Indian Railways: హైదరాబాద్ చర్లపల్లిలో వరల్డ్ క్లాస్ స్టాండర్ట్స్ తో కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక రైల్వే స్టేషన్ ను నిర్మించింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల మీద ప్రయాణీకుల రద్దీ ఒత్తిడిని తగ్గించేందుకు ఈ రైల్వే స్టేషన్ ను ఏర్పాటు చేశారు. సుమారు రూ. 730 కోట్ల వ్యయంతో అత్యద్భుతంగా నిర్మించారు. అయితే, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల ప్రణాళికా లోపం కారణంగా చర్లపల్లి నుంచి రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా ఇదే విషయాన్ని పలువురు ఎంపీలు దక్షిణ మధ్య రైల్వే అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పలు రైళ్లను చర్లపల్లి నుంచి నడిపిస్తున్నారు. ఇక్కడి నుంచి నడిపించడం వల్ల సమస్యలు వస్తున్నాయని ఎంపీలు గుర్తు చేశారు. వరంగల్, నల్లగొండ వైపు వెళ్లే రైళ్లకు బదులుగా, ముంబై, పూణే, బెంగళూరు వైపు వెళ్లే రైళ్లను చర్లపల్లి నుంచి నడిపిస్తే బాగుంటుందన్నారు. వరంగల్, నల్లగొండ వైపు వెళ్లే రైళ్లను సికింద్రాబాద్ లేదంటే కాచిగూడ నుంచి నడిపించాలని సూచించారు.
రవాణా సౌకర్యం సరిగా లేక ప్రయాణీకుల అవస్థలు
చర్లపల్లి రైల్వే టెర్మినల్ దగ్గర ప్రయాణీకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. టెర్మినల్ లోపలికి బస్సుల అనుమతి లేకపోవడంతో, ప్రయాణీకులు 400 మీటర్లు నడాల్సి వస్తుంది. సికింద్రాబాద్ లో పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పలు రైళ్లను చర్లపల్లి నుంచి నడిపిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి చేరుకోవడానికి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సరిగా లేకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.
చర్లపల్లిలో ప్రయాణీకుల ఇబ్బందులు
⦿ బస్సులకు అనుమతి లేదు: చర్లపల్లి రైల్వే టెర్మినల్ లోకి బస్సుల అనుమతి లేకపోవడంతో, ప్రయాణీకులు చాలా దూరం నడవాల్సి వస్తుంది. లగేజీతో రైల్వే స్టేషన్ లోకి వెళ్లాలన్నా, రైల్వే స్టేషన్ నుంచి బయటకు రావాలన్నా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అటు చర్లపల్లి నుంచి నగరం అంతటా వెళ్లేందుకు సరిగా బస్సు సౌకర్యం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
⦿ సరిపడ ఎంఎంటీఎస్ రైళ్లు లేకపోవడం: చర్లపల్లి నుంచి రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ సరిపడ ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులో ఉంచడం లేదు. ప్రయాణీకులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రయాణీకుల ఇబ్బందులు తీరాలంటే?
చర్లపల్లి రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణీకుల ఇబ్బందులు తప్పాలంటే.. టెర్మినల్ లోపలికి బస్సులను అనుమతించాలి. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచాలి. చర్లపల్లికి చేరుకోవడానికి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సౌకర్యాలను మెరుగుపరచాలి. చర్లపల్లి నుంచి లింగంపల్లి, నేరెడ్‌మెట్ మీదుగా సరిపడా ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలని ప్రయాణీకులు కోరుతున్నారు. చర్లపల్లి, మల్కాజిగిరి మీదుగా సికింద్రాబాద్, హైదరాబాద్, ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రయాణీకుల సమస్యలను పరిష్కరించే అంశాలపై దృష్టి పెట్టినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: విశాఖ మెట్రో కీలక ముందడుగు.. పనులు ప్రారంభం ఎప్పటి నుంచి అంటే?