Ganesh Chaturthi Special Trains 2026: గణపతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని మొత్తం 254 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు కొంకణ్ రైల్వే ప్రకటించింది. సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి ప్రారంభం కానుండటంతో, అంతకంటే ముందే ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
కొంకణ్ రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రత్యేక రైళ్లలో 246 సర్వీసులను సెప్టెంబర్ 11 నుంచి 27వ తేదీ మధ్య వివిధ మార్గాల్లో నడపనున్నారు. సెంట్రల్ రైల్వేతో సమన్వయం చేసుకుని ఈ సేవలను నిర్వహించనున్నారు. పండుగ సమయంలో ముంబై, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల నుంచి కొంకణ్, గోవా, కర్ణాటక వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి.
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి సావంత్ వాడి, రత్నగిరి, మడ్గావ్, మంగళూరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అలాగే లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి రత్నగిరి, మడ్గావ్, మంగళూరు మార్గాల్లో కూడా ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పుణే నుంచి రత్నగిరి, సావంత్‌వాడి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా అదనపు రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
అన్ని ప్రత్యేక రైళ్లు ప్రతిరోజూ నడిచే అవకాశం ఉండదు. వేర్వేరు తేదీల్లో, వివిధ సమయాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అందువల్ల ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే ముందు రైలు నంబర్, తేదీ, సమయం లాంటి వివరాలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకోసం నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ లేదంటే కొంకణ్ రైల్వే యాప్‌లో చూడాలన్నారు.
అటు పశ్చిమ రైల్వేతో కలిసి మరో ఎనిమిది ప్రత్యేక రైళ్లను కూడా నడపనున్నారు. ఈ రైళ్లు బాంద్రా టెర్మినస్, వడోదర, విశ్వమిత్రి, భూసావల్, వల్సాద్ వంటి స్టేషన్ల నుంచి బయలుదేరనున్నాయి. దీంతో పండుగ సమయంలో ప్రయాణికులకు మరిన్ని రైలు ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రత్యేక రైళ్లకు బుకింగ్‌లు ప్రారంభమైనట్లు తెలిపారు. సాధారణ రైళ్లపై మాత్రమే ఆధారపడకుండా, అందుబాటులో ఉన్న ప్రత్యేక రైళ్లలో ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.
గణపతి పండుగ సమయంలో మహారాష్ట్రలోని ముంబై, పుణే లాంటి నగరాల నుంచి కొంకణ్ ప్రాంతానికి భారీగా ప్రయాణికులు వెళ్తుంటారు. రోడ్డు మార్గంలో కూడా రద్దీ ఎక్కువగా ఉండే ఈ సమయంలో రైలు ప్రయాణానికి డిమాండ్ పెరుగుతుంది. సాధారణ రైళ్లలో టికెట్లు దొరకడం కష్టమయ్యే పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు. గణపతి పండుగ రద్దీని తగ్గించడంలో ఈ 254 ప్రత్యేక రైళ్లు కీలకంగా మారే అవకాశం ఉంది. సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటే చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
Read Also: 24 గంటల ప్రయాణం ఇక 16 గంటలే.. కొత్త వందేభారత్ స్లీపర్ వచ్చేస్తోంది!