First LNG Train in India: భారతీయ రైల్వేలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో దేశంలో తొలిసారిగా లిక్విడ్ నేచురల్ గ్యాస్ (LNG) ఆధారిత డ్యూయల్-ఫ్యూయల్ రైలును ప్రారంభించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సబర్మతి రైల్వే స్టేషన్ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
ఈ రైలును పూర్తిగా LNGతో నడిచే రైలుగా భావించాల్సిన అవసరం లేదు. ఇందులో డీజిల్–LNG డ్యూయల్ ఫ్యూయల్ వ్యవస్థను ఉపయోగించారు. అంటే, అవసరాన్ని బట్టి ఇంజిన్ రెండు ఇంధనాలతో పనిచేయగలదు. సబర్మతి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ డిపోలోని రెండు డ్రైవింగ్ పవర్ కార్లను ఈ టెక్నాలజీకి అనుగుణంగా మార్చారు. ఒక్కో పవర్ కార్ సామర్థ్యం 1,400 HP ఉంటుంది.
ఈ కొత్త వ్యవస్థలో LNG ద్వారా సాధారణ డీజిల్ వినియోగంలో సుమారు 40 శాతం వరకు భర్తీ చేయవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీని వల్ల ఇంధన ఖర్చు తగ్గడంతో పాటు కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, పార్టిక్యులేట్ మ్యాటర్ లాంటి ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంది. ఒక్క పవర్ కార్‌కు ఏడాదికి సుమారు రూ.11.9 లక్షలు, ఎనిమిది కోచ్‌ల రేక్‌కు సుమారు రూ.23.9 లక్షల వరకు ఫ్యూయల్ ఖర్చు ఆదా కావచ్చని అంచనా వేశారు.
ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు ఈ టెక్నాలజీతో మార్చిన పవర్ కార్లపై 2,000 కిలోమీటర్లకు పైగా ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించారు. పనితీరు, రిలయబులిటీ లాంటి అంశాలను పరిశీలించిన తర్వాతే రైలును ప్రారంభించారు. తొలి ప్రయాణం సబర్మతి నుంచి మహేసానా జంక్షన్ మార్గంలో సాగింది.
LNGను నిల్వ చేయడానికి ప్రతి డ్రైవింగ్ పవర్ కారులో క్రయోజెనిక్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. ఒక్కో ట్యాంక్ సామర్థ్యం సుమారు 2,200 లీటర్లు. పూర్తి సామర్థ్యంతో నింపిన ట్యాంక్ రోజువారీ ఆపరేషన్‌లో సుమారు 444 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి సరిపడేలా రూపొందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. LNG రైలుతో పాటు సబర్మతి ప్రాంతంలో రూ.1,472 కోట్ల విలువైన పలు రైల్వే అభివృద్ధి పనులను కూడా ప్రారంభించారు. ఇందులో రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన WAG-12 లోకోమోటివ్ మెయింటెనెన్స్ షెడ్ కూడా ఉంది. ఎక్కువ సామర్థ్యం కలిగిన 12,000 HP WAG-12 ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ల నిర్వహణకు ఈ షెడ్ ఉపయోగపడనుంది.
డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాలనే ప్రయత్నాల్లో LNG రైలు ఒక ముఖ్యమైన ప్రయోగంగా నిలిచింది. అయితే, భారతీయ రైల్వేలో విద్యుదీకరణ కూడా విస్తృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, LNG లాంటి ప్రత్యామ్నాయ ఫ్యూయల్ టెక్నాలజీలను రైల్వే అందుబాటులోకి తీసుకొస్తోంది.
Read Also: బోగీలోనే మూత్రం పోసిన తాగుబోతు, అందులోనే దొర్లించి.. చితక్కొట్టిన ప్రయాణికులు!