కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది నరేంద్ర మోడీ సర్కారు. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC) కింద తేజస్, వందే భారత్, హమ్ సఫర్ రైళ్లలో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. వివిధ ప్రభుత్వ సంస్థలు, వ్యక్తుల నుంచి వచ్చిన అనేక సూచనలు పరిశీలించిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) ఈ నిర్ణయం తీసుకుంది. ప్రీమియం రైళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటి వరకు రాజధాని, శతాబ్ది, దురంతోకే LTC
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఉంది. అయితే, ప్రస్తుతం ఆ రూల్స్ ను మరింత విస్తరించింది. LTC కింద తేజస్ ఎక్స్ ప్రెస్, వందే భారత్ ఎక్స్ ప్రెస్, హమ్సఫర్ ఎక్స్ ప్రెస్ రైళ్లలోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు DOPT ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇకపై అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు LTC ద్వారా ట్రైన్ జర్నీ చేసే సమయంలో జీతంలో కూడిన సెలవు లభిస్తుంది. అంతేకాదు, టికెట్లపై రీయింబర్స్ మెంట్ కూడా పొందే అవకాశం ఉంటుంది.
LTC అంటే ఏంటి?
లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC) పథకం అనేది రైల్వేశాఖ అందించే ప్రత్యేక ప్రయాణ రాయితీ సౌకర్యం. ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు సంవత్సరాల పాటు తమ స్వస్థలాలకు లేదంటే దేశంలోని ఏదైనా ప్రదేశాన్ని సందర్శించడానికి రాయితీ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఈ పథకానికి సంబంధించిన నిబంధనల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు రెండు సంవత్సరాల వ్యవధిలో రెండుసార్లు సొంతూరికి వెళ్లేందుకు LTCని పొందే అవకాశం ఉంటుంది. లేదంటే రెండు సంవత్సరాల వ్యవధిలో ఒకసారి వారి స్వస్థలాన్ని సందర్శించే అవకాశం, మరొకసారి దేశంలోని ఏదైనా ప్రదేశాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ప్రయాణ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. ఇక LTC పథకం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి, అతడి కుటుంబ సభ్యులు రెండు సార్లు, వేర్వేరు సమయాల్లో వేర్వేరు సమూహాలతో ప్రయాణించే అవకాశం ఉంటుంది. వాళ్లు దేశంలోని ఏ స్థలాన్ని అయినా LTCని పొందుతూ వెళ్లే సందర్శించవచ్చు.
Read Also: దేశంలో అత్యంత చౌకైన ఏసీ రైలు ప్రయాణం ఇదే.. వేగంలో వందే భారత్ కు ఏమాత్రం తీసిపోదు!
సంతోషం వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం తమకు అనుకూలమైన సమయంలో జర్నీ చేసుకునే వెసులుబాటు పెరిగిందంటున్నారు. అటు ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం మీద అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందంటున్నారు ఆర్థికశాఖ అధికారులు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Read Also: నార్త్ టు సౌత్, శీతాకాలంలో బెస్ట్ ట్రైన్ జర్నీస్, లైఫ్ లో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే!