Railway Ticket Rules: అక్టోబర్ 1 నుంచి రైల్వే టికెట్ తనిఖీలు మరింత కఠినంగా మారనున్నాయి. అక్టోబర్ 1 నుంచి 31 వరకు ప్రత్యేక టికెట్ చెకింగ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా రాయితీపై టికెట్లు తీసుకునేవారు, నిర్దిష్ట రిజర్వేషన్ కోటాలను ఉపయోగించేవారు, రైల్వే పాస్‌లు, ఈ పాస్, PTOపై ప్రయాణించే వారు తమ ఒరిజినల్ ఐడీలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు.
టికెట్లు నిజమైనవేనా? వాటిని ఉపయోగిస్తున్న వ్యక్తికే ఆ టికెట్‌పై ప్రయాణించే అర్హత ఉందా? అనే అంశాలను తనిఖీ చేసేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సెంట్రల్ రైల్వే పరిధిలోని రైళ్లు, స్టేషన్లలో ఈ తనిఖీలు కొనసాగనున్నాయి. ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించే వారూ తమ ఒరిజినల్ ఐడీలను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు సూచించారు.
ఒకే టికెట్‌పై ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఐడీ విషయంలో జాగ్రత్త అవసరం. టికెట్‌లో ఉన్న ప్రయాణికుల్లో కనీసం ఒకరు రైల్వే సూచించిన ఒరిజినల్ గుర్తింపు పత్రాన్ని చూపించాలి. అవసరమైన ఒరిజినల్ ఐడీ చూపించలేకపోతే, ఆ టికెట్‌పై ప్రయాణిస్తున్న వారందరినీ చెల్లుబాటు అయ్యే టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లుగా పరిగణించే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. అలాంటి సందర్భాల్లో చట్ట పరమైన చర్యలు, జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
వృద్ధులు, ఇతర అర్హత కలిగిన ప్రయాణికులు, ప్రత్యేక రాయితీల కింద టికెట్లు తీసుకునే ప్రయాణికులపైనా తనిఖీలు జరగనున్నాయి. కేవలం టికెట్ చూపిస్తే సరిపోదు. ఆ రాయితీ పొందేందుకు తాము అర్హులమని నిరూపించే అవసరమైన ఒరిజినల్ గుర్తింపును చూపించాల్సి ఉంటుంది. అలాగే నిర్దిష్ట రిజర్వేషన్ కోటాల కింద బుక్ చేసుకున్న టికెట్ల విషయంలోనూ అర్హతను అధికారులు పరిశీలించనున్నారు.
రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉపయోగించే ఈ పాస్, PTO ప్రయాణికులు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ పాస్, PTOపై ప్రయాణించే వారు నిర్దేశించిన ఒరిజినల్ ఐడీని వెంట ఉంచుకోవాలి. అంతేకాదు, ప్రయాణం ప్రారంభించే ముందు ఈ పాస్, PTOను అవసరమైన ప్రయాణ అధికార పత్రంగా మార్చుకున్నారా? లేదా? అనేది నిర్ధారించుకోవాలని రైల్వే సూచించింది.
ఈ తనిఖీలు కేవలం రిజర్వేషన్ టికెట్లకే పరిమితం కావు. రిజర్వేషన్ లేని టికెట్ల నిజమైనదా కాదా అనే అంశంపైనా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అనుమానం ఉన్న టికెట్లను తనిఖీ చేసే సమయంలో అవసరమైతే TTE యాప్ ద్వారా వాటి వివరాలను పరిశీలించనున్నారు.
Read Also: బోగీలోనే మూత్రం పోసిన తాగుబోతు, అందులోనే దొర్లించి.. చితక్కొట్టిన ప్రయాణికులు!