Best Tourist Place: ఆగ్రాలోని తాజ్‌మహల్, భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా 2025లో కూడా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ తెల్లని మార్బుల్ అద్భుతం, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా, లక్షలాది స్వదేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. 2024లో దాదాపు 60 లక్షల మంది సందర్శకులు తాజ్‌ని చూసేందుకు వచ్చారని టూరిజం డేటా చెబుతోంది.
17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించాడు. తాజ్‌మహల్ కేవలం ఒక స్మారక చిహ్నం మాత్రమే కాదు, అది ప్రేమకు చిరస్థాయి చిహ్నం. దీని సమ్మోహన డిజైన్, చక్కటి మార్బుల్ చెక్కడాలు, యమునా నదిలో ప్రతిబింబించే అందం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. తాజ్‌మహల్ అందం నిజంగా మాటల్లో చెప్పలేనిది. దగ్గర నుంచి చూస్తే ఇంకా మెస్మరైజ్ అవుతామని పర్యటకులు చెబుతున్నారు.
తాజ్‌మహల్ ఢిల్లీ, ఆగ్రా, జైపూర్‌లను కలిపే గోల్డెన్ ట్రయాంగిల్ టూరిస్ట్ సర్క్యూట్‌లో భాగం. ఈ రూట్ విదేశీ టూరిస్టులకు ఫేవరెట్, ఎందుకంటే ఇక్కడ చరిత్ర, సంస్కృతి, ఆర్కిటెక్చర్ అన్నీ కలిసి ఉంటాయి. ఆగ్రాలో తాజ్‌తో పాటు ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ వంటి యునెస్కో వారసత్వ స్థలాలను కూడా సందర్శిస్తారు. అలాగే, ఆగ్రా మార్కెట్లలో హస్తకళలు, పేఠా వంటి స్థానిక స్వీట్లు కొనుగోలు చేయడం మరో ఆకర్షణ.
తాజ్‌మహల్ శుక్రవారం తప్ప ఏడాది పొడవునా తెరిచి ఉంటుంది. సూర్యోదయం లేదా సూర్యాస్తమయ సమయంలో చూడటం బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని స్థానిక టూరిజం ఆఫీసర్లు చెప్తారు. తాజ్‌లోని అందమైన గార్డెన్స్, ప్రశాంత వాతావరణం, గైడెడ్ టూర్లు కుటుంబాలు, సోలో ట్రావెలర్లు, చరిత్ర ఔత్సాహికులకు అనువైనవి. లగ్జరీ కోరుకునేవారికి ఒబెరాయ్ అమర్‌విలాస్ వంటి హోటళ్లలో తాజ్ వ్యూతో రూమ్స్ అందుబాటులో ఉన్నాయి.
అయితే, ఇంత పాపులారిటీ వల్ల కొన్ని సమస్యలూ ఉన్నాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు పీక్ సీజన్‌లో జనం గుండు గుండుగా తిరుగుతారు, క్యూలు లాంగ్‌గా ఉంటాయి. దీన్ని అదుపు చేయడానికి ఆన్‌లైన్ టికెట్లు, రోజువారీ సందర్శకుల సంఖ్యపై లిమిట్ పెట్టారు. అలాగే, గాలి కాలుష్యం వల్ల మార్బుల్‌కి హాని జరుగుతుండటంతో కన్జర్వేషన్ పనులు జరుగుతున్నాయి. తాజ్‌ని భవిష్యత్ తరాల కోసం కాపాడేందుకు ప్రభుత్వం టూరిజం, పరిరక్షణ మధ్య బ్యాలెన్స్ చేస్తోంది.
తాజ్‌మహల్ కేవలం ఆర్కిటెక్చర్ అద్భుతం మాత్రమే కాదు, అది ఒక సాంస్కృతిక అనుభవం. ఆగ్రా బజార్లలో షాపింగ్, మొఘలాయ్ వంటకాలు, ఏటా జరిగే తాజ్ మహోత్సవ్‌లో ఆర్ట్, మ్యూజిక్, డాన్స్‌ని ఆస్వాదించవచ్చు. 2022లో 61.9 లక్షల మంది విదేశీ టూరిస్టులు భారత్‌కి వచ్చారు, అందులో తాజ్ ఒక పెద్ద ఆకర్షణ.
చరిత్ర ప్రియులైనా, రొమాంటిక్ ట్రావెలర్లైనా, అందమైన అనుభవం కోరుకునేవారైనా, తాజ్‌మహల్ సందర్శన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలను మిగులుస్తుంది.