Kakinada – Kotipalli Rail Bus: చాలా మంది రైలు ప్రయాణం చేసి ఉంటారు. బస్సు ప్రయాణం చేసి ఉంటారు. కానీ, రైలు బస్సు ప్రయాణం చేశారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కాకినాడ- కోటిపల్లి నడుమ రైలు బస్సు ప్రయాణీకులకు ఏండ్ల పాటు సేవలు అందించింది. చౌక ధరకే ఎంతో మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చేది. పేదలు, చిరు వ్యాపారులు ఈ రైలు బస్సు సేవలను ఉపయోగించుకునే వారు. కరోనా లాక్ డౌన్ తర్వాత ఈ రైలు సేవలను నిలిపివేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. చారిత్ర గుర్తింపు ఉన్న ఈ రైలు బస్సును మళ్లీ ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.
బాలయోగి చొరవతో కాకినాడ-కోటిపల్లి రైల్వే లైన్
లోక్‌సభ మాజీ స్పీకర్ GMC బాలయోగి చొరవతో కాకినాడ- కోటిపల్లి మధ్య రైల్వే లైన్ ను ఏర్పాటు చేశారు. నవంబర్ 2004లో రైల్వే లైన్ ను ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే 10 కోచ్‌లతో కూడిన ప్యాసింజర్ రైలును నడిపింది. ఆ తర్వాత దాన్ని ఆరు కోచ్ లకు తగ్గించింది. అయినప్పటికీ తక్కువ ఆక్యుపెన్సీ ఉందనే కారణంతో ఇక్కడ నడిచే ప్యాసింజర్ రైలును రద్దు చేసింది. కొంతకాలం సౌత్ సెంట్రల్ రైల్వే గూడ్స్ రైలును నడిపింది. ఆ తర్వాత దాన్ని కూడా రద్దు చేసింది. వాస్తవానికి కాకినాడ-కోటిపల్లి-నర్సాపూర్ మధ్య 70 కిలోమీటర్ల మేర రైల్వే నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బాలయోగి ఆకస్మిక మరణంతో కోటిపల్లి-నర్సాపూర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజలకు సేవలు అందించేందుక రైలు బస్సును అందుబాటులోకి తీసుకొచ్చింది.
తక్కువ ధరకే పేదలకు సేవలు
దక్షిణ మధ్య రైల్వే సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన రైలు బస్సు కాకినాడ-కోటిపల్లి నడుమ సేవలను అందించేది. ఈ రైలు సర్పవరం, సామర్లకోట, రామచంద్రాపురం, ద్రాక్షారామం, కోటిపల్లికి మధ్య ప్రయాణీకులకు సేవలను అందించేది. కాకినాడ-కోటిపల్లి మధ్య బస్సు ఛార్జీ రూ. 30 ఉండగా, రైలు బస్సులో మాత్రం కేవలం రూ. 10 ఉండేది. అయితే, కాకినాడ-కోటిపల్లి నడుమ రైల్వే లైన్‌కు రైల్వేసంస్థ ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో రైల్ కార్ సేవలు కరోనా లాక్ డౌన్ తర్వాత నిలిచిపోయాయి. చాలా ఏళ్ల నుంచి రైల్వే ట్రాక్‌ను కూడా ఉపయోగించకపోవడం వల్ల శిథిల స్థితికి చేరుకుంది. ఇప్పటికైనా ఈ రైలు బస్సు సేవలను మళ్లీ ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.
రైలు బస్సు సేవలపై పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి!
ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేయాలని స్థానికులు ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే డిప్యుటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌కు కొందరు నేతలు ఈ విషయాన్ని చెప్పారని, త్వరలోనే ఆయన దీనిపై స్పందిస్తారని సమాచారం. 2025లో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌లో కోటిపల్లి నర్సాపురం రైల్వే ప్రాజెక్టుకు నిధులు కేటాయించేలా ఒత్తిడి తేవాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. అది పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమవుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి!
Read Also: అబ్బరపరుస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్, ప్రయాణీకుల ఫీడ్ బ్యాక్ ఇదే!