Rajamahendravaram Railway Station: దేశ వ్యాప్తంగా ఉన్న పలు రైల్వే స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించింది. తాజాగా మరో రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి ఆమోదం తెలిపింది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యాధునిక సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నది. త్వరలోనే పునర్నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలోపెట్టుకుని వీలైనంత త్వరగా పనులు మొదలుపెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి రూ. 271 కోట్లు కేటాయింపు
రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి కోసం తాజాగా రైల్వేశాఖ రూ. 271.43 కోట్లు మంజూరు చేసింది. వాస్తవానికి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ను పునర్నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఎన్నికలకు ముందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన కూడా చేశారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ. 250 కోట్లు అవసరం అవుతాయని ఎస్టిమేషన్ వేశారు. కానీ, కొద్ది రోజుల్లోనే కొత్త ప్రతిపాదనలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రక్రియ టెండర్ల దశలోనే నిలిచిపోయాయి.
కొత్త ప్రతిపాదనలకు రైల్వేశాఖ ఆమోదం
ఇక తాజాగా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ కి సంబంధించి కొత్త ప్రతిపాదనలకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. రాజమహేంద్రవరం స్టేషన్ ఈస్ట్, వెస్ట్ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ఈ పునర్నిర్మాణం చేపట్టబోతున్నారు. తాజాగా కేటాయించిన నిధులతో రైల్వేస్టేషన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఫ్లాట్ ఫారమ్స్ మధ్య కనెక్టివిటీని పెంచేందుకు స్టేషన్ ఇరువైపుల పాదచారులు వెళ్లేలా రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు ఫ్లాట్ ఫామ్ ను నిర్మించనున్నారు.
భారీగా పెంచనున్న పార్కింగ్ సామర్థ్యం
అటు రైల్వే స్టేషన్ కు సంబంధించి చక్కటి పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ప్రస్తుతం ఉన్న పార్కింగ్ సరిగా లేకపోవడంతో దాని సామర్థ్యాన్ని మరింతగా పెంచనున్నారు. కార్ పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. గోదావరి పుష్కరాలను దృష్టలో పెట్టుకుని పనులను త్వరగా ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. పుష్కరాలు ప్రారంభం కావడానికి ముందే స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ దిశగా రైల్వే అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
♦తూర్పు గోదావరి జిల్లా అభివృద్ది లో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ రాజమహేంద్రవరం.. రైల్వే స్టేషన్ పునరాభివృద్దికి 271 కోట్ల 43 లక్షల రూపాయలు మంజూరు చేసింది.
♦ఈ నిధులను ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఖర్చు చేస్తారు. pic.twitter.com/xdjJMmZGwP— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 24, 2025
ఇక ఇప్పటికే రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణలోని సికింద్రాబాద్, యాదాద్రిభువనగిరి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు సుమారు 40 శాతం పూర్తయ్యాయి. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అటు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ ను అద్భుతంగా తీర్చిదిద్దేంకు నిధులు కేటాయించింది.
Read Also: డబ్బులు లేకుండానే టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఇండియన్ రైల్వే సూపర్ సర్వీస్ గురించి మీకు తెలుసా?