Pulicat Lake: పులికాట్ సరస్సు.. భారతదేశంలో రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో విస్తరించి ఉంది. ఈ సరస్సు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తికి 27 కి.మీ. దూరంలో, సుమారు 600 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. శ్రీహరికోట ద్వీపం ఈ సరస్సును బంగాళాఖాతం నుంచి వేరు చేస్తుంది. వర్షాకాలంలో సరస్సు విస్తీర్ణం 460 చ.కి.మీ. వరకు పెరుగుతుంది, ఇది ప్రకృతి ప్రేమికులకు, పక్షి సందర్శకులకు అద్భుతమైన గమ్యస్థానం.
ప్రత్యేకతలు
పులికాట్ సరస్సు పక్షుల సంరక్షణ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. అక్టోబర్ నుండి మార్చి వరకు సైబీరియా, నైజీరియా, రాజస్థాన్‌ల నుండి ఫ్లెమింగోలు, పెలికాన్‌లు వంటి వలస పక్షులు ఇక్కడకు చేరుకుంటాయి. సరస్సు చుట్టూ వాచ్ టవర్లు, పక్షుల ఆడిటోరియం, గ్రంథాలయం, మ్యూజియం వంటి సౌకర్యాలు ఉన్నాయి. సముద్రపు నీరు, మంచినీటి కలయిక వల్ల ఇక్కడ సముద్ర జీవవైవిధ్యం సమృద్ధిగా ఉంటుంది. సరస్సులో బోటింగ్ సౌకర్యం ఉండటం పర్యాటకులకు మరో ఆకర్షణ. స్థానిక మత్స్యకారుల వద్ద బోటు అద్దెకు తీసుకొని సరస్సు సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.
టూరిస్ట్ విశేషాలు
పులికాట్ సరస్సు పర్యాటకులకు పిక్నిక్ స్థలంగా, పక్షి పరిశీలకులకు స్వర్గధామంగా ఉంటుంది. సరస్సు ఒడ్డున ఉన్న పులికాట్ పట్టణం చారిత్రక ఆకర్షణలను కలిగి ఉంది. ఒకటవ శతాబ్దంలో ఈ ప్రాంతం ఓడరేవుగా పేరొందిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. సమీపంలోని శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌ను కూడా సందర్శించవచ్చు. శీతాకాలంలో పక్షుల సందడి, సూర్యాస్తమయ దృశ్యాలు సందర్శకులను కట్టిపడేస్తాయి.
ప్రకృతి, చరిత్రలను ఇష్టపడుతూ.. సాహస యాత్రలను కోరుకునే ప్రతి ఒక్కరికీ మరపురాని అనుభవాన్ని అందిస్తుంది. ఈ సరస్సు పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిద్దాం
రోడ్డు మార్గంలో ఇలా వెళ్లొచ్చు
తిరుపతి నుండి: SH61 ద్వారా 1 గంటలో చేరుకోవచ్చు. స్థానిక బస్సులు లేదా ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
శ్రీకాళహస్తి నుండి: స్థానిక ఆటోలు లేదా టాక్సీల ద్వారా 30-40 నిమిషాల్లో చేరవచ్చు