Railway Tickets fare: రైల్వే శాఖ ఛార్జీల ధరలను స్వల్పంగా పెంచింది. పెరిగిన ధరలు జూలై ఒకటి అనగా సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఏసీ తరగతి ప్రయాణించేవారికి కిలోమీటరుకు రెండు పైసలు పెరిగింది. అదే నాన్ ఏసీ ప్రయాణికులు ఒక పైసా చొప్పున పెంచింది. తరగతుల వారీగా పలు రకాల రైళ్లలో పెరిగిన టికెట్ చార్జీల వివరాలను వెల్లడించింది.
రైల్వేశాఖ టికెట్ల పెంపులో మధ్య తరగతి ప్రజలకు కాసింత రిలీఫ్ ఇచ్చింది. ప్రతిరోజూ రైళ్లలో రాకపోకలు సాగించే ప్రయాణికులపై ఎలాంటి భారం మోపలేదు. ముఖ్యంగా సబర్బన్ రైళ్లు, మంత్లీ సీజన్ టికెట్ల ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే 500 కిలో మీటర్లలోపు ప్రయాణాల సెకండ్ క్లాస్ టికెట్ ధరలో మార్పులు చేయలేదు. వారికి పాత ధరలు వర్తించనున్నాయి.
ఎటొచ్చి సెకండ్ క్లాస్‌లో 500 కిలోమీటర్లు దాటితే టికెట్ ఛార్జ్ పెరుగుతుంది. వాటిలో 501 నుంచి 1500 కిలోమీటర్ల ప్రయాణానికి కేవలం ఐదు రూపాయలు పెంచింది. 1,501 నుంచి 2,500 కిలోమీటర్ల మధ్య ప్రయాణానికి టికెట్ ధర రూ.10 పెంచింది. 2,501 నుంచి 3,000 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.15 ధర పెంచుతున్నట్లు వెల్లడించింది.
ఆర్డినరీ సెకండ్ క్లాస్‌లో 500 కిలోమీటర్లు దాటితే ప్రతి కిలోమీటర్‌కు అర పైసా చొప్పున వడ్డించింది. అలాగే ప్రీమియర్, స్పెషల్ రైలు, రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజ్, హమ్‌సఫర్, అమృత్‌భారత్, మహామన, గతిమాన్, అంత్యోదయ, జన్ శతాబ్ది, యువ ఎక్స్‌ప్రెస్, ఏసీ విస్టాడోమ్ కోచ్‌లు, అనుభూతి కోచ్‌లు, ఆర్డినరీ నాన్–సబర్బన్ సర్వీసులకు పెంచిన ధరలు వర్తించనున్నాయి.
ALSO READ: రైళ్లోనే షాపింగ్.. 125 నిత్యావసరాల వస్తువుల అమ్మకాలు
ఈ విషయాన్ని రైల్వేశాఖ స్వయంగా వెల్లడించింది. ఇక నాన్ ఏసీ మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రతి కిలోమీటరుకు పైసా చొప్పున ధర పెంచారు. ఏసీ క్లాస్‌లలో ప్రతి కిలోమీటర్‌కు రెండు పైసలు పెంచినట్టు తెలిపింది. మెయిల్/ఎక్స్‌ప్రెస్ సెకండ్ క్లాస్‌లో, మెయిల్/ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కాస్‌లో, మెయిల్/ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ క్లాస్‌లోనూ ఒక పైసా పెంచింది.
ఏసీ చైర్‌కార్, ఏసీ–3టయర్/3ఈ, ఏసీ –2 టయర్, ఏసీ ఫస్ట్ క్లాస్/ఈసీ/ఈఏ టికెట్లపై రెండు పైసలు పెంచింది. జూన్ ఒకటి నుంచి బుక్ చేసిన టికెట్లకు ఈ సవరించిన ధరలు వర్తించనున్నాయి. పీఆర్‌ఎస్, యూటీఎస్, మాన్యువల్ టికెటింగ్ వ్యవస్థల్లో సవరించిన కొత్త ధరలు కనిపించేలా సిస్టమ్స్‌ను అప్‌డేట్ చేశారు. రిజర్వేషన్ ఫీజు, సూపర్ ఫాస్ట్ సర్‌చార్జీలు, ఇతర చార్జీల్లో ఎలాంటి మార్పులు లేవు. అలాగే వస్తుసేవల పన్నులో ఎలాంటి మార్పులేవు.
గతంలో రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు రిజర్వేషన్ చార్టింగ్ ప్రిపేర్ అయ్యేది. ఇప్పుడది ఎనిమిది గంటల ముందు చేయనుంది. రైలు మధ్యాహ్నం 2 గంటలకు లేదా అంతకుముందు బయలుదేరితే వాటి చార్టులను మునుపటి రాత్రి 9 గంటలకు రెడీ కానున్నాయి.