Hyderabad to Bangkok Flight Journey: థాయ్ లాండ్ కు వెళ్లాలనుకునే ప్రయాణీకులకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై వారానికి నాలుగు నాన్ స్టాఫ్ ఫ్లైట్ సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసులు ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ కు వెళ్తాయి. థాయ్ ఎయిర్ ఏషియా నడిపే బ్యాంకాక్ (FD119) విమానం హైదరాబాద్ నుంచి రాత్రి 11:25 గంటలకు బయల్దేరి, స్థానిక కాలమానం ప్రకారం మరుసటి ఉదయం 4:30 గంటలకు బ్యాంకాక్ లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుంది. రిటర్న్ ఫ్లైట్ (FD118) బ్యాంకాక్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:50 గంటలకు బయల్దేరి రాత్రి 10:55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఇలా వారానికి నాలుగు నాన్ స్టాఫ్ ఫ్లైట్లు అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్-బ్యాంకాక్ ఆర్థిక సంబంధాలు బలోపేతం- ప్రదీప్ పనికర్
థాయ్ ఎయిర్ ఏషియా భాగస్వామ్యంతో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ కు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించడంపై జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పనికర్ సంతోషం వ్యక్తం చేశారు. “అంతర్జాతీయ కనెక్టివిటీని పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో హైదరాబాద్-థాయ్ లాండ్ విమాన సర్వీసులు కీలక పాత్ర పోషించనున్నాయి. వ్యాపార, వెకేషన్ ప్రయాణాలను మరింత సులభతరం చేస్తాయి. హైదరాబాద్, బ్యాంకాక్ మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం కానుంది. థాయ్ ఎయిర్ ఏషియా ప్రయాణీకులకు మరింత సరసమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది’’అని వెల్లడించారు.
టూరిజం, వ్యాపారం మరింత అభివృద్ధి- శాంటిసుక్
హైదరాబాద్-బ్యాంకాక్ నడుమ విమాన సర్వీసలు ప్రారంభించడం వల్ల టూరిజం, వ్యాపారం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని థాయ్ ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాంటిసుక్ క్లోంగ్‌చయ్య వెల్లడించారు. “భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాలకు మా నెట్ వర్క్ ను విస్తరించే అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాం. రెండు దేశాల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయడం వల్ల పర్యాటకం, వ్యాపారం మరింత అభివృద్ధి చెందనుంది. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం అవుతుంది. భారతీయ ప్రజల అవసరాలను, థాయ్ లాండ్ నుంచి భారత్ కు రావాలనుకునే ప్రయాణీలకు మరింత సౌకర్యంగా ఉండబోతున్నాయి” అని తెలిపారు.
Read Also: విశాఖ నుంచి థాయ్‌లాండ్ ట్రిప్.. వీసా లేకుండానే చెక్కేయొచ్చు, టికెట్ కూడా చాలా చీప్ గురూ!
వారానికి 67 సర్వీసులు నడుపుతున్న థాయ్ ఎయిర్ ఏషియా
థాయ్ ఎయిర్ ఏషియాకు చెందిన 12 విమానాశ్రయాలు ప్రస్తుతం భారత్ నుంచి బ్యాంకాక్ తమ సర్వీసులను అందిస్తున్నాయి. కోల్ కతా, చెన్నై, జైపూర్, కొచ్చి, బెంగళూరు, గయా, లక్నో, అహ్మదాబాద్, గౌహతి, విశాఖపట్నం, తిరుచిరాపల్లి నుంచి విమాన సర్వీసులను నడుపుతుండగా, ఇప్పుడు హైదరాబాద్ నుంచి సర్వీసులను ప్రారంభించాయి. మొత్తం వారానికి 67 విమానాలను నడుపుతున్నది. ఇప్పటి వరకు థాయ్ లాండ్ కు వెళ్లాలంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కాల్సి ఉండేది. ఇప్పుడు నేరుగా విమాన సర్వీసులు నడుస్తున్న నేపథ్యంలో ప్రయాణీకులకు పెద్ద సంఖ్యలో వెళ్లే అవకాశం ఉంది.
Read Also:షిప్ లో జర్నీ చేస్తూ చనిపోతే.. డెడ్ బాడీని ఏం చేస్తారో తెలుసా?