Indian Railways: మహా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు ప్రయాగరాజ్ కు తరలి వస్తున్నారు. దేశంలోని అత్యంత పవిత్ర ప్రదేశాల్లో ఒకటౌన త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం వల్ల పాప నాశనం పొందే అవకాశం ఉందని భక్తులు విశ్వసిస్తారు. అయితే, ప్రయాగరాజ్ కు పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలి వస్తున్న నేపథ్యంలో విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. సాధారణ ధరలతో పోల్చితే నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగాయి. ఇక రైళ్ల టిక్కెట్ల ధరలు కూడా భారీగా పెరగడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు.
స్పెషల్ రైళ్లలో ధరల పెంపు
కుంభమేళా ప్రత్యేక రైళ్లలో 25 శాతం వరకు అదనంగా టికెట్ ధరలు వసూళు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి దానాపూర్ కు రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ రైల్లో స్లీపర్ క్లాస్ కు టికెట్ ధర రూ.745, త్రీ టైర్ ఏసీ రూ.1,945, టూ టైర్ ఏసీ టికెట్ చార్జీ రూ.2,805గా ఉంది. ప్రత్యేక రైళ్లలో టికెట్ ధరలు స్లీపర్ క్లాస్ రూ.885, త్రీ టైర్ ఏసీ రూ.2,250, టూ టైర్ ఏసీ రూ.3,155గా నిర్ణయించారు. దీంతో ఆయా తరగతుల ప్రయాణీకులకు వరుసగా రూ.140, రూ.305, రూ.350లు అదనపు భారం పడుతోంది.
ప్రీమియం తత్కాల్ సేవలను ఆశ్రయిస్తున్న భక్తులు
మహా కుంభమేళా సందర్భంగా భారతీయ రైల్వే సంస్థ ఏకంగా 13,000 రైళ్లను నడపుతున్నది. వీటిలో రెగ్యులర్ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. అయితే, విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో ప్రయాగరాజ్ కు రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడం సాధ్యం కావడం లేదు. ఫిబ్రవరి 26 వరకు అంటే కుంభమేళా ముగిసే వరకు అన్ని టిక్కెట్లు వెయిట్ లిస్ట్ లోనే కనిపిస్తున్నాయి. ఫలితంగా చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. కొంతమంది ప్రయాణీకులు ప్రీమియం తత్కాల్ సేవల ద్వారా బుకింగ్ చేసుకుంటున్నారు.
తత్కాల్ టికెట్లకు కూడా పోటీ పెరిగిన నేపథ్యంలో మరికొంత మంది ప్రీమియం తత్కాల్ విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇందుకోసం భారీగా డబ్బులు చెల్లించాల్సి వస్తున్నది. తాజాగా స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ నుంచి వారణాసికి థర్డ్ ఎసి టికెట్ కోసం ఒక వ్యక్తి రూ. 3,659 చెల్లించాడు. జనరల్ కేటగిరీలో అదే టికెట్ ధర రూ. 1,055. తత్కాల్ టికెట్ ధర రూ. 1,455 ఉంది. ప్రీమియం తత్కాల్ ఛార్జీ సాధారణ ఛార్జీ కంటే 246.7% పెరిగిందని ఓ ప్రయాణీకుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇండియన్ రైల్వేస్ వెబ్ సైట్ ప్రకారం.. తత్కాల్ ఛార్జీలు బేస్ ఫేర్‌లో 10% నుంచి 30% వరకు ఉంటాయి. కనీస ప్రీమియం తత్కాల్ ఛార్జీ బేస్ ఫేర్, తత్కాల్ ఛార్జీలు, అధిక డిమాండ్ కారణంగా ఈ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంటుంది.
కుంభమేళాకు భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో మరిన్ని అదనపు రైళ్లను నడపాలని భక్తులు రైల్వేను కోరుతున్నారు. డిమాండ్ తక్కువగా ప్రాంతాలకు కేటాయించిన ప్రత్యేక రైళ్లను రద్దు చేసి, రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాలకు నడపాలని కోరుతున్నారు. టికెట్ ఏజెంట్ల మాయాజాలంపై ఫోకస్ పెట్టాలంటున్నారు. యాత్రికులపై అదనపు భారం మోపకుండా చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల ప్రతినిధులు రైల్వే అధికారులను కోరుతున్నారు.
Read Also: భారతీయ రైల్వేలో అన్ని క్లాస్ లు ఉంటాయా? ఒక్కో క్లాస్ టికెట్ రేటు ఎంత ఉంటుందో తెలుసా?