Bullet Train Ticket: ముంబయి – అహ్మదాబాద్ ప్రాంతాల మధ్య దేశంలోనే తొలి బుల్లెట్ రైలు రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఇటీవల బుల్లెట్ రైలు టికెట్ ధరలు ఇవేనంటూ పెద్ద ఎత్తున ప్రచారం మెుదలైంది. ఒక్కో టికెట్ ధర రూ.6000-7000 వరకూ ఉంటుందన్న పోస్టులు.. సామాన్యుల్లో ఆందోళన కలిగించాయి. ‘అంత రేట్లు పెట్టి ఇంకెక్కడ బుల్లెట్ రైలు ఎక్కేది’ అన్న అభిప్రాయాలు చాలామందిలో వ్యక్తమయ్యాయి. అయితే ఆ భయాలను పటాపంచలు చేస్తూ కీలక ప్రకటన వెలువడింది.
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్, టికెట్ ధరలపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఖండించింది. బుల్లెట్ రైలు టికెట్ ధరలు భారీగా పెరుగుతాయనే ఆరోపణలను కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ధరలు.. ఊహాజనితమేనని పేర్కొంది. అవి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని చెప్పింది. టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులోనే ఉంటాయన్న సందేశాన్ని పరోక్షంగా ఇచ్చింది.
ప్రాజెక్ట్ వ్యయం పెరిగిందన్న ఆరోపణలపైనా హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ స్పందించింది. పెద్ద ప్రాజెక్టుల్లో అంచనాలు పెరగడమన్నది సర్వ సాధారణమేనని పేర్కొంది. దశాబ్దం క్రితం ప్రాథమికంగా అంచనా వేసిన వ్యయాలను.. లేటెస్ట్ డిజైన్, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్, భూసేకరణ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సవరించడం సహజమని చెప్పింది. బుల్లెట్ ప్రాజెక్టుకు నిధుల కొరత లేదని.. జపాన్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిధుల లభ్యత సజావుగా కొనసాగుతున్నట్లు చెప్పుకొచ్చింది. మరోవైపు ఇండియన్ రైల్వేపై ఈ వ్యయ భారం పడుతుందన్న ఆరోపణలను సైతం NHSRCL తోసిపుచ్చింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కేరళ విభాగం.. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ఖర్చు పెరిగిందని దీనివల్ల భవిష్యత్తులో సామాన్యులపై భారం పడుతుందని ఇటీవల ఎక్స్ వేదికగా ఆరోపించింది. బుల్లెట్ ప్రాజెక్ట్ వ్యయం రూ.1.1 లక్షల కోట్ల నుంచి రూ.1.98 లక్షల కోట్లకు పెరిగిందని.. భవిష్యత్తులో ఇది రూ.2.5 లక్షల కోట్లు కూడా దాటొచ్చని పేర్కొంది. దీనివల్ల రైల్వేపై అదనంగా రూ.90,000 కోట్ల భారం పడనుందని చెప్పింది. ఆర్థిక ఒత్తిడిలో ఉన్న రైల్వేలపై ఇది మరింత భారాన్ని మోపవచ్చని చెప్పింది. ఫలితంగా గతంలో అంచనా వేసిన రూ.3000 టికెట్ ధర (ముంబయి – అహ్మదాబాద్).. రూ.6000-7000 వరకూ పెరగొచ్చని నెట్టింట రాసుకొచ్చింది.
Also Read: Dishwasher Tips: డిష్ వాషర్‌ను గుడ్డిగా వాడేస్తున్నారా? ఈ తప్పులు చేశారో.. మిషన్ పని గోవిందా!
ఇదిలా ఉంటే దేశంలో మెుట్టమెుదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు ముంబయి – అహ్మదాబాద్ మధ్య నిర్మితమవుతోంది. 508 కి.మీ పొడవునా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. 2017లో ప్రాజెక్ట్ పనులు ప్రారంభ కాగా.. ప్రస్తుతం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. 2029 నాటికి బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: AC Cleaning Tips: ఏసీ కూలింగ్ రావట్లేదా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. దెబ్బకు సెట్ అవుతుంది!