Big Heatwave Alert: ఏపీ రాష్ట్రం మండిపోతోంది. ఎండలు మామూలుగా లేవు.. భగ్గుమంటున్నాయి. వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను ఇంట్లోనే ఉరికించేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల మార్కును దాటి పోయాయి. వాతావరణ శాఖ సూచనల ప్రకారం రేపు గరిష్ఠంగా 43.5°C వరకు వెళ్ళే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అతి ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా పెద్దదోర్నాల, జగ్గిలిబొంతు, నంద్యాల, కడప ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా నివేదిక ప్రకారం, 29 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 41 మండలాల్లో సాధారణ వడగాలులు నమోదవుతాయి. ఉదయం నుంచే పొడి గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు బయటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వడదెబ్బ ప్రమాదం పెరిగే అవకాశమున్నందున పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య శాఖ సూచిస్తోంది. ఉదయం 11 గంటల తర్వాత బయటికి వెళ్లొద్దని, నీరు, చల్లని ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని వారు సూచించారు. బయటకు వెళ్లే సమయంలో తలపై తొడుగు, గుడ్డ, కూలింగ్ గ్లాసులు వాడాలి.
ఇప్పుడు రోజురోజుకు ఎండ తాకిడి అధికం అవుతుందని చెప్పవచ్చు. మే నెల మొదటి వారంలోనే ఈ రకమైన ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రజలు అంటున్నారు. కేవలం నగరాలలోనే కాకుండా, గ్రామాలలో కూడా ఇదే తరహా ఎండ ప్రభావం కనిపించడం విశేషం.
అయితే రాయలసీమలోని అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ఇది ఎండ ప్రభావాన్ని తగ్గించేంత స్థాయిలో ఉండదని తెలుపుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తంగా లేకుంటే వడదెబ్బ బారిన పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Tirumala Darshan: 10 అడుగుల దూరం నుంచి శ్రీవారి దర్శనభాగ్యం.. ఎవరికో తెలుసా?
తెలంగాణలో..
ఈ వారంలో తెలంగాణలో వేడి పెరుగుతూ, ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మే 12 నుండి ఉష్ణోగ్రతలు 42°C-44°C మధ్య ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరుకోనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలలో ఈ వేడి ఎక్కువగా ఉంటుందట. తెలంగాణ వ్యాప్తంగా బలమైన వడగాలులు కూడా ప్రభావం చూపిస్తాయి. ప్రత్యేకంగా పెద్ద నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం ఉంది. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.