భారతీయులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గౌరవం ఉంది. ఇండియన్స్ అనగానే విదేశీయులు సైతం రెస్పెక్ట్ ఇస్తారు. కానీ, కొంతమంది వ్యక్తులు ప్రవర్తించే తీరు విదేశాల్లో భారత్ తలదించుకునేలా చేస్తుంది. తాజాగా ఫిన్లాండ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. రైల్లో ప్రయాణించేటప్పుడు ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలనేది కామన్ సెన్స్. కానీ, ఓ ఇండియన్ ఫ్యామిలీ గట్టి గట్టిగా అరుస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించారు. ఈ విషయాన్ని గమనించిన మరో భారతీయుడు సదరు ఫ్యామిలీ తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాడు. మన వాళ్లు ఎక్కడికి వెళ్లినా నిజంగా సివిక్ సెన్స్ రాదంటూ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
తాజాగా గోకుల్ శ్రీధర్ అనే భారతీయుడు ఫిన్లాండ్ కు వెళ్లాడు. ఆయన ఆల్ట్రా-క్వైట్ రైల్లో ఎక్కాడు. అప్పటికే ఓ ఇండియన్ ఫ్యామిలీ ఆ రైల్లోకి ఎక్కింది. ఆ రైల్లో నిశ్శబ్దంగా ఉండాలనే నిబందన ఉన్నప్పటికీ, పట్టించుకోకుండా ఆ ఫ్యామిలీ గట్టి గట్టిగా అరవడాన్ని ఆయన గమనించాడు. వారి మూలంగా ఇతరులకు ఇబ్బంది పడటాన్ని చూశాడు. సదరు వ్యక్తి ఎవరికో వీడియో కాల్ చేసి గట్టి గట్టిగా మాట్లాడుతుండగా అందరూ వారి వైపు చూశారు. అయినా, తోటి వారిని పట్టించుకోకుండా వారి పనిలో వాళ్లు ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా గోకుల్ శ్రీధర్ ప్రస్తావిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనవాళ్లు ఎక్కడికి వెళ్లినా సివిక్ సెన్స్ అనేది ఉండదని మండిపడ్డారు. “నేను లాప్ ల్యాండ్ నుంచి హెల్సింకికి వెళ్లేందుకు రైలు ఎక్కాను. అప్పటికే అల్ట్రా-క్వైట్ క్యారేజ్ లోకి ఓ ఇండియన్ ఫ్యామిలీ ఎక్కింది. అందులోని వ్యక్తి వీడియో కాల్ చేసి ఎవరితోనో హిందీలో గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు. వారి క్యాబిన్ తెరిచి ఉన్నప్పటికీ పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. ఏ దేశానికి వెళ్లినా మనకు నిజంగా సివిక్ సెన్స్ రాదు అని చెప్పడానికి ఇదో ఉదాహారణ” అని శ్రీధర్ రాసుకొచ్చారు.
I'm on a train from Lapland to Helsinki and there's one family in the otherwise ULTRA QUIET carriage that's being very loud, talking to someone over a video call. In Hindi. With their cabin doors open.
We REALLY don't get civic sense, do we?
— Gokul ⚡️ (@gokulns) December 23, 2024
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రీధర్ పోస్టు
గోకుల్ శ్రీధర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బహిరంగ ప్రదేశాల్లో భారతీయుల ప్రవర్తనపై చర్చను రేకెత్తిస్తున్నది. “నేను లండన్ లోనూ ఇలాంటి ఘటనలు చాలాసార్లు చూశాను. మనవాళ్లు ఎక్కడికి వెళ్లినా ఇలాగే ప్రవర్తిస్తారు” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
విదేశాల్లో ప్రవర్తన మార్చుకోవాలంటూ సూచనలు
భారతీయ పౌరులు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వారికి ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఏ దేశానికి వెళ్లినా ఆదేశ పౌరులతో కలిసిపోయి నడుచుకోవాలంటున్నారు. అక్కడి రైళ్లలో, బస్సులలో ప్రయాణించే సమయంలో క్రమశిక్షణతో మెలగడం మంచిదంటున్నారు. లేకపోతే, యావత్ భారత్ మీదే చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. రీసెంట్ గా ఇండియా నుంచి థాయ్ లాండ్ కు వెళ్లే విమానంలో పలువురు ప్యాసెంజర్లు నిలబడి ముచ్చట్లు చెప్పుకుంటూ ఎయిర్ హోస్టెస్ కు ఇబ్బంది కలిగించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో భారతీయులు విదేశాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా నడుచుకోవాలని సూచిస్తున్నారు.
Read Also: రైల్లోనే మహిళను ఎలా దహనం చేశాడు? మిగతా ప్రయాణికులు ఏం చేస్తున్నారు?