల రద్దీని నియంత్రించే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం వంటి చర్యలు కూడా అవసరం.
హైదరాబాద్ లోకల్ ట్రైన్స్:
నిత్యం సుమారు 2 లక్షల మంది సికింద్రాబాద్ స్టేషన్ నుండి వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. ఇక్కడ ఎంఎంటీఎస్ ట్రైన్స్‌ల ద్వారా ప్రయాణించే వారు కూడా చాలా మందే ఉన్నారు. కానీ ముంబై లోకల్ ట్రైన్స్ లతో పోలిస్తే.. హైదరాబాద్ లోకల్ ట్రైన్‌లలో అంతగా రద్దీ ఉండదు. కాబట్టి హైకోర్టు సూచించిన ఆటోమెటిక్ డోర్స్ అవసరం ఇక్కడి ట్రైన్స్‌కు అవసరం ఉండకపోవచ్చు.