ప్రయాణీకుడికి టికెట్ ఛార్జీలు వెనక్కి ఇవ్వకుండా ఎగవేద్దామని ప్లాన్ చేసిన ట్రావెల్ ఏజెన్సీకి వినియోగదారుల ఫోరమ్ తగిన బుద్ది చెప్పింది. కస్టమర్ కు తెలియకుండా టికెట్లు వేరే విమానంలో బుక్ చేయడంతో పాటు చివరకు ట్రిక్ క్యాన్సిల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తిం చేసింది. టూర్ కోసం అతడు చెల్లించిన డబ్బుతో కలుపుకుని మొత్తం రూ. లక్ష చెల్లించాలని ఆదేశించింది.
అండమాన్ టూర్ కోసం మూడు టికెట్లు బుక్
మధురైకి చెందిన ప్రొఫెసర్ వి సెంథిల్ గత ఏడాది (2023) ఏప్రిల్ లో తన ఫ్యామిలీతో కలిసి అండమాన్ టూర్ కు వెళ్లాలి అనుకున్నారు. టికెట్ల బుకింగ్ కోసం శ్రీ మురుగన్ ట్రావెల్ ఏజెన్సీకి రూ. 60 వేలు చెల్లించారు. తనతో పాటు తన భార్య, కొడుక్కు టికెట్లు బుక్ చేయాలన్నారు. సెంథిల్ అనుకున్నట్లుగానే సదరు సంస్థ ఏప్రిల్ లో టూర్ ప్లాన్ చేసింది. విమాన టికెట్లను కూడా బుక్ చేసింది. ఆయనకు సమాచారం కూడా ఇచ్చింది.
కొద్ది రోజుల తర్వాత సెంథిల్ కు చెప్పకుండానే ట్రావెల్ ఏజెన్సీ టికెట్లను రద్దు చేసింది. మరో విమానంలో మూడు టికెట్లను బుక్ చేసింది. ఆ విషయం తనకు చెప్పింది. ఫ్లైట్ మారితే ఏమవుతుందిలే అనుకున్నారు. కానీ, ఈసారి సెంథిల్ కు చెప్పకుండా మొత్తం ట్రిప్ ను రద్దు చేసింది. ఎందుకు ట్రిప్ క్యాన్సిల్ అయ్యిందనే విషయాన్ని కూడా ఆయనకు చెప్పలేదు. పైగా ట్రిప్ ఛార్జీగా అతడు చెల్లించిన మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వలేదు. కొద్ది రోజుల పాటు తన డబ్బును చెల్లించాలని కోరినా సదరు ట్రావెల్ ఏజెన్సీ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో సెంథిల్ వినయోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించారు.
మిగిలిన ట్రిప్ ఛార్జీ కూడా చెల్లించాలన్న ట్రావెల్ ఏజెన్సీ
సుమారు రూ. 60 వేలు రాకపోగా, తాను, తమ కుటుంబ మానసికంగా ఎంతో కుంగిపోయామని సెంథిల్ వినియోగదారుల ఫోరమ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అటు ట్రావెల్ ఏజెన్సీ మాత్రం సెంథిల్ ఆరోపణలను ఖండించింది. ఎయిర్ లైన్స్ సంస్థ దివాలా తీయడం వల్లే ట్రిప్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పింది. టిక్కెట్ ఛార్జీని తిరిగి చెల్లించకుండా అన్ని విమానాలను రద్దు చేసిందని వెల్లడించింది. విమానాలు ఆలస్యమైనా, రద్దు అయినా ఆ ఖర్చులను కస్టమర్ భరించాలని తమ పాంప్లెంట్ లో వెల్లడించామని ఏజెన్సీ తెలిపింది. మిగిలిన ట్రిప్ ఛార్జీ రూ.36,000 చెల్లించకుండా సెంథిల్ ఎగవేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఏజెన్సీ ఆరోపించింది.
సెంథిల్ కు రూ. లక్ష చెల్లించాలని ఆదేశం
ఇరువైపుల వాదనలు విన్న వినియోగదారుల ఫోరమ్.. విమాన టికెట్లను బుక్ చేసుకోవడానికి కస్టమర్ మీ ఏజెన్సీని ఎంచుకున్నారని.. మంచి అయినా, చెడు అయినా మీరే భరించాల్సి ఉంటుందని వెల్లడించింది. అతడి మానసిక ఆందోళనకు కారణం అయినందుకు రూ. 30,000 పరిహారం అందించడంతో పాటు రూ. 10,000 లిటిగేషన్ చార్జీ, టికెట్ల కోసం చెల్లించిన రూ. 60,000, మొత్తం కలిపి రూ. లక్షను సెంథిల్ కు చెల్లించాలని ఆదేశించింది. ఈ డబ్బు అతడికి చెల్లించేందుకు సదరు ట్రావెల్ ఏజెన్సీకి 45 రోజుల సమయాన్ని ఇచ్చింది.
Read Also: బ్యాంకాక్ వెళ్లాలనుకునే వారికి అదిరిపోయే న్యూస్, హైదరాబాద్ నుంచి నేరుగా 4 విమానాలు!