Ooty Toy Train: మనలో చాలా మందికి రైలు ప్రయాణం అంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం. ప్రయాణం ఎంత సుదీర్ఘంగా ఉన్నా సరే, కిటికీ పక్కన కూర్చుని బయట ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగే ఆ జర్నీ ఇచ్చే హాయే వేరు. ముఖ్యంగా మన పాత కాలపు రైలు చేసే ఆ అద్భుతమైన ‘చుక్ చుక్’ శబ్దం, ఇంజన్ నుండి వచ్చే ఆవిరి, మలుపులు తిరుగుతుంటే వినిపించే పట్టాల సవ్వడి మనల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి. అటువంటి అరుదైన , చారిత్రక అనుభూతిని ఇచ్చేదే నీలగిరి మౌంటైన్ రైల్వే (NMR).
నీలగిరి మౌంటైన్ రైల్వే
నీలగిరి మౌంటైన్ రైల్ దీనిని అందరూ ప్రేమగా..’ఊటీ టాయ్ ట్రైన్’ అని పిలుచుకుంటారు. 1899లో ప్రారంభించిన ఈ రైల్వే మార్గం అప్పట్లోనే అత్యంత ఎతైన పర్వత ప్రాంతాలను దాటుతూ నిర్మించిన ఒక అద్భుత ఇంజనీరింగ్ సాహసం. పశ్చిమ కనుమలలోని పొగమంచుతో నిండిన పర్వతాలు, పచ్చని తోటలు , అందమైన లోయల గుండా సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది.
పర్వతాల పైకి పరుగు తీసే ఇంజన్!
ఈ రైల్వే మార్గాన్ని బ్రిటీష్ కాలంలో 1854లో ప్రారంభించారు. మెట్టుపాళయం నుండి కూనూర్ వరకు ఉన్న 27.34 కి.మీ మార్గం జూన్ 15, 1899న ప్రారంభమైంది. ఆ తర్వాత 1908 నాటికి దీనిని ఉదగమండలం (ఊటీ) వరకు విస్తరించారు. ఈ మొత్తం 46 కి.మీ ప్రయాణంలో 16 సొరంగాలు, 257 వంతెనలు,209 మలుపులు ఉన్నాయి. ఇది ఆసియాలోనే అత్యంత నిటారైన రైల్వే మార్గం కావడంతో ఇక్కడ ప్రత్యేకమైన ‘రాక్ అండ్ పినియన్’ వ్యవస్థను వాడుతారు.
ప్రపంచ వారసత్వం
మెట్టుపాళయం – కూనూర్ మధ్య ప్రత్యేకమైన ‘X క్లాస్’ ఆవిరి యంత్రాలను ఉపయోగిస్తారు. ఇవి పాతకాలపు వైభవాన్ని గుర్తుచేస్తాయి. వీటిని ప్రస్తుతం తిరుచిరాపల్లిలో తయారు చేస్తున్నారు. దీని విశిష్టతను గుర్తించిన UNESCO, 2005లో దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. 2005లో యునెస్కో దీనిని మౌంటెన్ రైల్వేస్ ఆఫ్ ఇండియాలో భాగంగా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
ఈ వారసత్వాన్ని సంరక్షించేందుకు మెట్టుపాళయంలో నీలగిరి మౌంటెన్ రైల్వే మ్యూజియం 2015 అక్టోబర్ 10న ప్రారంభించబడింది. అలాగే ఉదగమండలంలో హెరిటేజ్ మ్యూజియం 2018 జూన్ 15న ప్రారంభించారు. ఈ మ్యూజియంలు రైల్వే చరిత్రను ప్రదర్శిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
ప్రస్తుతం మెట్టుపాళయం నుండి ఉదగమండలం వరకు రోజూ ఒక రైలు సేవ నడుస్తుంది. అదనంగా కూనూర్ నుండి ఉదగమండలం వరకు రోజుకు మూడు జతల రైళ్లు నడుస్తాయి. వేసవి కాలం, ఇతర సెలవు రోజులలో ప్రత్యేక రైళ్లు కూడా నడుపుతారు.
మెట్టుపాళయం, కూనూర్ ,ఉదగమండలం రైల్వే స్టేషన్లు ప్రస్తుతం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయబడుతున్నాయి. ఈ అభివృద్ధిలో స్టేషన్‌ల పాత వారసత్వ నిర్మాణాన్ని అలాగే ఉంచుతూ ఆధునిక సౌకర్యాలను అందిస్తున్నారు. కుటుంబంతో గానీ, స్నేహితులతో గాని ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ అద్భుతమైన రైలు ప్రయాణాన్ని అస్సలు మిక్ కావద్దు.
Also Read: హాలీవుడ్ రేంజ్ అడ్వెంచర్ మన వైజాగ్‌లో.. పారా మోటార్ రైడ్ మళ్లీ మొదలు, ఈ సారి సరికొత్తగా..