Vishakhapatnam Metro Rail: విశాఖపట్నం నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఏపీ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం అవుతాయని వెల్లడించింది. ఈ మేరకు విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) చైర్మన్ ఎంవీ ప్రణవ్‌గోపాల్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు క్రెడాయ్, అప్రెడా, నరేడ్కో అధికారులతో ప్రణవ్ గోపాల్ సమావేశం అయ్యారు. “విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు మరో 6 నెలల్లో మొదలవుతాయి. తొలి దశలో మూడు కారిడార్లుగా, 46.23 కి.మీ పరిధిలో నిర్మాణం జరుగుతుంది. మొత్తం 42 స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టు రూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం జరుపుకోనుంది. డబుల్ డెక్కర్ మోడల్‌లో విశాఖ మెట్రో రైలు నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే డీపీఆర్ రెడీ అయ్యింది. మూడున్నర ఏళ్లలో పూర్తి చేస్తాం” అన్నారు.
మూడు కారిడార్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే?
విశాఖలో మొత్తం మూడు కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణం జరగనుంది. ఇందులో మొదటి కారిడార్ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది కూడలి వరకు 34.4 కి.మీ మేర నిర్మిస్తారు. రెండో కారిడార్ గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు 5.07 కి.మీ నిర్మాణం జరుపుకోనుంది. మూడో కారిడార్ తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 6.75 కి.మీ. మేర నిర్మాణం జరగుతుంది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ గతంలోనే అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
కేంద్రం అనుమతులు రాగానే నిర్మాణ పనులు
కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే విశాఖపట్నం మెట్రో పనులు ప్రారంభం అవుతాయని ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 99.8 ఎకరాల భూమి అవసరం అవుతందన్నారు. ఈ భూసేకరణకు రూ. 882 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ.6,100 కోట్ల రుణం కోసం AIIB, ADB లాంటి బ్యాంకులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. భూసేకరణ ఖర్చుతో పాటు మొత్తం నిధుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 20 శాతం భరించనున్నట్లు వెల్లడించారు. మే నెలాఖరు వరకు టెండర్లు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
బ్యాంకర్లతో ఏపీ మెట్రో ఎండీ సమావేశం
అటు విశాఖతో పాటు అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి ప్రైవేటు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. విశాఖ, అమరావతి మెట్రో రైలు ప్రాజెక్ట్ లకు తక్కువ వడ్డీకి రుణం అందివ్వాలని కోరారు. మొత్తం రూ.11,498 కోట్ల అంచనాతో విశాఖ ప్రాజెక్టు ప్రారంభం అవుతుండగా, రూ.6,100 కోట్లు రుణం అవసరం అవుతుందన్నారు. పీపీపీ విధానంలో ప్రైవేటు బ్యాంకులు రూ.6,100 కోట్లు నిధులు అందిస్తే, మిగిలిన మొత్తం రూ.5,398 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 16,000 మంది ప్రయాణీకులు సులభంగా తమ గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖలో ట్రాఫిక్ సమస్య తగ్గి, నగర అభివృద్ధికి మేలు కలిగే అవకాశం ఉందంటున్నారు.
Read Also: హైదరాబాద్ మెట్రోకు.. ఇతర నగరాల మెట్రో ఛార్జీలకు మధ్య తేడా ఎంత? ఎక్కడ ఎక్కువ?