Indian Railways: రైల్వే టికెట్లు దొరకని ప్రయాణీకులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్న 31 ఏండ్ల మాజీ రంజీ క్రికెటర్ ను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. పూణె రైల్వే స్టేషన్ లో ప్రయాణీకులకు నకిలీ టికెట్ కన్ఫర్మేషన్ మెసేజ్ లను పంపుతూ చీట్ చేస్తుండగా పట్టుకున్నారు. చివరి నిమిషంలో టికెట్ దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి కన్ఫర్మ్ టికెట్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు గుంజుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రయాణీకులను ఎలా మోసం చేస్తాడంటే?
మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన ప్రవీణ్ కుమార్ మధుకర్ లోంధే(31) మంచి చదువరి. ఐఐటీ జేఈఈ, ఎన్టీఏ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాడు. ప్రవీణ్, మాజీ రంజీ ప్లేయర్ కూడా. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా ఎక్కడా దొరకలేదు. ఈజీ మనీ కోసం రైల్వే ప్రయాణీకులను టార్గెట్ చేశాడు. రైల్వే అధికారులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, కన్ఫర్మ్ టికెట్లు ఇప్పిస్తానని చెప్పి మోసాలు చేయడం మొదలు పెట్టాడు. గత 20 రోజులలో ఏకంగా 12 మంది ప్రయాణీకులను మోసం చేశాడు.
పోలీసులకు ఎలా చిక్కాడంటే?
తాజాగా రోకాయ అనే వ్యక్తి పూణె రైల్వే స్టేషన్ లో టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా.. ప్రవీణ్ అతడి దగ్గరికి వెళ్లి కన్ఫర్మ్ టికెట్ ఇప్పిస్తానని చెప్పాడు. సదరు ప్రయాణీకుడు ప్రవీణ్ మాటలు నమ్మాడు. అతడి వివరాలను అందించాడు. కాసేపటికి ప్రవీణ్ మొబైల్ నెంబర్ నుంచి రోకాయ వెళ్లాల్సిన ట్రైన్ కు నకిలీ టికెట్ కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది. వెంటనే రోకాయ.. ప్రవీణ్ కు రూ. 2000 ఇచ్చాడు. రైలు ఎక్కిన తర్వాత రోకాయకు అసలు విషయం తెలిసింది. అప్పటికే తనకు కేటాయించిన సీట్లో మరో వ్యక్తి కూర్చుకున్నాడు. టీటీఈ రోకాయ బెర్త్ కన్ఫర్మేషన్ నకిలీదని తేల్చారు. డిసెంబరు 22న నిరంజన్ చౌదరి అనే మరో ప్రయాణీకుడిని కూడా ఇలాగే మోసం చేశాడు. గత కొద్ది రోజులుగా పలు కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రైల్వే పోలీసులు ప్రవీణ్ ను పూణె స్టేషన్ లో అరెస్టు చేశారు.
Read Also: పొరుగు దేశాల్లోనూ పద్ధతి మారదా? ఫిన్లాండ్ రైల్లో ఆ ఇండియన్ ఫ్యామిలీ ఏం చేశారంటే?
రైల్వే స్టేషన్ కౌంటర్ దగ్గర నిఘా పెట్టి పట్టుకున్న పోలీసులు
వరుసగా ఫేక్ టికెట్ల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రైల్వే పోలీసులు పూణె రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ దగ్గర నిఘా పెట్టారు. ఎప్పటి లాగే కన్ఫర్మ్ టికెట్ దొరకని ప్రయాణీకులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రవీణ్ ను అరెస్టు చేశారు. నిందితుడు ప్రవీణ్ కుమార్ మధుకర్ లోంధే ప్రయాణీకుల మొబైల్ నంబర్‌కు నకిలీ కన్ఫర్మ్ టికెట్లను పంపుతూ మోసం చేస్తున్నట్లు గుర్తించినట్లు ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటి వరకు ప్రవీణ్ సుమారు 20 మందికి పైగా ప్రయాణీకులను మోసం చేసినట్లు వెల్లడించారు. అటు ప్రవీణ్ కూడా చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అతడి మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, జైలుకు పంపించినట్లు తెలిపారు.